భారీ బ్యాంకులతో ముప్పే
ముంబై: చిన్న చిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి ఒకటో, రెండో ప్రపంచ స్థాయి భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న వాదనలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు. ఇలాంటి బ్యాంకుల వల్ల ఆర్థిక సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ తరహా బ్యాంకుల వల్లే 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభం వచ్చి పడిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కావాల్సినది గుత్తాధిపత్యం కాదని, ఒకటో రెండో అత్యంత భారీ బ్యాంకుల కన్నా నాలుగైదు పెద్దస్థాయి బ్యాంకులు అవసరమని దువ్వూరి తెలిపారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మంగళవారం ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారీ బ్యాంకుల వల్ల సంక్లిష్టతతో పాటు నైతిక సమస్యలు పెరుగుతాయన్నారు.
విలీనాల వల్ల అధిక మూలధనం అందుబాటులో ఉంటుందని, డిమాండ్‌కి తగినట్లు రుణాలు మంజూరు చేసే వీలుతో పాటు జీడీపీ వృద్ధికి, వ్యయాల తగ్గింపునకు ఉపయోగ పడుతుందని దువ్వూరి చెప్పారు. అయితే, నియంత్రణపరమైన సమస్యలూ తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. అత్యంత భారీ బ్యాంకులు గుత్తాధిపత్య ధోరణులను ప్రదర్శించగలవని, దీనివల్ల పోటీ దెబ్బతింటుందని దువ్వూరి పేర్కొన్నారు. భారత్ వంటి వర్ధమాన ఎకానమీ కోసం అత్యంత భారీ బ్యాంకులు కొన్నైనా అవసరమని ఆర్థిక మంత్రి చిదంబరం చెబుతున్న నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచ స్థాయికి చాలా కాలం
భారత బ్యాంకులు అతి పెద్ద గ్లోబల్ బ్యాంకుగా ఎదగాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పట్టేస్తుందని సుబ్బారావు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ.. అంతర్జాతీయస్థాయిలో చూస్తే 60వ స్థానంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయబద్ధమైన పద్ధతిలో విస్తరిస్తే.. ఎదగాలంటే చాలా కాలం పడుతుందని ఆయన తెలిపారు. 1991 ప్రారంభంలో ఆర్థిక రంగ సంస్కరణలను ప్రవేశపెట్టినప్పట్నుంచి బ్యాంకుల కన్సాలిడేషన్ అంశం ప్రాధాన్యం సంతరించుకుందని దువ్వూరి పేర్కొన్నారు. 1969లో తొలిసారి బ్యాంకులను జాతీయం చేసినప్పట్నుంచి 41 విలీనాలు జరిగాయని, ఇందులో 17 డీల్స్ ..1991కి ముందు మిగతావి ఆ తర్వాత జరిగాయన్నారు.
చిన్న బ్యాంకులతో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ తోడ్పాటు..
చిన్న వ్యాపారులు, రైతులు, ఇతర అసంఘటితరంగ సంస్థలకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు చిన్న బ్యాంకులు ఉపయోగపడతాయని, వీటి వల్ల అందరికీ ఆర్థిక సేవలు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) సాధ్యపడగలవని దువ్వూరి పేర్కొన్నారు. అయితే.. స్థానిక ఎకానమీ పరిస్థితుల నుంచి వీటికీ రిస్కులు ఉంటాయన్నారు. ప్రాంతీయ చిన్న బ్యాంకులు విఫలమైనా దాని ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై పెద్దగా ఉండబోదని, పరిష్కారం కూడా సులువుగానే ఉండగలదని పేర్కొన్నారు.
ఎన్‌బీఎఫ్‌సీలన్నీ ఆర్‌బీఐ నియంత్రణలోనే ఉండాలి..
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై (ఎన్‌బీఎఫ్‌సీ) నియంత్రణాధికారాలను ఆర్‌బీఐ నుంచి దూరం చేసి ఏకీకృత ఆర్థిక సంస్థ అధీనంలో ఉంచడం సరికాదని దువ్వూరి అభిప్రాయపడ్డారు. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని, ఫలితంగా ద్రవ్య విధానంపైనా ప్రతికూల ప్రభావం పడగలదని చెప్పారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతరత్రా డిపాజిట్లు తీసుకునే సంస్థలకు మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయని.. ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లు స్థిరంగా ఉండాలంటే ఇవన్నీ ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోనే ఉండాలని దువ్వూరి పేర్కొన్నారు.
సీఆర్‌ఆర్ తగ్గాలి..: నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్) మరింత తగ్గించాల్సిన అవసరం ఉండొచ్చని భావిస్తున్నట్లు దువ్వూరి చెప్పారు. సీఆర్‌ఆర్ తగ్గించాలని లేదా కనీసం వడ్డీ అయినా ఇవ్వాలని, అలాగే ఎస్‌ఎల్‌ఆర్‌ను తగ్గించాలంటూ బ్యాంకర్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తినా ససేమిరా అన్న దువ్వూరి తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం సీఆర్‌ఆర్ 4 శాతంగాను, ఎస్‌ఎల్‌ఆర్ 23 శాతంగానూ ఉన్నాయి.