ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కి కొత్తసారొచ్చారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. కాగా, పదవీ కాలం పూర్తయిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజన్ బాధ్యతల స్వీకరణ, దువ్వూరి పదవీ విరమణ ఒకే రోజు నేపథ్యంలో ఇరువురూ అభినందనలు తెలుపుకున్నారు. కాగా, బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజన్ తొలిసారిగా గవ ర్నర్ హోదాలో విలేకరులతో మాట్లాడారు. వస్తూవస్తూనే భారీ చర్యల ప్యాకేజీ తీసుకొచ్చారు. స్వల్పకాలంలో చేపట్టబోయే సవివర రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. రూపాయి అథపాతాళానికి పడిపోయి విలవిల్లాడుతున్న ఫైనాన్షియల్ మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చేవిధంగా పలురకాల సెటిల్‌మెంట్‌లను రూపాయిల్లో జరుపుకోవడం తదితర చర్యలను ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థకు ఈ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎలాంటి చికిత్స చేస్తారనేదానిపైనే చర్చ నడుస్తోంది. యాభై ఏళ్లకే ఆర్‌బీఐ చీఫ్‌గా వచ్చి ఈ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా రాజన్ నిలిచారు. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు.దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగానే ఉందని, అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరలను కట్టడి చేయడంతోపాటు సమీకృత ఆర్థికాభివృద్ధిపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. పడిపోతున్న వృద్ధిరేటును తిరిగి గాడిలోపెట్టడం, ఆర్థిక స్థిరీకరణకు కృషి చేస్తామని చెప్పారు.
ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా తాజా మాజీ గవర్నర్ దువ్వూరి వృద్ధిరేటు పడిపోతున్నా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వడ్డీరేట్లు తగ్గించాలని కార్పొరేట్లు పదేపదే డిమాండ్ చేసినా ఆయన ధరలను దించడమే తొలి ప్రాధాన్యమంటూ అనేకసార్లు తేల్చిచెప్పారు కూడా. ఈ విషయంలో చిదంబరం, ప్రభుత్వం చేసిన సూచనలను కూడా పక్కనబెట్టడంతో తీవ్రమైన విభేదాలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ రాజన్ వృద్ధిపై దృష్టిపెడతామని అంటూ పరోక్షంగా వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలివ్వడం గమనార్హం.
చకచకా కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లు...
జనవరికల్లా కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లను జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాజన్ వెల్లడించారు. లెసైన్స్‌లు ఇచ్చేవిషయంలో అత్నున్నత ప్రమాణాలు, పారదర్శకత, పరిశీలన జరుపుతామని పేర్కొన్నారు. కొత్త బ్యాంకుల ఏర్పాటు కోసం టాటా, బిర్లా, అంబానీలతోసహా మొత్తం 26 కార్పొరేట్ సంస్థలు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుల మదింపునకు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు రాజన్ తెలిపారు. గడచిన 20 ఏళ్లలో ప్రైవేటు రంగంలో 12 బ్యాంకులకు ఆర్‌బీఐ లెసైన్స్‌లు ఇచ్చింది. 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్‌లకు దక్కిన లెసైన్స్‌లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు కొత్త బ్యాంకులకు ఆర్‌బీఐ తెరతీయనుంది.
సమీక్ష తేదీ మార్పు...: ఈ నెల 18న జరగాల్సిన ఆర్‌బీఐ పాలసీ సమీక్షను కొత్త గవర్నర్ రాజన్ 20కి మార్చారు. ఇదే ఆయనకు తొలి పాలసీ సమీక్ష ప్రకటన కానుంది. మరోపక్క, మానిటరీ పాలసీ విధివిధానాలు, ఆర్థిక స్థిరీకరణ, మారుమూల ప్రాంతాలకూ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), బ్యాంకుల్లో మొండిబకాయిలను తగ్గించడం వంటి వాటిపై కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజన్ ప్రకటించారు. ‘పడిపోతున్న దేశీ కరెన్సీకి చేయూతనిచ్చేలా విశ్వాసం పెంచే ద్రవ్య స్థిరీకరణ అనేది ఆర్‌బీఐ ప్రాథమిక కర్తవ్యం.
అంతిమంగా స్థిరమైన, తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణమే లక్ష్యం. రూపాయి పతనం, సరఫరాపరమైన అడ్డంకులు, డిమాండ్ ఒత్తిళ్లు ఇలా దేశీయ పరిణామాలు వేటివల్లయినా ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు. అయితే, సమగ్ర వృద్ధిరేటు, అభివృద్ధి అనేవి కూడా చాలా ప్రధానమైన అంశాలే. ఆర్థిక స్థిరీకరణా ముఖ్యం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. మరోపక్క, ధరల కట్టడే లక్ష్యంగా పనిచేసిన దువ్వూరి విషయంపై స్పందించాలని విలేకరులు కోరగా... ఈ నెల 20 (పాలసీ సమీక్ష) వరకూ దీనిపై నేను ఎలాంటి కామెంట్స్ చేయను’ అని స్పందించారు.
