Policy rates
-
రేట్లు పెంచాల్సి ఉంటుంది.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
రానున్న నెలల్లో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నరే స్వయంగా తెలిపారు. ఇప్పటికే పెరిగిపోయిన పలు ధరలపై ఆహార ధరల షాక్‌ల ప్రభావం రెండో రౌండ్లోనూ ఉంటే ఆర్బీఐ కీలక రేట్లను పెంచాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హింట్ ఇచ్చారు. ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముఖ్యాంశాలపై ఆయన మాట్లాడుతూ.. "విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచే ప్రమాదాలపై ఆహార ధరల షాక్‌ల రెండో రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆగస్టు 8 నుంచి 10 మధ్య జరిగిన ఎంపీసీ సమావేశంలో ఈ సంవత్సరం మూడవసారి కూడా రేట్లను యథాతథంగా ఉంచేందకు ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసింది" అన్నారు. అయితే పాలసీ రేటు యథాతథ కొనసాగింపుపై ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. కూరగాయల ధరల స్వల్పకాలిక స్వభావాన్ని బట్టి, ప్రధాన ద్రవ్యోల్బణంపై ధరల మొదటి రౌండ్ ప్రభావాన్ని బట్టి ద్రవ్య విధానం ఉంటుందన్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితంగా కొనసాగుతోందని, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉందని చెప్పారు. వీటన్నింటి మధ్య, భారతదేశం స్థిరంగా నిలుస్తూ ప్రపంచంలో కొత్త గ్రోత్ ఇంజిన్‌గా ఎదుగుతోందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రస్తుత అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఇతర కమిటీ సభ్యులు కూడా అంగీకరించారు. ఈ ఆహార ధరల పరిణామాల వల్ల గృహాల ద్రవ్యోల్బణ భావనలు ప్రభావితమైనట్లు తమ సర్వేలు సూచిస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత.. -
RBI Repo Rate Increased: ఈఎంఐలు మరింత భారం!
ముంబై: గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారమయ్యేలా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచింది. ధరల కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు.. రెపోను మరో 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో 5.4 శాతానికి చేరింది. మే నెల నుంచి రెపో రేటు 1.4 శాతం పెరిగినట్లయ్యింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశం. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఇంకాస్త పెంచనుండటంతో రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకనున్నాయి. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7%గా ఉంటుందన్న అంచనాలను యథాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలోనూ అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది. కోవిడ్–19 కన్నా పావుశాతం అధికం... తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 %కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ భావిస్తోంది. ► రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1%, 6.4%, 5.8 శాతాలుగా నమోదవుతాయి. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5%కి ఇది దిగివస్తుంది. ► భారత్ వద్ద ప్రస్తుతం 550 బిలియన్ డాలర్లకుపైగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నాయి. అధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉంది. ► వృద్ధి ధోరణి కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటూనే ద్రవ్యోల్బణం నియంత్రణే లక్ష్యంగా సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధాన కమిటీ దృష్టి సారిస్తుంది. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ వరకూ డాలర్ మారకంలో రూపాయి మారకపు విలువ 4.7 శాతం పతనమైంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక మూలాధారాల బలహీనత కంటే, అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల రూపాయి విలువ మరింతగా క్షీణించింది. అయినా డాలర్ మారకంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్ కరెన్సీ పటిష్టంగానే ఉంది. ► భారత్‌లోని తమ కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య చెల్లింపుల కోసం ఎన్ఆర్ఐలు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)ను వినియోగించుకునేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించనుంది. ► 2021 ఏప్రిల్–జూన్ మధ్య దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐల పరిమాణం 11.6 బిలియన్ డాలర్లు అయితే, 2022 ఇదే కాలంలో ఈ పరిమాణం 13.6 బిలియన్ డాలర్లకు చేరింది. ► తదుపరి ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ మధ్య జరగనుంది. డిపాజిట్లను సమీకరించుకోండి! రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాల వు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపా జిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధో రణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఐసీఐసీఐ, పీఎన్బీ వడ్డింపు.. న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణాలపై రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ అరశాతం పెంచుతున్నట్టు ప్రకటించిన రోజే ఈ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 9.10%కి పెంచింది. పీఎన్బీ రెపో ఆధారిత రుణ రేట్లను 7.40% నుంచి 7.90%కి పెంచినట్టు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ తెలిపింది. -
వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
ముంబై, సాక్షి: వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును యథాతథంగా 4 శాతం వద్దనే కొనసాగించేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా నిర్ణయించింది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ఎంపీసీ మూడు రోజులపాటు సమాశాలు నిర్వహించింది. దీనిలో భాగంగా యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించింది. దీంతో రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది. అంచనాల సవరణ ఈ ఆర్థిక సంవత్సరానికి(2020-21) జీడీపీపై తొలుత వేసిన -9.5 శాతం అంచనాలను ఆర్బీఐ తాజాగా -7.5 శాతానికి సవరించింది. ద్వితీయార్థం(అక్టోబర్- మార్చి)లో ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని సాధించనున్నట్లు భావిస్తోంది. ఈ బాటలో క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో 0.1 శాతం వృద్ధి సాధించవచ్చని ఊహిస్తోంది. ఇంతక్రితం 5.6 శాతం క్షీణతను అంచనా వేయడం గమనార్హం. ఇదే విధంగా క్యూ4(జనవరి- మార్చి)కి జీడీపీ వృద్ధి అంచనాలను సైతం 0.5 శాతం నుంచి 0.7 శాతానికి పెంచింది. కాగా.. క్యూ3లో రిటైల్ ధరలు(సీపీఐ) 6.8 శాతంగా నమోదుకావచ్చని ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4లో 5.8 శాతానికి దిగిరావచ్చని భావిస్తోంది. -
కీలక వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంవద్దే కొనసాగనుంది. ఈ బాటలో రివర్స్ రెపో సైతం 3.35 శాతంగా అమలుకానుంది. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా కొనసాగనుంది. ఆర్థిక వ్యవస్థకు కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఎంపీసీ ఇందుకు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ ఆర్బీఐ రెపో రేటులో 1.15 శాతంమేర కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తాజా రుణాలపై దేశీ బ్యాంకులు సైతం 0.72-0.8 శాతం మధ్య వడ్డీ రేట్లను తగ్గించాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. -
రుణాలు ఇక పండగే!
ముంబై: పండుగలు మొదలవుతున్న తరుణంలో రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తీపికబురు తెచ్చింది. కీలక పాలసీ రేట్లను అంచనాలకు మించి తగ్గించడంతో... ఇక అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు దిగిరానున్నాయి. నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా తగ్గనుంది. కాగా, దిగజారుతున్న దేశ ఆర్థిక వృద్ధి, పడిపోతున్న డిమాండ్ ఆర్బీఐనీ ఆందోళనకు గురిచేస్తోంది! బుధవారం వెల్లడైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష నిర్ణయాల్లో ఇదే తేటతెల్లమైంది. వృద్ధి క్షీణతకు చెక్ పెట్టేందుకు, వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు తన వంతుగా రేట్ల కోతతో ముందుకు వచ్చింది. 25 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేయగా, ఈ విషయంలో ఆర్బీఐ విశాలంగానే స్పందించి 35 బేసిస్ పాయింట్లను తగ్గించి ఆశ్చర్యపరిచింది. బ్యాంకులకు సమకూర్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా పేర్కొంటారు. ‘‘25 బేసిస్ పాయింట్ల తగ్గింపు సరిపోదు. 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఎక్కువ అవుతుంది. 35 బేసిస్ పాయింట్లు అన్నది సమతుల్యంగా ఉంటుందని ఎంపీసీ భావించింది’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. సాధారణంగా ఆర్బీఐ పావు శాతం లేదా అరశాతం (25 బేసిస్ పాయింట్ల మల్టిపుల్‌లో) మేర రేట్లలో చేసే మార్పులకు, 35 బేసిస్ పాయింట్ల తగ్గింపు అన్నది వినూత్నమే. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ 1.1% రెపో రేటును తగ్గించడం విశేషం. తాజా నిర్ణయం తర్వాత రెపో రేటు 5.4%కి, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్బీఐ సమీకరించే నిధులపై ఇచ్చే రేటు) 5.15%కి దిగొచ్చాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను గతంలో ఉన్న 7% నుంచి 6.9 శాతానికి తగ్గించింది. సర్దుబాటు ధోరణిని కొనసాగించింది. అంటే పాలసీ విషయంలో ఉదారంగా వ్యవహరించే వెసులుబాటు ఈ విధానంలో ఉంటుందని ఆశించొచ్చు. అవసరమైతే భవిష్యత్తులోనూ రేట్ల కోత చేపట్టవచ్చని ఇది సూచిస్తుంది. బలహీనంగా ఆర్థిక రంగం ‘‘దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వృద్ధి తగ్గే రిస్క్‌ను పెంచుతున్నాయి. వృద్ధిపై ఆందోళనలకు పరిష్కారంగా డిమాండ్‌ను పెంచేందుకు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడం అన్నది ఈ దశలో అత్యంత ముఖ్యమైనది’’ అని రేట్ల కోత అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీసీ స్పష్టం చేసింది. -
వడ్డీరేట్లు అక్కడే..!
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఈ వారంలో జరిగే ద్వైమాసిక సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ .. పాలసీ రేట్లను క్రమానుగతంగా కఠినతరం చేసే విధానం నుంచి తటస్థ విధానానికి మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు రేట్ల పెరుగుదల, ద్రవ్యలోటుపరమైన సవాళ్ల కారణంగా కీలక పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని చెబుతున్నారు. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ అంచనా వేసిన 3.8 శాతం కన్నా తక్కువగా 2.6 శాతంగానే నమోదైన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడం, అటు అంతర్జాతీయంగా మందగమన ఆందోళనల నేపథ్యంలో 2018–19లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ సమీర్ నారంగ్ చెప్పారు. పరపతి విధానాన్ని మార్చుకోవడానికి ఆర్బీఐ దీనివల్ల కాస్త వెసులుబాటు లభిస్తుందని, అయితే విద్య, వైద్యం, గృహావసరాల వ్యయాలు అధికంగానే ఉండటం వల్ల రేట్ల తగ్గింపునకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇటు పెరుగుతున్న ముడి చమురు ధరలు, అటు ద్రవ్యపరమైన సవాళ్ల కారణంగా ఈ ఏడాది ఆర్బీఐ పాలసీపరంగా సంక్లిష్టమైన నిర్ణయాలే తీసుకోవాల్సి రావొచ్చని కన్సల్టెన్సీ సంస్థ డీబీఎస్ ఎకనామిక్స్ పేర్కొంది. ఉర్జిత్ పటేల్ నిష్క్రమణ అనంతరం కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ సారథ్యంలో ఫిబ్రవరి 5 నుంచి 7 దాకా మూడు రోజులపాటు ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. 7వ తేదీ(గురువారం) మధ్యాహ్నం పాల సీ నిర్ణయం వెలువడుతుంది. ఈ ఆర్థిక సంవత్స రం రెండు సార్లు రేట్లను పెంచిన ఆర్బీఐ క్రమానుగతంగా కఠినతర విధానాన్ని పాటిస్తోంది. డిసెంబర్లో రేట్లను మార్చకపోయినప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగే రిస్కులు లేకపోతే తగ్గించే సంకేతాలే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశ్లేషకుల అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 9న ఆర్బీఐ బోర్డుతో ఆర్థిక మంత్రి భేటీ.. సాంప్రదాయం ప్రకారం బడ్జెట్ అనంతరం ఫిబ్రవరి 9న ఆర్బీఐ బోర్డు సభ్యులతో ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ సమావేశం కానున్నారు. మధ్యంతర బడ్జెట్లో కీలక అంశాల గురించి వివరించనున్నారు. ఆర్బీఐ ఆరో ద్వైమా సిక పాలసీ విధాన సమీక్ష అనంతరం రెండు రోజులకు ఈ భేటీ జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర డివిడెండ్ చెల్లించాలన్న కేంద్రం సూచన కూడా ఇందు లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం రూ. 28,000 కోట్ల దాకా మధ్యంతర డివిడెండ్ రావొచ్చని అంచనా వేస్తోంది. -
వడ్డీరేట్లు యథాతథం!
అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి కాలంలో పాతాళానికి పడిపోయిన రూపాయి మారకం విలువ అనూహ్యంగా కోలుకోవడం, ముడిచమురు ధరల మంట చల్లారడంతో ఆర్బీఐ కఠిన పాలసీకి కాస్త విరామం ఇచ్చేందుకు దోహదం చేసింది. కాగా, తాము అనుకున్నవిధంగా ధరలు గనుక అదుపులో ఉంటే రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తామన్న సంకేతాలివ్వడం రుణ గ్రహీతలకు కాస్త ఊరటకలిగించే అంశం. మరోపక్క, మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు చేయూనిచ్చేందుకు రుణాల జోరు పెంచాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ సూచించడం కూడా గమనార్హం. ముంబై: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా బుధవారం నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం, రివర్స్ రెపో రేటు 6.25 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రెండుసార్లు(జూన్, ఆగస్ట్ నెలల్లో) రెపో రేటును పావు శాతం చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ ఘోరంగా పడిపోయినప్పటికీ అక్టోబర్ పాలసీలో రెపో రేటును పెంచకుండా ఆర్బీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తటస్థ పరపతి విధానం నుంచి క్రమానుగత కఠిన విధానానికి(రేట్ల పెంపు) మారుతున్నట్లు పేర్కొంది. కాగా, తాజా పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఒకరైన రవీంద్ర ధోలకియా వెల్లడించారు. ఆర్బీఐ ప్రస్తుత కఠిన పాలసీ విధానాన్ని మళ్లీ తటస్థానికి మార్చే ప్రతిపాదనకు ఒక సభ్యుడే అనుకూలంగా ఓటేశారని ఆయన చెప్పారు. లిక్విడిటీ బూస్ట్... చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ని దశలవారీగా 18 శాతానికి చేర్చాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీనికోసం ఎస్ఎల్ఆర్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి పావు శాతం కోత విధించనున్నట్లు వెల్లడించింది. 2019 తొలి త్రైమాసికం నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా కొంత మొత్తాన్ని ప్రభుత్వ బాండ్లు, ఇతర సాధనాల్లో కచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిమాణాన్ని ఎస్ఎల్ఆర్గా వ్యవహరిస్తారు. దీన్ని తగ్గించటం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. అంటే ద్రవ్య లభ్యత(లిక్విడిటీ) పెరుగుతుంది. తద్వారా బ్యాంకుల రుణ వితరణ కూడా పెరిగేందుకు దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఎస్ఎల్ఆర్ 19.5%గా ఉంది. అంటే ఆర్బీఐ తాజా ప్రతిపాదన ప్రకారం 2020 జూన్ నాటికి 18% ఎస్ఎల్ఆర్ లక్ష్యం నెరవేరనుంది. కాగా, ఆర్బీఐ తాజా చర్యలతో వచ్చే ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.1–1.5 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఎల్ బ్యాంక్ ఎకనమిస్ట్ రజని థాకూర్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం(2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి నాటికి) రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. గత పాలసీ సమీక్షలో 3.9–4.5 శాతంగా అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 2.7–3.2 శాతానికి కోత విధించింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయి (రెండు శాతం అటుఇటుగా)లో కట్టడి చేయాలన్న లక్ష్యానికి చాలా దిగువనే తాజా అంచనాలు ఉండటం గమనార్హం. ‘గత పాలసీ సమీక్ష సందర్భంగా ప్రస్తావించిన కొన్ని ద్రవ్యోల్బణం రిస్కులు ఇప్పుడు శాంతించాయి. ముడిచమురు ధరలు దిగిరావడం ఇందులో ప్రధానమైనది. అయితే, భవిష్యత్తులో ద్రవ్యోల్బణం విషయంలో పలు అనిశ్చిత పరిస్థితులు ఇంకా ఉన్నాయి’ అని ఆర్బీఐ పేర్కొంది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టమైన 3.31 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే. వృద్ధి రేటు 7.4 శాతం... 2018–19 ఏడాది ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 7.4 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం వంటివి మన ఆర్థిక వ్యవస్థలో మందగమన రిస్కులను పెంచొచ్చని ఎంపీసీ వ్యాఖ్యానించింది. గరిష్ట స్థాయిల నుంచి పడిపోయిన ముడిచమురు ధరలు ఇలాగే కొనసాగితే సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ ఆరంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85 డాలర్లను తాకి.. తాజాగా 60 డాలర్ల దిగువకు పడిపోవడం తెలిసిందే. కాగా, వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవాల్సి ఉందని.. దీనికోసం ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటును కట్టడిలో ఉంచడం) చాలా కీలకమని ఎంపీసీ స్పష్టం చేసింది. రిస్కులు తగ్గితే రేట్ల కోతకు చాన్స్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు సంబంధించి పొంచిఉన్న రిస్కులు తగ్గుముఖం పడితే రానున్న రోజుల్లో వడ్డీరేట్ల తగ్గింపునకు ఆస్కారం ఉందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంకేతాలిచ్చారు. ద్రవ్యోల్బణం ఇటీవల ఆశ్చర్యకరంగా దిగిరావడాన్ని ప్రస్తావిస్తూ... ఈ ధోరణి నిలకడగా కొనసాగుతుందన్నది తెలియాలంటే మరింత డేటాను పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులు గనుక తొలగిపోవడం లేదా తగ్గుముఖం పట్టడం జరిగితే తదుపరి గణంకాల్లో దాని ప్రభావం కనబడుతుంది. ఇదే జరిగితే పాలసీ చర్యలు సానుకూలంగా (రేట్ల కోత విషయంలో) ఉండేందుకు అవకాశం లభిస్తుంది’ అని ఉర్జిత్ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలి కాలంలో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక ఉదంతాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందించేందుకు ఆయన నిరాకరించడం గమనార్హం. ఆర్బీఐ వద్దనున్న మిగులు నిధుల్లో కొంతమొత్తాన్ని(రూ.3 లక్షల కోట్లు) కేంద్ర ప్రభుత్వం తమకు బదలాయించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ‘ఆర్బీఐ స్వేచ్ఛ విషయంలో ఇటీవల వెలువడిన కథనాలకు సంబంధించి మీరడిగిన ప్రశ్నలకు ఎంపీసీ తీర్మానానికి ఏమైనా సంబంధం ఉందా? మేం పరపతి విధానం, స్థూల ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు సమావేశమయ్యాం. అందుకే దీనిపై మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేను’ అని స్పష్టం చేశారు. అంచనా వేసినట్టుగానే... కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఆచరణాత్మకంగా, సర్దుబాటు తీరులో.. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉందని బ్యాంకర్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగేందుకు రిస్క్‌లు ఉన్నప్పటికీ... రానున్న రోజుల్లో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించడం ద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ నిర్ణయం ఉంది. పాలసీ గైడెన్స్ మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్బీఐ తగ్గించడం అన్నది మరిం త స్థిరమైన, ఊహించతగిన వడ్డీ రేట్ల విధానంపై మార్కెట్ వర్గాల్లో భరోసా కల్పించింది. –రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ద్రవ్యోల్బణం పెరిగే విషయంలో ఉన్న రిస్క్‌లు ఆచరణలో కనిపించకపోతే పాలసీ విధానం మార్చుకునే అవకాశం ఉందన్న విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. రేట్ల పరంగా తటస్థ విధానాన్ని ఎంపీసీ ఎక్కువ కాలం పాటు కొనసాగిస్తుందని భావిస్తున్నాం. ఇది రేట్ల తగ్గింపు అవకాశాలపై మాకు నమ్మకం కలిగిస్తోంది. – బి.ప్రసన్న, ఐసీఐసీఐ బ్యాంకు గ్లోబల్ మార్కెట్స్ గ్రూపు హెడ్ ఆర్బీఐ రేట్లలో మార్పులు చేయకపోవడం నిధుల వ్యయాల విషయంలో నమ్మకాన్ని కలిగిస్తుంది. రుణాలపై ఫ్లోటింగ్ రేట్లను ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌లతో అనుసంధానించడం అనేది దీర్ఘకాలంలో రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై వ్యయాలు తగ్గడానికి దారితీస్తుంది. – చంద్రశేఖర్ ఘోష్, బంధన్ బ్యాంకు సీఈవో ఊహించిందే: కార్పొరేట్లు పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. ‘ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే తక్షణం వ్యవస్థలో రుణ వితరణ మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వృద్ధి రేటు మందగమనం సంకేతాలు వెలువడ్డాయి. ముడిచమురు ధరలు దిగొచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ రషేశ్ షా పేర్కొన్నారు. రూపాయి విలువ మళ్లీ పుంజుకోవడం, క్రూడ్ ధరల క్షీణత, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం వంటివి ఆర్బీఐ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు కారణమని అసోచామ్ వ్యాఖ్యానించింది. కాగా, ఎక్కడి రేట్లను అక్కడే కొనసాగించడాన్ని రియల్టీ రంగం స్వాగతించింది. రెపో రేటును పెంచకుండా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తుందని.. అమ్మకాలు మెరుగుపడతాయని అభిప్రాయపడింది. -
ఫెడ్ వడ్డీ రేటు పెంపు
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లనుమళ్లీ పెంచింది. ప్రామాణిక ఫెడరల్ ఫండ్స్ రేటును 25శాతం పెంచింది. తాజా పెంపుతో ఫెడ్ ఫండ్ రేటు 1.75 శాతం నుంచి 2.0 శాతానికి చేరింది. ఈ సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోం హెచ్. పోవెల్ మాట్లాడుతూ, 2008 ఆర్థిక సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థ గణనీయంగా బలపడిందని, తిరిగి సాధారణ పరిస్తితికి చేరుకుంటోందని పేర్కొన్నారు. 2018లో నిరుద్యోగిత రేటు అంచనాలను 3.6 శాతానికి తగ్గించింది. 2019లో మూడు సార్లు, 2020లో మరో ఒక దఫా రేట్ల పెంపు ఉండనుంది. కాగా ఈ ఏడాది ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి కాగా ఈ సంవత్సరం చివరికల్లా మరో రెండు సార్లు పెంపు ఉంటుందని యూఎస్ ఫెడ్ అధికారుల అంచనా. చివరిసారి గత మార్చిలో వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన ఫెడ్ 2015నుంచి ఏడుసార్లు వడ్డీరేట్లను పెంచినట్లయింది. అలాగే, 2019, 2020 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 2 శాతం పైనే ఉంటుందని కూడా అంచనా వేసింది. -
ఈసారీ ఎక్కడి రేట్లు అక్కడే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లు వరుసగా రెండోసారి కూడా ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని విశ్లేషకులు, బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు పుంజుకున్న నేపథ్యంలో ఇప్పుడు ద్రవ్యోల్బణం నియంత్రణపై అధికంగా దృష్టిపెట్టే అవకాశం ఉందనేది వారి అంచనా. అయిదు త్రైమాసికాల తర్వాత మళ్లీ వృద్ధి మెరుగుదల కారణంగా ఆర్బీఐపై రేట్ల తగ్గింపు ఒత్తిడి తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, పారిశ్రామిక వర్గాలు మాత్రం ఆర్థిక వ్యవస్థలోసానుకూల సెంటిమెంట్‌ను పెంపొందించాలంటే రేట్ల కోత తప్పనిసరి అని డిమాండ్ చేస్తున్నారు. దేశ సార్వభౌమ రేటింగ్‌ను మూడీస్ పెంచిన(అప్‌గ్రేడ్) తరుణంలో దీనికి జతగా ఆర్బీఐ కూడా రేట్లను తగ్గిస్తే.. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి మరింత చేయూతనిచ్చినట్లు అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఈ నెల 5–6 తేదీల్లో పాలసీ సమీక్షను నిర్వహించనుంది. కమిటీ నిర్ణయాన్ని 6న(బుధవారం) ఉర్జిత్ పటేల్ ప్రకటిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో(2017–18)లో ఇది అయిదో ద్వైమాసిక పాలసీ సమీక్ష. అక్టోబర్ సమీక్షలో కూడా ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలున్నాయంటూ ఆర్బీఐ పాలసీ రేట్లలో కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. మరోపక్క, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది కూడా. చివరిసారిగా ఆర్బీఐ రెపో రేటు(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు)ను పావు శాతం తగ్గించి 6 శాతానికి చేర్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. అయితే, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన నిధుల పరిమాణం)ని మాత్రం అర శాతం తగ్గింపుతో... 20 శాతం నుంచి 19.5 శాతానికి చేర్చింది. దీనివల్ల బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. ఇక రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్దఉంచే నిధులపై పొందే వడ్డీరేటు) ప్రస్తుతం 5.75 శాతంగా కొనసాగుతోంది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధుల పరిమాణం. వీటిపై బ్యాంకులకు ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతం వద్ద ఉంది. ఎవరేమంటున్నారు... రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని.. దీనివల్ల ఈసారి పాలసీలో వడ్డీరేట్ల కోతకు ఎలాంటి ఆస్కారం లేదని మెజారిటీ బ్యాంకర్లు అంచనావేస్తున్నారు.‘యథాతథ స్థితిని ఆర్బీఐ కొనసాగించవచ్చు. వ్యవస్థలో ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) చాలా తక్కువగా ఉంది. డిపాజిట్ రేట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులూ పొంచిఉండటమే దీనికి ప్రధాన కారణం’ అని యూనియన్‌బ్యాంక్ ఎండీ, సీఈఓ జి. రాజ్‌కిరణ్ రాయ్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్టానికి (3.58%), టోకు ధరల ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్టానికి(3.59%) ఎగబాకిన విషయం విదితమే. 4 శాతం పైకి రిటైల్ ద్రవ్యోల్బణం: నోమురా వస్తు–సేవల పన్ను(జీఎస్టీ)అమలు తర్వాత ఉత్పత్తి ధరలు కొద్దిగా తగ్గినప్పటికీ... ముడివస్తువుల ధరల ఒత్తిళ్లు పెరిగాయి. దీంతోపాటు అధిక ఆహార ద్రవ్యోల్బణం కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం.. నవంబర్‌లో ఆర్బీఐ లకి‡్ష్యత 4%కి మించి ఎగసే అవకాశం ఉందని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం నోమురా అభిప్రాయపడింది. ‘ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ కఠిన విధానాన్ని ఎంచుకోవచ్చు. పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకూ ఆస్కారం లేదు’ అని తాజా నివేదికలో పేర్కొంది. రేట్ల కోతకు మంచి అవకాశం ఇది: ఫిక్కీ ఆర్థిక వ్యవస్థలో విశ్వాస స్థాయిలను మరింతగా పెంపొందించేందుకు ఇదే మంచి తరుణమని.. రేట్ల కోతతో ఆర్బీఐ తోడ్పాటునందించాలని పారిశ్రామిక మండలి ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్), జీఎస్టీ అమలు తర్వాత తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఒక్కసారిగా మూడేళ్ల కనిష్టానికి(5.7 శాతం) పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, జీఎస్టీకి వ్యాపారవర్గాలు నెమ్మదిగా అలవాటుపడుతుండటంతో రెండో త్రైమాసికంలో వృద్ధి మళ్లీ 6.3 శాతానికి పుంజుకోవడంతో రికవరీ ఆశలకు బలం చేకూరుతోంది. రేట్లు మారవు: ఇక్రా ‘రానున్న నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ద్రవ్యోల్బణం ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ ఆర్బీఐ పాలసీ కమిటీ రెపో రేటును యథాతథంగానే కొనసాగిస్తుందని భావిస్తున్నాం’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. -
గతవారం బిజినెస్
ఐదేళ్లలో 28 లక్షల కోట్లు.. దేశంలోని అగ్రస్థాయి వంద కంపెనీల మార్కెట్ విలువ ఐదేళ్లలో జోరుగా పెరిగింది. 2011–16 కాలానికి ఈ కంపెనీలు రూ.28.4 లక్షల కోట్ల సంపదను సృష్టించాయని మోతిలాల్ ఓస్వాల్ రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, సంపద సృష్టి జరుగుతూనే ఉందని వివరించింది. 2011–16 కాలానికి అధిక సంపదను సృష్టించిన కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీ రూ.2.6 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. మార్కెట్ విలువ పెంచడంలో ఈ కంపెనీ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఇక టీసీఎస్ తర్వాతి స్థానాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధించింది. నెల తిరగ్గానే మళ్లీ పరిశ్రమల పడక పారిశ్రామిక ఉత్పత్తి 2016 అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చింది. 2015 అక్టోబర్ నెలతో (9.9 శాతం వృద్ధి) పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా 1.9 శాతం క్షీణత నమోదయ్యింది. జూలై నెలలో సూచీ 2.5 శాతం క్షీణతను నవెదుచేసుకుంది. తరువాతి నెల ఆగస్టులో కూడా 0.7 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే సెప్టెంబర్‌లో మాత్రం ఈ క్షీణత నుంచి బయటపడి, 0.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నెల తిరిగే సరికి తన క్రితం క్షీణ ధోరణికి మారింది. తగ్గిన విదేశీ మారకపు నిల్వలు భారత్ విదేశీ మారకపు నిల్వలు డిసెంబర్ 2వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారంతో పోల్చిచూస్తే (25 నవంబర్) భారీగా 1.431 బిలియన్ డాలర్లు తగ్గి, 363.874 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్ల రూపంలో చెప్పుకునే ఫారిన్ కరెన్సీ అసెట్స్ తగ్గడం దీనికి ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. నవంబర్ 25తో ముగిసిన వారంలో కూడా విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు 198.8 మిలియన్ డాలర్లు తగ్గాయి. కాల్ డ్రాప్స్ సమస్య.. ఇంకా తీవ్రంగానే.. దేశంలో కాల్ డ్రాప్స్ రేటు కొన్ని చోట్ల ఇంకా బెంచ్ మార్క్ (0.5 శాతం) స్థాయి కన్నా ఎక్కువగానే ఉందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పేర్కొంది. అందుకే ఈ అంశంపై వచ్చే వారంలో ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో వంటి టెలికం సంస్థలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. టెల్కోలన్నీ వాటి కాల్ డ్రాప్స్ రేటును వీలైనంత త్వరగా బెంచ్ మార్క్ స్థాయి కన్నా దిగువకు తీసుకురావాల్సిందేనని, లేకపోతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లారస్ ల్యాబ్స్ ఐపీఓకు మంచి స్పందన హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్స్ ఐపీఓ నాలుగున్నర రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 2.19 కోట్ల షేర్లను జారీ చేయనున్నది. ఇన్వెస్టర్ల నుంచి 9.87 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లు (క్విబ్)లకు కేటాయించిన వాటా 10.54 రెట్లు, సంపన్న ఇన్వెస్టర్లు (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్)కు కేటాయించిన వాటా 3.5 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.61 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. పాలసీ రేట్లు యథాతథం ఆర్బీఐ గవర్నర్‌గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్ పటేల్‌పై అందరి అంచనాలు తప్పాయి. ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. గత సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాల నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు బ్రేక్ పడింది. టెలికం పరిశ్రమ ఆదాయం తగ్గొచ్చు: ఇక్రా డీమోనిటైజేషన్, కంపెనీల మధ్య పోటీ వంటి అంశాల కారణంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో టెలికం పరిశ్రమ ఆదాయం 57 శాతంమేర తగ్గొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. రూ.4,25,000 కోట్ల రుణ ఊబిలో ఉన్న పరిశ్రమకు రిలయన్స్ జియో ఉచిత సేవల పొడిగింపు అంశం ’గోరుచుట్టుపై రోకటి పోటు’లా మారిందని పేర్కొంది. తీవ్రమైన పోటీ కారణంగా టెలికం కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, నోట్ల రద్దు వల్ల వాటి ఆదాయానికి గండిపడుతుందని పేర్కొంది. భారత్‌లో ఈ–కామర్స్ మార్కెట్ జోరు! భారత్ వచ్చే రెండు దశాబ్దాల కాలంలో అమెరికాను వెనక్కునెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ–కామర్స్ మార్కెట్గల దేశంగా అవతరించనుంది. అలాగే నంబర్‌వన్ స్థానం కోసం చైనాతో నువ్వానేనా అన్నట్లు పోటీపడనుంది. ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ సంస్థ వరల్డ్‌పే తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. భారత ఈ–కామర్స్ మార్కెట్లో 2016–2020 మధ్యకాలంలో 28 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదవుతుంది. దీంతో 2034 నాటికి ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ–కామర్స్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుంది. దీనికి ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల వంటి అంశాలు కారణంగా నిలుస్తాయి. పేటీఎంలో ఒక్క శాతం వాటా రూ. 325 కోట్లు డిజిటల్ వాలెట్ సేవలతోపాటు ఈ–కామర్స్ కార్యకలాపాలు నిర్వహించే పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్)లో ఒక్క శాతం వాటాను ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఏకంగా రూ.325 కోట్లకు విక్రయించారు. దీంతో రూ.32,500 కోట్ల మార్కెట్ విలువ (అంచనా)తో పేటీఎం భారీ కంపెనీల సరసన నిలవనుంది. పేటీఎం మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌లో శర్మకు ఈ ఏడాది మార్చి నాటికి 21 శాతం వాటా ఉంది. ప్రస్తుత వాటా విక్రయం అనంతరం ఇది 20 శాతానికి పరిమితం కానుంది. టెలికం సబ్స్క్రైబర్లు@107.4 కోట్లు దేశంలో టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య సెప్టెంబర్ చివరి నాటికి 107.4 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య ఆగస్ట్ నెలాఖరుకి 105.3 కోట్లుగా ఉంది. అంటే నెలవారి వృద్ధి 1.98 శాతంగా ఉంది. పట్ణణ ప్రాంత సబ్స్క్రిప్షన్ 60.64 కోట్ల నుంచి 62.43 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంత సబ్స్క్రిప్షన్ 44.69 కోట్ల నుంచి 44.98 కోట్లకు ఎగసింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాలను పేర్కొంటున్నాయి. నెలవారీగా చూస్తే.. సెప్టెంబర్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంత సబ్స్క్రిప్షన్ పెరుగుదల వరుసగా 2.95 శాతంగా, 0.65 శాతంగా ఉంది. టయోటా రేట్లు పెరుగుతున్నాయ్ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’టయోటా కిర్లోస్కర్ మోటార్’ వాహన ధరలు కొత్త ఏడాదిలో పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతో పాటు విదేశీ మారకపు విలువ పెరగుదల వంటి పలు అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా కంపెనీ రూ.5.39 లక్షలు–రూ.1.34 కోట్ల ధర శ్రేణిలో వాహనాలను విక్రయిస్తోంది. డీల్స్.. ⇔ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు టెమాసెక్, కేకేఆర్ తాజాగా బీమా రంగ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 3.9 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ వాటాలను విక్రయిస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,794 కోట్లు (దాదాపు 264 మిలియన్ డాలర్లు). షేరు ఒక్కింటికి రూ. 460 చొప్పున జీవిత బీమా వ్యాపార సంస్థలో 3.9 కోట్ల షేర్లను (3.9 శాతం వాటా) విక్రయించేందుకు బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదముద్ర వేసిందని ఎస్బీఐ వెల్లడించింది. కేకేఆర్, టెమాసెక్లు తమ తమ అనుబంధ సంస్థల ద్వారా చెరి 1.95 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీతో ఎస్బీఐ లైఫ్ వేల్యుయేషన్ సుమారు రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉండగలదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. ⇔ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో వాటాను ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ విక్రయించింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఎంసీఎక్స్‌లో 4.75% (24,21,028 షేర్లు) వాటాను బ్లాక్‌స్టోన్ జీపీవీ క్యాపిటల్ పార్ట్నర్స్ (మారిషస్) అమ్మేసింది. ఒక్కో షేర్ సగటు విక్రయ విలువ రూ. 1,250 అని, మొత్తం షేర్ల విక్రయ విలువ రూ.302 కోట్లు ఉం టుందని అంచనా. స్విస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 24,09,194 షేర్లను రూ.301.15 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఆర్బీఐ రూటు ఎటు?
* వేచిచూసే దోరణి ఉండొచ్చంటున్న నిపుణులు... * ఈసారికి పాలసీ రేట్లు యథాతథమేనని అంచనా * గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌కు తొలి పరీక్ష * కొత్తగా ఏర్పాటైన పరపతి విధాన కమిటీకి కూడా * రేపు ఆర్బీఐ పరపతి విధాన సమక్ష... ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ రేపు తొలి పరీక్షను ఎదుర్కోనున్నారు. గవర్నర్‌గా ఆయన చేపట్టనున్న తొలి సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా వడ్డీరేట్లపై నిర్ణయం కోసం కొత్తగా ఉర్జిత్ నేతృత్వంలో ఏర్పాటైన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)కి కూడా ఇదే మొట్టమొదటి భేటీ కావడం గమనార్హం. అయితే, మంగళవారం(అక్టోబర్ 4న) జరగనున్న సమీక్షలో ఆర్బీఐ పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశాలున్నాయని బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా మరింత నమ్మకమైన గణాంకాల కోసం ఆర్బీఐ వేచిచూడొచ్చనేది వారి అభిప్రాయం. ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ప్రధాన లక్ష్యమంటూ డిప్యూటీ గవర్నర్‌గా ఉర్జిత్ కఠిన వైఖరినే అవలంభించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్బీఐని ఆయన గుడ్లగూబ(కఠిన విధానాన్ని ఇలా పోలుస్తారు)గా అభివర్ణించారు కూడా. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతం, రివర్స్ రెపో 6 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగుతున్నాయి. ధరల కట్టడికే ఉర్జిత్ మొగ్గు..! ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టస్థాయి అయిన 5.05 శాతానికి దిగిరాగా... టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు రెండేళ్ల గరిష్టానికి(3.74%) ఎగబాకడం గమనార్హం. ఆగస్టులో రిటైల్ ధరలు తగ్గినప్పటికీ.. రెండు సూచీలూ కొద్ది నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. మరోపక్క, వచ్చే ఐదేళ్లకాలానికిగాను రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం 4 శాతంగా(రెండు శాతం అటూ ఇటుగా) నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ గవర్నర్‌గా గతంలో ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ఖరారు చేసిన ఉర్జిత్.. ఇప్పుడు కొత్త గవర్నర్‌గా ధరల కట్టడికే ఎక్కువగా మొగ్గుచూపవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. మరీముఖ్యంగా కేంద్రం నిర్ధేశించిన ద్రవ్యోల్బణం కొత్త లక్ష్యానికి అనుగుణంగానే ఆయన చర్యలు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. తొలిసారి భేటీ అవుతున్న ఎంపీసీకి ప్రభుత్వం, ఆర్బీఐ తరఫున ఉన్న ముగ్గురేసి సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమిటీకి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ నేతృత్వం వహిస్తారు. పాలసీ రేట్ల విషయంలో కమిటీలోని ఆరుగురు సభ్యులు సగంసగంగా విడిపోతే.. తుది నిర్ణయం గవర్నర్(వీటో అధికారం) తీసుకుంటారు. కాగా, ఇప్పటివరకూ ఉదయం 11 గంటలకు ఆర్బీఐ పాలసీ నిర్ణయాన్ని ప్రకటిస్తుండగా.. దీన్ని మధ్యాహ్నానికి(2.30) మార్చారు. రేటింగ్ ఏజెన్సీల మాట ఇదీ.. ‘రేపటి సమీక్షలో ఆర్బీఐ ఎలాంటి రేట్ల కోతనూ ప్రకటించే అవకాశం లేదు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే సూచనలు ఉన్న నేపథ్యంలో పాలసీపరంగా రేట్ల తగ్గింపునకు కొంతకాలం వేచిచూసే ధోరణిని అవలంభించవచ్చు’ అని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో అభిప్రాయపడింది. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యానికి(వచ్చే ఏడాది మార్చికల్లా 5 శాతం) అనుగుణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో భారీగా తగ్గిననేపథ్యంలో రేట్ల కోత అంచనాలు పెరిగాయి. అయితే, గతంలో కూడా రిటైల్ ధరలు తీవ్ర హెచ్చుతగ్గుల ధోరణిని కనబరిచిన నేపథ్యంలో తాజా తగ్గుదలను మాత్రమే ఎంపీసీ పూర్తిగా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ప్రధానంగా ఆహార ధరల ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడం ఆందోళనకరమైన అంశం’ అని మరో ఇండియా రేటింగ్స్ పేర్కొంది. డిసెంబర్ పాలసీ సమీక్షలో పావు శాతం రేట్ల కోత ఉండొచ్చని.. 2017లో ఇక కోతకు విరామం ఉంటుందని జపనీస్ బ్రోకరేజి దిగ్గజం నోమురా అభిప్రాయపడింది. ‘తొలిసారి సమావేశం అవుతున్న ఎంపీసీ.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న బలమైన సంకేతాల కోసం వేచిచూసే అవకాశం ఉంది. డిసెంబర్ పాలసీలోనే రేట్ల కోతకు ఆస్కారం ఉండొచ్చు’ అని బీఎన్పీ పారిబా చీఫ్ ఎకనమిస్ట్ రిచర్డ్ ఐలే వ్యాఖ్యానించారు. బ్యాంకర్లు ఏమంటున్నారు... టోకు ధరలు, అదేవిధంగా రిటైల్ ధరలకు సంబంధించి ద్రవ్యోల్బణం రేట్లు పెద్దగా దిగిరాలేదు. ఈ నేపథ్యంలో రేపటి సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చు. - ఆర్పీ మరాతే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈఓ పాలసీ రేట్లు యథాతథంగానే ఉండొచ్చు. అయితే, బ్యాంకుల మొండిబకాయిల(ఎన్పీఏ) కట్టడి విషయంలో మరికొన్ని చర్యలను ఉర్జిత్ తన తొలి సమీక్షలో ప్రకటించే అవకాశం ఉంది. - అరుణ్ తివారీ, యూనియన్ బ్యాంక్ సీఎండీ -
రెపో, రివర్స్ రెపో యథాతధం
ముంబయి: ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మంగళవారం మూడవ త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిపిన ఆర్బీయై ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీయై గవర్నర్ రంగరాజన్ ప్రకటించారు. ఈ తాజా ప్రకటనతో రేపోరేటు 7.25శాతం, రివర్స్ రేపోరేటు 6.25శాతం, నగదు నిలువ 4.5 శాతం ఉన్నది ఉన్నట్లుగానే కొనసాగనున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో నిర్దేశిత 5.4 శాతం స్థాయిలో ఉండడం.. టోకు ద్రవ్యోల్బణం కొన్ని నెలలుగా అసలు పెరక్కపోగా ..పారిశ్రామిక ఉత్పత్తి మందగమన ధోరణి, బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు తగిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో మరోసారి రెపో రేటును ఆర్బీఐ తగ్గించాలన్న డిమాండ్ తీవ్రంగా ఉంది. మరోవైపు వడ్డీరేట్లను తగ్గించొద్దని పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఈనేపథ్యలో ప్రస్తుత ఆర్బీయై పరపతి విధాన రెవ్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా మంగళవారం ఆర్బీఐ ‘రెపో’ రేటుపై తీసుకునే నిర్ణయంపై మార్కెట్ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
వడ్డీ రేట్లు ఇంకా తగ్గించండి
- బ్యాంకర్లతో భేటీలో ఆర్థిక మంత్రి జైట్లీ సూచన - సానుకూలంగా స్పందించిన బ్యాంకులు న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించిన దానికి అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. జనవరి నుంచి ఇప్పటిదాకా ఆర్బీఐ ముప్పావు శాతం మేర పాలసీ రేట్లు తగ్గించినప్పటికీ ఇంకా ఖాతాదారులకు ఆ మేర ప్రయోజనాలను ఎందుకు బదలాయించడం జరగలేదని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా తక్కువ వడ్డీకి పెట్టుబడి లభించేలా చూసే దిశగా జైట్లీ శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సీఈవోలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని బ్యాంకులు నానుస్తూ ఉండటంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. ఆర్బీఐ రేట్ల కోతకు తగ్గట్లుగా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ జైట్లీ సూచించారు. బ్యాంకర్లు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. రాబోయే 2-3 నెలల్లో మరింతగా వడ్డీ రేట్ల తగ్గుదలను చూడొచ్చని వారు ఏకగ్రీవంగా హామీ ఇచ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం ముగిసిన వెంటనే జైట్లీ అసాధారణంగా.. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ తదితర దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల చీఫ్‌లతో కూడా సమావేశమయ్యారు. కొన్ని బ్యాంకులు ఇప్పటికే రేట్ల కోతను కొంత బదలాయించగా, మరికొన్ని ఆ దిశగా ఇంకా చ ర్యలు తీసుకోలేదని సమావేశాల అనంతరం జైట్లీ విలేకరులతో చెప్పారు. ఓవైపు మొండి బకాయిల భారం, మరోవైపు చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేటు ఇవ్వాల్సి వస్తుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని బ్యాంకర్లు తెలిపినట్లు ఆయన వివరించారు. అయితే పరిస్థితులు ఆశావహంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బ్యాంకర్లు మరింత ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండొచ్చని జైట్లీ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ జనవరి నుంచి ఇప్పటిదాకా మూడు విడతల్లో రెపో రేటును (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) మొత్తం ముప్పావు శాతం తగ్గించింది. ఆర్బీఐ చివరిసారిగా జూన్ 2న పాలసీ రేటును పావు శాతం తగ్గించిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సహా పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. పీఎస్బీలకు మరింత మూలధనం..: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింతగా మూలధనం సమకూరుస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. బడ్జెట్లో కేటాయింపుల కన్నా ఎక్కువగా మూలధనం కావాలంటూ బ్యాంకులు కోరడం సబబేనన్నారు. ఈ ఏడాది బ్యాంకులకు అదనపు మూలధనం సమకూర్చేందుకు కేంద్రం బడ్జెట్లో రూ. 7,940 కోట్లు కేటాయించింది. తగిన సమయంలో మార్కెట్ ద్వారా నిధులు సమీకరించుకునే అంశంపై బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఉందని జైట్లీ పేర్కొన్నారు. చిన్న సంస్థలకు రుణాలు రెట్టింపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిన్న తరహా సంస్థలకు రుణాలు రెట్టింపై.. రూ. 1 లక్ష కోట్ల స్థాయికి చేరొచ్చని జైట్లీ చెప్పారు. వాటి అవసరాలకు అనుగుణంగా ఉండే పథకాలను రూపొందించాల్సి ఉంటుందని బ్యాంకర్లకు ఆయన సూచించారు. ఇక ఇటీవలి సామాజిక భద్రత పథకాలతో పాటు పలు ప్రభుత్వ పథకాల విషయంలో ప్రైవేట్ బ్యాంకులు చొరవగా పాల్గొనడం లేదని జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ ప్రాధాన్య అంశాల్లో పాలుపంచుకోవడం వల్ల ప్రైవేట్ బ్యాంకులకూ ప్రయోజనాలు ఉంటాయన్నారు. -
రేట్ల కోతకు సమయమిదే
-
రేట్ల కోతకు సమయమిదే
- దీన స్థితిలో పారిశ్రామిక వృద్ధి - తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతంత మాత్రంగా ఉన్న పారిశ్రామిక వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించడానికి ఇది సరైన సమయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. జూన్ 2న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైట్లీ పాల్గొన్నారు. పాలసీ రేట్లను తగ్గించాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. దీనిపై తన అభిప్రాయం అందరికీ తెలుసని, ఇది సరైన సమయమని పేర్కొన్నారు. 2015లో ఆర్బీఐ ఇప్పటిదాకా రెండు సార్లు పాలసీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు (ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు) 7.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామికోత్పత్తి ఆశించిన దానికంటే తక్కువగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్బీఐ పాలసీని కాస్త సరళతరంగా చేసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టమైన 4.87 శాతానికి దిగి రాగా, మార్చిలో పారిశ్రామికోత్పత్తి అయిదు నెలల కనిష్టమైన 2.1 శాతానికి పడిపోయింది. ఈ పరిణామాలతో జూన్ 2న ఆర్బీఐ రెపో రేటును కనీసం పావు శాతం తగ్గించవచ్చని భావిస్తున్నట్లు ఎస్బీఐ ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది. మొండి బకాయిలపై ఇప్పుడే ఏమీ చెప్పలేం.. బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో మొండి బకాయిల (ఎన్పీఏలు) స్థాయి డిసెంబర్ త్రైమాసికంలో 5.64% స్థాయికి ఎగియగా, మార్చి త్రైమాసికంలో ఇవి 5.2%కి తగ్గిందని జైట్లీ తెలిపారు. అయినప్పటికీ.. ఇది కూడా చాలా ఎక్కువేనని పేర్కొన్నారు. గత త్రైమాసికంలో ఇవి తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ, పరిస్థితులు పూర్తిగా మెరుగుపడుతున్నట్లుగా ఇప్పుడే భావించలేమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఎకానమీని వృద్ధి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నంలో కొన్ని సంకేతాలు అస్పష్టంగానే ఉంటాయన్నారు. -
రాజన్.. ఐదో‘సారీ’
ఆర్బీఐ పాలసీ సమీక్షలో వడ్డీరేట్లు యథాతథం ఈఎంఐల భారం ఇప్పట్లో తగ్గే అవకాశం లేనట్లే! రెపో 8 శాతం, రివర్స్ రెపో 7 శాతం, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు.. వచ్చే ఏడాది ఆరంభంలో రేట్లు తగ్గొచ్చని సంకేతం.. పారిశ్రామిక రంగం తీవ్ర అసంతృప్తి.. వడ్డీరేట్లు తగ్గించాలంటూ నలువైపుల నుంచీ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాత్రం దిగిరాలేదు. పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించారు. బ్యాంకర్లు కూడా రుణ రేట్లలో కోతకు ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. దీంతో గృహ, వాహన , ఇతరత్రా రుణాలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారాన్ని రుణ గ్రహీతలు ఇంకొన్నాళ్లు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, వచ్చే ఏడాది తొలినాళ్లలో రేట్ల కోత ఉండొచ్చంటూ ఆర్బీఐ సంకేతాలివ్వడం కాస్త సానుకూలాంశం. ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిర్ణయం వెలువడింది. మంగళవారం చేపట్టిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లలో మార్పుల్లేవని ప్రకటించింది. దీంతో కీలకమైన రెపో రేటు ఇప్పుడున్న 8 శాతం వద్ద, దీనికి అనుసంధానమైన రివర్స్ రెపో రేటు 7 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం స్థాయిలో కొనసాగనున్నాయి. కాగా, పాలసీ రేట్లను రాజన్ యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఆర్బీఐ నిర్ణయంపై కార్పొరేట్ ఇండియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా రేట్లను తగ్గించమని చెబుతున్నా.. రిజర్వ్ బ్యాంక్ పట్టించుకోవడం లేదని కార్పొరేట్లు వ్యాఖ్యానించారు. మరోపక్క, తమ డిపాజిట్, రుణాలపై ప్రస్తుతానికి ఎలాంటి మార్పులూ చేయబోమని బ్యాంకర్లు పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.52 శాతానికి దిగిరావడం, టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కూడా ఐదేళ్ల కనిష్టమైన 1.77 శాతానికి తగ్గడంతో ఈసారైనా ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందని పారిశ్రామిక రంగం గంపెడాశలు పెట్టుకుంది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు ఐదేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం(బ్యారెల్ 68 డాలర్లు) కూడా రేట్ల కోతకు సానుకూలాంశమని కార్పొరేట్లు వాదించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.3 శాతానికి(తొలి త్రైమాసికంలో 5.7%) తగ్గిన నేపథ్యంలో ఆర్బీఐ వృద్ధికి చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా మద్దతుగా మాట్లాడటం తెలిసిందే. అయితే, బ్యాంకర్లు, విశ్లేషకులు మాత్రం ప్రస్తుతానికి పాలసీ రేట్లు యథాతథంగానే ఉంటాయని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే రాజన్ నిర్ణయం వెలువడింది. పాలసీ సమీక్షలో ఇతర ముఖ్యాంశాలివీ... చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) ఇప్పుడున్న 22 శాతం వద్దే కొనసాగుతుంది. పస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.5% ఉండొచ్చు. 2015 మార్చి చివరినాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా (గతంలో 8 శాతంగా అంచనా వేసింది). నవంబర్‌లో తగ్గే అవకాశం ఉన్నప్పటికీ... డిసెంబర్లో పుంజుకోవచ్చు. పన్ను వసూళ్లు మందకొడిగా ఉన్న నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరడం (ఈ ఏడాది 4.1 శాతం) కష్టసాధ్యం కావచ్చు. తదుపరి సమీక్ష 2015 ఫిబ్రవరి 3న జరుగుతుంది. రుణ పునర్వ్యవస్థీకరణ నిబంధనల సడలింపు మొండిబకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులకు రుణాల పునర్వ్యవస్థీకరణ నిబంధనలను సడలించనున్నట్లు రాజన్ చెప్పారు. ప్రస్తుతం రుణాల పునర్వ్యవస్థీకరణ జరిపే కంపెనీల్లో బ్యాంకులకు 10 శాతాన్ని మించి ఈక్విటీ వాటాను తీసుకోకుండా పరిమితి ఉంది. దీన్ని త్వరలోనే సాధ్యమైనంతమేర పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రాజెక్టులను గట్టెక్కించేందుకు తాజా రుణాలకు కూడా 5/25 నిబంధనను అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిప్రకారం ఏదైనా ఇన్ఫ్రా కంపెనీకి బ్యాంకులు 25 ఏళ్ల కాలపరిమితితో కొత్త రుణాలిచ్చేందుకు వీలవుతుంది. ఈ రుణాన్ని ఐదేళ్ల తర్వాత వేరే బ్యాంకు/ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం లేదా రుణ ఒప్పందాలను మార్చుకోవడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి త్రైమాసికంలో చిన్న, పేమెంట్ బ్యాంకులకు లెసైన్స్‌లు జారీ చేసే అవకాశం ఉందని రాజన్ వెల్లడించారు. ఇటీవలే దీనికి సంబంధించి తుది మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్బీఐ.. ఔత్సాహిక సంస్థలు, వ్యక్తులు లెసైన్స్‌లకు దరఖాస్తు చేసుకోడానికి 2015 జనవరి 16ను ఆఖరి తేదీగా నిర్ధేశించింది కూడా. రేట్ల తగ్గింపునకు ఇది సమయం కాదు: రాజన్ ఆర్బీఐ పాలసీ ధోరణిలో మార్పునకు(రేట్ల కోత) ఇది తగిన సమయం కాదని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘ద్రవ్యోల్బణం ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగపడితే(ద్రవ్యలోటుకు అడ్డుకట్ట పడితే) వచ్చే ఏడాది ఆరంభంలోనే రేట్ల తగ్గింపునకు అవకాశం ఉంది. పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా కూడా నిర్ణయం తీసుకుంటాం’ అని రాజన్ చెప్పారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం అంచనాలు, ధోరణి ఆధారంగా ఆర్బీఐ విధానం ఉంటుంది. అంతేకానీ, ఒక సమీక్షలో రేట్లను తగ్గించడం.. తర్వాత వెంటనే మళ్లీ పెంపు.. ఇలాంటి దోబూచుల పద్ధతిని తాము అనుసరించబోమని పేర్నొన్నారు. మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధికి చేయూతనివ్వాలన్న విజ్ఞప్తులను ఆర్బీఐ పట్టించుకోవడం లేదన్న కార్పొరేట్ల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇదంతా వాళ్ల దురభిప్రాయమని తేల్చిచెప్పారు. ‘పారిశ్రామిక వర్గాలు దూరదృష్టితో కాకుండా సంకుచిత ధోరణితో ఆలోచిస్తున్నాయి. ఆర్బీఐ వృద్ధికి వ్యతిరేకం కాదు. ఎల్లప్పుడూ సాధ్యమైనంతమేరకు పటిష్టమైన వృద్ధినే కోరుకుంటుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కూడా మా బాధ్యత. లేదంటే అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన పరిస్థితులు మళ్లీమళ్లీ చోటుచేసుకుంటాయి’ అని రాజన్ పేర్కొన్నారు. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం రానున్న కాలంలో మరింత తగ్గుముఖం పట్టే అవశాలున్నాయని.. వచ్చే 12 నెలల వ్యవధిలో సగటున 6 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి.. ఆతర్వాత కాలంలో 4% (2% అటూఇటూగా) లక్ష్యాన్ని నిర్దే శించుకుంటున్నామన్నారు. ప్రస్తుత లక్ష్యం 6%. ఒక్క బంగారంలోనే పెట్టుబడి పెట్టొద్దు... బంగారం దిగుమతులపై సుంకంలో ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉందని రాజన్ సంకేతాలిచ్చారు. పుత్తడి దిగుమతులకు అడ్డుకట్టకోసం ప్రభుత్వం సుంకాన్ని 10%కి పెంచడం తెలిసిందే. పసిడి దిగుమతుల నియంత్రణకు అమలు చేసిన 80:20 స్కీమ్‌వల్ల పెద్దగా ఉపయోగం లేనందువల్లే ప్రభుత్వం రద్దు చేసినట్లు చెప్పారు. దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతాన్ని ఎగుమతి చేసిన తర్వాతే తదుపరి దిగుమతులకు అనుమతించడమనేది ఈ 80:20 స్కీమ్ ఉద్దేశం. ఇన్వెస్టర్లు ఒక్క బంగారానికే తమ పెట్టుబడులన్నీ కేటాయించవద్దని.. ఇతర ఆర్థిక సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయాలని రాజన్ సూచించారు. వృద్ధికి ఆర్బీఐ సహకరించట్లేదు: కార్పొరేట్లు మందగమనంలో ఉన్న వృద్ధిని గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ సహకరించడంలేదని పారిశ్రామిక రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇబ్బందుల్లో ఉన్న తయారీ రంగానికి వడ్డీరేట్ల కోతతో ఉపశమనం కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. వచ్చే పాలసీ సమీక్ష కంటే ముందే రేట్ల తగ్గింపు ద్వారా వృద్ధికి చేయూతనిస్తుందని భావిస్తున్నట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానించారు. ఆర్బీఐ నిర్ణయం నిరాశ పరిచిందని రియల్టర్ల సంఘం క్రెడాయ్ ప్రెసిడెంట్ సి.శేఖర్ రెడ్డి అన్నారు. గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ లేకపోగా వ్యయాలు మాత్రం భారీగా పెరిగాయని చెప్పారు. చౌక గృహాలకు డిమాండ్ పెంచేందుకు వీలుగా వడ్డీరేట్లలో రాయితీ, పన్నుల తగ్గింపు రూపంలో తమకు ప్రభుత్వం సహాయ ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్డీ రేట్లు తగ్గించం: బ్యాంకర్లు ఆర్బీఐ అనుసరించిన యథాతథ విధానాన్నే తామూ అమలు చేస్తామని బ్యాంకర్లు పేర్కొన్నారు. రుణాలు అదేవిధంగా డిపాజిట్లపైన కూడా వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాల్లేవని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. కాగా, వచ్చే మార్చి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 6 శాతానికి కుదించడం చూస్తే.. సరళ పాలసీవైపు ఆర్బీఐ అడుగులేస్తోందనేందుకు నిదర్శనమన్నారు. అధిక వడ్డీ రేట్లకు బ్యాంకులే కారణమని, మనీ మార్కెట్ ద్వారా పొందే ప్రయోజనాలను అవి ఖాతాదారులకు బదిలీ చేయడం లేదంటూ రాజన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. మనీ మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం చాలా స్వల్పమే కావడం వల్ల బదలాయించేంత స్థాయిలో ప్రయోజనాలేమీ బ్యాంకులకు ఒనగూరవని చెప్పారు. కాగా, అధిక మొండిబకాయిల కారణంగా బ్యాంకుల మార్జిన్లు తగ్గుతున్నాయని.. ప్రస్తుతానికైతే వడ్డీరేట్ల కోతకు ఆస్కారం లేదని యునెటైడ్ బ్యాంక్ ఈడీ దీపక్ నారంగ్ పేర్కొన్నారు. -
మెజారిటీ ఓకేచెప్పినా.. రాజన్ నో!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సెప్టెంబర్ 30 ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ముందు జరిగిన కీలక సమావేశం మినిట్స్ వివరాలను ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం పరపతి విధాన సలహా ఎక్స్టర్నల్ కమిటీ సమావేశంలో మెజారిటీ సభ్యులు పాలసీ రేట్లలో కోత అవసరమని అభిప్రాయపడినప్పటికీ, దీనికి భిన్నంగా గవర్నర్ రాజన్ నిర్ణయం తీసుకున్నారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీగా (టీఏసీ)గా పేర్కొనే విధాన సలహా ఎక్స్టర్నల్ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు పాలసీ వడ్డీ రేట్ల కోతకు మొగ్గుచూపగా, ముగ్గురు సభ్యులు వ్యతిరేకించినట్లు మినిట్స్ తెలిపింది. నలుగురిలో ముగ్గురు పావుశాతం కోతకు మొగ్గుచూపగా, ఒకరు అరశాతంగా సూచించారు. టీఏసీ సభ్యుల్లో వెహైచ్ మాలేగావ్, శంకర్ ఆచార్య, అరవిండ్ విర్మాణి, ఇందిరా రాజారామన్, ఇరోల్ డిసౌజా, అస్మి గోయల్, ఛేతన్ ఘాటే ఉన్నారు. సంబంధిత సమావేశానికి రాజన్ నేతృత్వం వహించారు. -
ఈసారి రేట్ల కోత ఉండకపోవచ్చు
ద్రవ్యోల్బణం తగ్గుదలపై స్పష్టత వచ్చేదాకా అంతే విశ్లేషకుల అంచనాలు ముంబై: వచ్చే మంగళవారం (ఆగస్టు 5) జరిపే పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్.. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని, తగ్గించకపోవచ్చని బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా ఆర్బీఐ రేట్ల తగ్గింపుపై హడావుడిగా నిర్ణయం తీసుకోకపోవచ్చని సింగపూర్‌కి చెందిన బ్రోకరేజి సంస్థ డీబీఎస్ పేర్కొంది. జూన్‌లో నిర్వహించిన పరపతి విధాన సమీక్ష అనంతరం స్థూల ఆర్థికపరిస్థితులు మెరుగ్గా కనిపిస్తున్నాయని, పారిశ్రామిక వృద్ధిలో కాస్త స్థిరత్వం కనిపిస్తోందని ఒక నివేదికలో తెలిపింది. రాబోయే త్రైమాసికాల్లో పారిశ్రామిక వృద్ధి కన్సాలిడేట్ కాగలదని పేర్కొంది. మరోవైపు, ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గుముఖం పట్టిందని స్పష్టత వచ్చే దాకా ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ ఒక నివేదికలో పేర్కొంది. అప్పటిదాకా ఆర్బీఐ చేపట్టే ద్రవ్య నిర్వహణ చర్యలను నిశితంగా గమనించాల్సి ఉంటుందని వివరించింది. ఏదేమైనా వర్షపాతం మెరుగ్గా ఉండి, ద్రవ్యోల్బణం దిగి వస్తే డిసెంబర్లో ఆర్బీఐ రేట్లను తగ్గించవచ్చని అంచనా వేసింది. ఒకవేళ ధరల పెరుగుదల మరింత కాలం కొనసాగితే రేట్ల కోత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణంపై పోరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇవి కల్పించే ఊరట స్వల్పకాలికమైనదేనని డీబీఎస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉండే వర్షపాతం ప్రభావాలను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సరిపోవని కూడా వివరించింది. వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండటం, పండ్లు.. కూరగాయల రేట్లు ఎగియడం నేపథ్యంలో ద్రవ్యోల్బణం తగ్గినా.. అది స్థిరంగా కొనసాగేలా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్న సంగతి తెలిసిందే. రేట్లు తగ్గిస్తే కార్పొరేట్లకు కష్టాలు రిజర్వ్ బ్యాంకు గనుక కీలక వడ్డీ రేట్లను ఇప్పుడిప్పుడే తగ్గించిందంటే కార్పొరేట్లపై ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ హెచ్చరించింది. పాలసీ రేట్లను ఏమాత్రం తగ్గించినా రూపాయి పతనానికి దారి తీస్తుందని, ఇది టాప్ 500 కంపెనీల్లో చాలా మటుకు సంస్థల దిగుమతి ప్రణాళికలను దెబ్బతీస్తుందని ఒక నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత రూపాయి మారకం విలువ దాదాపు 1.1-5.8 శాతం మేర క్షీణించిన ఉదంతాలు అనేకం ఉన్నాయని ఇండియా రేటింగ్స్ సీనియర్ డెరైక్టర్ దీప్ ఎన్ ముఖర్జీ పేర్కొన్నారు. రూపాయి విలువ 1 శాతం క్షీణించినా కంపెనీల స్థూల లాభాలు 1.3 శాతం తగ్గిన సందర్భాలు ఉన్నాయని ఆయన వివరించారు. బీఎస్ఈ 500లో నికరంగా దిగుమతి ఎక్కువగా ఉండే 53 శాతం సంస్థల గత ఫలితాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని ముఖర్జీ చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆరు-తొమ్మిది నెలల కాలంలో రేట్ల కోత చేపడితే కంపెనీలకు సమస్యలు తప్పవన్నారు. జైట్లీతో రాజన్ భేటీ న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఆగస్టు 5వ తేదీన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య,పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశం అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. పలు ఆర్థిక అంశాలపై తాను ఆర్థికమంత్రితో చర్చించినట్లు తెలిపారు. శుక్రవారంనాటి మార్కెట్ భారీ నష్టాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాల నుంచి మనం పక్కకు జరగలేమని అన్నారు. ఆగస్టు 5 పాలసీ సందర్భంగా యథాతథ పరిస్థితిని ఆర్బీఐ కొనసాగించవచ్చన్న ఊహాగానాలే మార్కెట్ నష్టానికి కారణమని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.