‘ఫెడ్’ప్రభావం తక్కువే..
అక్కడ వడ్డీరేట్లు పెంచినా
మనపై అంత ప్రతికూలత ఉండదు..
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా వడ్డీ రేట్లు పెంచినా మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రతికూల ప్రభావం చూపదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (క్యాడ్) కొద్దిగా పెరుగుతుందన్నారు. డాలరుతో రూపాయి విలువ ఇప్పటికే బాగా క్షీణించడం వల్ల అమెరికా వడ్డీరేట్ల ప్రభావం వల్ల మరింత తగ్గే అవకాశాలు తక్కువేనన్న అభిపాయ్రాన్ని వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఫౌండర్ డెరైక్టర్ డాక్టర్ వహిదుద్దీన్ ఖాన్ స్మారకోపన్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ అమెరికా వడ్డీరేట్లు పెంచితే స్వల్పకాలానికి మార్కెట్లు కొద్దిగా కుదుపునకు లోనవుతాయే కానీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదన్నారు.
ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ బేస్ రేట్ మార్పుపై స్పందిస్తూ ఇది నిరంతర ప్రక్రియని, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ప్రైసింగ్ ప్రకారం మార్చాలని చూస్తోందన్నారు. అంతకముందు స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ తన ఐదేళ్ల పదవీ కాలమంతా సంక్షోభాలతో నడించిందన్నారు. అమెరికా సబ్ ప్రైమ్, యూరప్ రుణ సంక్షోభం తర్వాత కరెన్సీ క్షీణించడం వంటి వరస సంక్షోభాలను చవి చూడాల్సి వచ్చిందన్నారు. వీటన్నింటిల్లో 2013లో జరిగిన రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం పెను సవాల్‌గా నిలిచిందన్నారు. ఆ సమయంలో కేవలం మూడు నెలల్లో రూపాయి విలువ 17 శాతం క్షీణించిందన్నారు. మిగిలిన సంక్షోభాలను అర్థం చేసుకొని పరిష్కార మార్గం కనుక్కోవడానికి తగిన సమయం ఉండేదని, కానీ కరెన్సీ విలువ పతనాన్ని అడ్డుకోవడానికి అప్పటికప్పుడు రియల్ టైమ్‌లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేదన్నారు. ఇలాంటి సమయంలో తీసుకున్న నిర్ణయాలు మార్కెట్‌కు నమ్మకం కలిగించకపోవడంతో రూపాయి మరింత క్షీణించేదన్నారు.
ప్రపంచంలో ఏ దేశ రాజకీయ నాయకులైనా, కార్పొరేట్లు అయినా.. వడ్డీరేట్లు తగ్గించడం ద్వారా జీడీపీ వృద్ధి రేటును పెంచాలని డిమాండ్ చేస్తుంటారే కానీ వడ్డీరేట్లు పెంచడం ద్వారా ధరలను తగ్గించాలని పేదవాడి కోసం ఎవరూ అడగరని దువ్వూరి వ్యాఖ్యానించారు. ఇందుకు ఇండియా కూడా మినహాయింపు కాదన్నారు. కానీ వడ్డీరేట్లు తగ్గింపునకు కొత్త ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధం లేదన్నారు. ధరల స్థిరీకరణ, వృద్ధిరేటు, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆర్‌బీఐ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో అప్పటి సంక్షోభాలు వాటిని ఎదుర్కొన్న తీరును ఆ సందర్భంలో వచ్చిన విమర్శలను దువ్వూరి వివరించారు.