వృద్ధి రేటు పుంజుకుంటుంది...
దేశ ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని, కొన్ని సానుకూల పరిణామాలు కనబడుతున్న నేపథ్యంలో వృద్ధికి ఊతం లభించగలదని రాజన్ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి పుంజుకోవడం కోసం పలు సంస్కరణలను తాను బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రకటిస్తునట్లు తెలిపారు. ఇక భారత్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తామన్న స్టాండర్డ్ అండ్ పూర్స్ హెచ్చరికలపై స్పందిస్తూ... మూడింట ఒకవంతు చాన్స్ ఉందని ఎప్పటినుంచో ఈ ఏజెన్సీ చెబుతోంది. ఇందులో కొత్తేమీలేదన్నారు.
మరిన్ని చర్యలకు ప్రణాళిక...: బ్యాంకులకు అమలయ్యే చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని తగ్గించేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని రాజన్ సంకేతాలిచ్చారు. భారత్‌లో విదేశీ బ్యాంకుల కార్యకలాపాలపై మరింత నియంత్రణ, పర్యవేక్షణను తీసుకొచ్చే ప్రణాళికల్లో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. మరోపక్క, ఆర్‌బీఐ ముందస్తు అనుమతి లేకుండానే దేశీ బ్యాంకులు శాఖలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కల్పించనున్నట్లు రాజన్ హామీనిచ్చారు. మార్కెట్లలో సంస్కరణలను ఒక్కొక్కటే ప్రవేశపెడతామని..
ముఖ్యంగా సెబీతో సంప్రదింపుల ద్వారా పొజిషన్లు, పెట్టుబడులపై నియంత్రణలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. ఓవర్‌నైట్ వడ్డీరేట్లపై కూడా వడ్డీరేట్ల ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాజన్ వెల్లడించారు. నగదురూపంలో సెటిల్ చేసుకునే పదేళ్ల కాలపరిమితిగల వడ్డీరేట్ల ఫ్యూచర్స్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇంకా, రిటైల్ ద్రవ్యోల్బణంతో అనుసంధానించే ద్రవ్యోల్బణ సూచీ సేవింగ్స్ సర్టిఫికెట్లను కూడా జారీచేయనున్నట్లు వెల్లడించారు.
బ్యాంకర్ల శుభాకాంక్షలు..
ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజన్‌కు పలువురు బ్యాంకర్లు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విజ్ఞానిగా పేరొందిన డాక్టర్ రాజన్ నుంచి దేశ ఆర్థిక రంగానికి అత్యుత్తమ సేవలు అందుతాయని ఎస్‌బీఐ చీఫ్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు. ఆర్థిక అనిశ్చిత నేపథ్యంలో రాజన్ లాంటి దార్శనికుడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం మంచి పరిణామమని కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి ఆర్‌బీఐలో కొలువుతీరడం ఆహ్వానించదగ్గ విషయమని బీఓబీ సీఎండీ ఎస్‌ఎస్ ముంద్రా అన్నారు.
ఫేస్‌బుక్‌లో ‘లైక్స్’ కోసం కాదు..
ఆర్‌బీఐకి గవర్నర్‌గా నేతృత్వం వహించడం, బాధ్యతలు నెరవేర్చడం అంటే ఫేస్‌బుక్‌లో లైక్స్ సంపాదించడం లేదంటే ఎవరిదైనా మనసు గెలుచుకోవడం వంటిది కాదని రాజన్ వ్యాఖ్యానించారు. తద్వారా తాను కొన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ‘ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం అనేది ఈ స్థానంలోకి వచ్చే వ్యక్తి పేరుప్రఖ్యాతుల నుంచే మొదలవుతుంది. అయితే, నేను తీసుకునే కొన్ని చర్యలు అంతగా పేరొందకపోవచ్చు. రుచించకపోవచ్చు’ అని పేర్కొన్నారు. విమర్శలకు తాను వెరవనని... సరైనదనుకుంటే ఎలాంటి చర్యలకైనా వెనుకాడనని కూడా ఆయన తేల్చిచెప్పారు. సద్విమర్శలైతే వాటిని ఆచరణలో పెట్టడానికి కూడా సిద్ధమేనన్నారు.