వృద్ధిని ఊహించటం కష్టమవుతోంది
ప్రభుత్వ విధానాలతో ఊహించని పరిణామాలు
► 2008లో ఆర్థిక సంక్షోభంతో వృద్ధి తల్లకిందులు
► తయారీ మినహా అన్ని రంగాలూ ప్రతికూలంలోనే
► ఉద్యోగ నైపుణ్యాల కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది
► ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘పలు ప్రభుత్వ విధానాల కారణంగా దేశ ఆర్థికాభివృద్ధిని ముందే ఊహించడం కష్టం. ఎందుకంటే 2003–08 మధ్య దేశ జీడీపీ 9 శాతం. కానీ, 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో మొత్తం తల్లకిందులైంది. జీడీపీ 5 శాతానికి పడింది. పెట్టుబడులూ తగ్గాయి. అభివృద్ధికి ప్రధానమైనవి పెట్టుబడులు, ఉత్పాదకత. అవి పెరిగితేనే అభివృద్ధిని అంచనా వేయొచ్చు’’ అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. రోటరీ క్లబ్, ఫ్యాప్సీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారమిక్కడ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ‘‘పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవసాయ, సేవలు, ఐటీ రంగంలో ఉద్యోగాలు పడిపోయాయి. తయారీ రంగంలో పెట్టుబడులు పెరగాలి. అప్పుడే ఉద్యోగాలు వస్తాయి’’ అని చెప్పారాయన.
దేశంలో ఏటా వేల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నా వీరిలో సగానికి పైగా విద్యార్థులకు నైపుణ్యం ఉండట్లేదని, అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారాయన. నైపుణ్యమున్న ఉద్యోగుల కోసం ప్రపంచం ఎదురుచూస్తోందంటూ... దీన్ని మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రైవేట్ సంస్థల డబ్బులు, ప్రభుత్వం విధానాలు రెండూ కలిస్తేనే పీపీపీ విధానంలో నిపుణులు వస్తారు. ఈ విషయంలో చైనా నుంచి మనం నేర్చుకోవాలి. అక్కడి పీపీపీ విధానాలను అవలంభించాలి’’ అని దువ్వూరి సూచించారు. మన విద్యార్థుల్లో నైపుణ్యం, పరిశోధన రెండూ కొదవేనని అభిప్రాయపడ్డారు.
పరిణతి చెందిన మార్కెట్ ఏదీ?
దేశంలో పరిణతి చెందిన మార్కెట్ లేదని దువ్వూరి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలోని సవాళ్లను గుర్తించి, వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం, బ్యాంకులూ దృష్టిసారించాలని సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే స్థలం, విద్యుత్, నీళ్ల వంటి మౌలిక వసతులు, రాయితీలు అందించడంతోనే పెట్టుబడులు రావని.. కట్టుదిట్టమైన చట్టాలు కూడా ఉంటేనే పారదర్శక పెట్టుబడులొస్తాయని చెప్పారాయన. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీతో వృద్ధి నత్తనడకన సాగుతోందని, ఇది మరికొద్ది కాలమే నని చెప్పారు. దీర్ఘకాలంగా బ్రిక్స్‌లోని ఇతర దేశాల కంటే మన దేశ జీడీపీ రెండింతలు వృద్ధి చెందుతుందని చెప్పారాయన. కార్యక్రమంలో రోటరీ క్లబ్ తరఫున జె. అబ్రహం, ఎఫ్‌టాఫ్సీ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.