
అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి కాలంలో పాతాళానికి పడిపోయిన రూపాయి మారకం విలువ అనూహ్యంగా కోలుకోవడం, ముడిచమురు ధరల మంట చల్లారడంతో ఆర్‌బీఐ కఠిన పాలసీకి కాస్త విరామం ఇచ్చేందుకు దోహదం చేసింది. కాగా, తాము అనుకున్నవిధంగా ధరలు గనుక అదుపులో ఉంటే రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తామన్న సంకేతాలివ్వడం రుణ గ్రహీతలకు కాస్త ఊరటకలిగించే అంశం. మరోపక్క, మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు చేయూనిచ్చేందుకు రుణాల జోరు పెంచాల్సిందిగా బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించడం కూడా గమనార్హం.
ముంబై: ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా బుధవారం నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం, రివర్స్ రెపో రేటు 6.25 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రెండుసార్లు(జూన్, ఆగస్ట్ నెలల్లో) రెపో రేటును పావు శాతం చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ ఘోరంగా పడిపోయినప్పటికీ అక్టోబర్ పాలసీలో రెపో రేటును పెంచకుండా ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తటస్థ పరపతి విధానం నుంచి క్రమానుగత కఠిన విధానానికి(రేట్ల పెంపు) మారుతున్నట్లు పేర్కొంది. కాగా, తాజా పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఒకరైన రవీంద్ర ధోలకియా వెల్లడించారు. ఆర్‌బీఐ ప్రస్తుత కఠిన పాలసీ విధానాన్ని మళ్లీ తటస్థానికి మార్చే ప్రతిపాదనకు ఒక సభ్యుడే అనుకూలంగా ఓటేశారని ఆయన చెప్పారు.
లిక్విడిటీ బూస్ట్...
చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని దశలవారీగా 18 శాతానికి చేర్చాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీనికోసం ఎస్‌ఎల్‌ఆర్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి పావు శాతం కోత విధించనున్నట్లు వెల్లడించింది. 2019 తొలి త్రైమాసికం నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా కొంత మొత్తాన్ని ప్రభుత్వ బాండ్‌లు, ఇతర సాధనాల్లో కచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిమాణాన్ని ఎస్‌ఎల్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. దీన్ని తగ్గించటం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. అంటే ద్రవ్య లభ్యత(లిక్విడిటీ) పెరుగుతుంది. తద్వారా బ్యాంకుల రుణ వితరణ కూడా పెరిగేందుకు దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఎస్‌ఎల్‌ఆర్ 19.5%గా ఉంది. అంటే ఆర్‌బీఐ తాజా ప్రతిపాదన ప్రకారం 2020 జూన్ నాటికి 18% ఎస్‌ఎల్‌ఆర్ లక్ష్యం నెరవేరనుంది. కాగా, ఆర్‌బీఐ తాజా చర్యలతో వచ్చే ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.1–1.5 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎకనమిస్ట్ రజని థాకూర్ పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం(2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి నాటికి) రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. గత పాలసీ సమీక్షలో 3.9–4.5 శాతంగా అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 2.7–3.2 శాతానికి కోత విధించింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయి (రెండు శాతం అటుఇటుగా)లో కట్టడి చేయాలన్న లక్ష్యానికి చాలా దిగువనే తాజా అంచనాలు ఉండటం గమనార్హం. ‘గత పాలసీ సమీక్ష సందర్భంగా ప్రస్తావించిన కొన్ని ద్రవ్యోల్బణం రిస్కులు ఇప్పుడు శాంతించాయి. ముడిచమురు ధరలు దిగిరావడం ఇందులో ప్రధానమైనది. అయితే, భవిష్యత్తులో ద్రవ్యోల్బణం విషయంలో పలు అనిశ్చిత పరిస్థితులు ఇంకా ఉన్నాయి’ అని ఆర్‌బీఐ పేర్కొంది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టమైన 3.31 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే.
వృద్ధి రేటు 7.4 శాతం...
2018–19 ఏడాది ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 7.4 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం వంటివి మన ఆర్థిక వ్యవస్థలో మందగమన రిస్కులను పెంచొచ్చని ఎంపీసీ వ్యాఖ్యానించింది. గరిష్ట స్థాయిల నుంచి పడిపోయిన ముడిచమురు ధరలు ఇలాగే కొనసాగితే సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ ఆరంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85 డాలర్లను తాకి.. తాజాగా 60 డాలర్ల దిగువకు పడిపోవడం తెలిసిందే. కాగా, వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవాల్సి ఉందని.. దీనికోసం ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటును కట్టడిలో ఉంచడం) చాలా కీలకమని ఎంపీసీ స్పష్టం చేసింది.
రిస్కులు తగ్గితే రేట్ల కోతకు చాన్స్
ద్రవ్యోల్బణం పెరుగుదలకు సంబంధించి పొంచిఉన్న రిస్కులు తగ్గుముఖం పడితే రానున్న రోజుల్లో వడ్డీరేట్ల తగ్గింపునకు ఆస్కారం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంకేతాలిచ్చారు. ద్రవ్యోల్బణం ఇటీవల ఆశ్చర్యకరంగా దిగిరావడాన్ని ప్రస్తావిస్తూ... ఈ ధోరణి నిలకడగా కొనసాగుతుందన్నది తెలియాలంటే మరింత డేటాను పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులు గనుక తొలగిపోవడం లేదా తగ్గుముఖం పట్టడం జరిగితే తదుపరి గణంకాల్లో దాని ప్రభావం కనబడుతుంది. ఇదే జరిగితే పాలసీ చర్యలు సానుకూలంగా (రేట్ల కోత విషయంలో) ఉండేందుకు అవకాశం లభిస్తుంది’ అని ఉర్జిత్ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలి కాలంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక ఉదంతాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందించేందుకు ఆయన నిరాకరించడం గమనార్హం. ఆర్‌బీఐ వద్దనున్న మిగులు నిధుల్లో కొంతమొత్తాన్ని(రూ.3 లక్షల కోట్లు) కేంద్ర ప్రభుత్వం తమకు బదలాయించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ‘ఆర్‌బీఐ స్వేచ్ఛ విషయంలో ఇటీవల వెలువడిన కథనాలకు సంబంధించి మీరడిగిన ప్రశ్నలకు ఎంపీసీ తీర్మానానికి ఏమైనా సంబంధం ఉందా? మేం పరపతి విధానం, స్థూల ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు సమావేశమయ్యాం. అందుకే దీనిపై మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేను’ అని స్పష్టం చేశారు.
అంచనా వేసినట్టుగానే...
కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ఆచరణాత్మకంగా, సర్దుబాటు తీరులో.. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉందని బ్యాంకర్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగేందుకు రిస్క్‌లు ఉన్నప్పటికీ... రానున్న రోజుల్లో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించడం ద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ అంచనాలకు తగ్గట్టే ఆర్‌బీఐ నిర్ణయం ఉంది. పాలసీ గైడెన్స్ మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్‌బీఐ తగ్గించడం అన్నది మరిం త స్థిరమైన, ఊహించతగిన వడ్డీ రేట్ల విధానంపై మార్కెట్ వర్గాల్లో భరోసా కల్పించింది.
–రజనీష్ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్
ద్రవ్యోల్బణం పెరిగే విషయంలో ఉన్న రిస్క్‌లు ఆచరణలో కనిపించకపోతే పాలసీ విధానం మార్చుకునే అవకాశం ఉందన్న విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. రేట్ల పరంగా తటస్థ విధానాన్ని ఎంపీసీ ఎక్కువ కాలం పాటు కొనసాగిస్తుందని భావిస్తున్నాం. ఇది రేట్ల తగ్గింపు అవకాశాలపై మాకు నమ్మకం కలిగిస్తోంది.
– బి.ప్రసన్న, ఐసీఐసీఐ బ్యాంకు గ్లోబల్ మార్కెట్స్ గ్రూపు హెడ్
ఆర్‌బీఐ రేట్లలో మార్పులు చేయకపోవడం నిధుల వ్యయాల విషయంలో నమ్మకాన్ని కలిగిస్తుంది. రుణాలపై ఫ్లోటింగ్ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌లతో అనుసంధానించడం అనేది దీర్ఘకాలంలో రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణాలపై వ్యయాలు తగ్గడానికి దారితీస్తుంది.
– చంద్రశేఖర్ ఘోష్, బంధన్ బ్యాంకు సీఈవో
ఊహించిందే: కార్పొరేట్లు
పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. ‘ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే తక్షణం వ్యవస్థలో రుణ వితరణ మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వృద్ధి రేటు మందగమనం సంకేతాలు వెలువడ్డాయి. ముడిచమురు ధరలు దిగొచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ రషేశ్ షా పేర్కొన్నారు. రూపాయి విలువ మళ్లీ పుంజుకోవడం, క్రూడ్ ధరల క్షీణత, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం వంటివి ఆర్‌బీఐ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు కారణమని అసోచామ్ వ్యాఖ్యానించింది. కాగా, ఎక్కడి రేట్లను అక్కడే కొనసాగించడాన్ని రియల్టీ రంగం స్వాగతించింది. రెపో రేటును పెంచకుండా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తుందని.. అమ్మకాలు మెరుగుపడతాయని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment