ముంబై: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు బ్యాంకులకు నిధులు అవసరమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. రుణ వితరణతోపాటు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే అందుకు బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు కీలకమవుతాయన్నారు. ‘‘ఇటువంటి సమయాల్లో బ్యాంకులు తమ పాలనను, సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ముందస్తు అంచనాలతో అవి నిధులను సమకూర్చుకోవాలి. అంతేకానీ ఆ అవసరం ఏర్పడే వరకు వేచి చూడరాదు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చురుగ్గా వ్యవహరిస్తూ తమ వద్ద తగినంత మిగులు నిధులు ఉండేలా చూసుకోవాలి’’ అని శక్తికాంతదాస్ అన్నారు. ఎస్‌బీఐ నిర్వహించిన బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించిన సందర్భంగా ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.లాక్‌డౌన్, అనంతర పరిణామాలతో మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) పెరిగే అవకాశాలు ఉన్నాయని గవర్నర్ అంచనా వేశారు. కరోనా కారణంగా తమ బ్యాలెన్స్ షీట్లపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని ఆర్‌బీఐ ఇటీవలే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను కోరింది. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా సమస్యలను అధిగమించడం, నిధులు సమీకరించడంపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించినట్టు శక్తికాంతదాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment