RBI Repo Rate Increased: ఈఎంఐలు మరింత భారం! | RBI Repo Rate Increased: Home Loan, Personal Loan EMIs To Go Up | Sakshi
Sakshi News home page

RBI Repo Rate Increased: ఈఎంఐలు మరింత భారం!

Published Sat, Aug 6 2022 3:30 AM | Last Updated on Sat, Aug 6 2022 12:20 PM

RBI Repo Rate Increased: Home Loan, Personal Loan EMIs To Go Up - Sakshi

ముంబై: గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారమయ్యేలా రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచింది. ధరల కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు.. రెపోను మరో 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్‌ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో 5.4 శాతానికి చేరింది. 

మే నెల నుంచి రెపో రేటు 1.4 శాతం పెరిగినట్లయ్యింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ ఉద్దేశం. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఇంకాస్త పెంచనుండటంతో రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు)  ఎగబాకనున్నాయి. కాగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం 2022–23లో  6.7%గా ఉంటుందన్న అంచనాలను యథాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలోనూ అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది.  

కోవిడ్‌–19 కన్నా పావుశాతం అధికం...
తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా పావుశాతం అధికం కావడం గమనార్హం.  వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్‌ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్‌ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 

2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 %కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తూ వచ్చింది.  నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి ఆర్‌బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్‌ 8వ తేదీన మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి.  

పాలసీ ముఖ్యాంశాలు...
► 2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ భావిస్తోంది.
► రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1%, 6.4%, 5.8 శాతాలుగా నమోదవుతాయి. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 5%కి ఇది దిగివస్తుంది.  
► భారత్‌ వద్ద ప్రస్తుతం 550 బిలియన్‌ డాలర్లకుపైగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నాయి. అధిక ఫారెక్స్‌ నిల్వలు ఉన్న దేశాల్లో భారత్‌ నాల్గవ స్థానంలో ఉంది.  
► వృద్ధి ధోరణి కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటూనే ద్రవ్యోల్బణం నియంత్రణే లక్ష్యంగా సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధాన కమిటీ దృష్టి సారిస్తుంది.  
► ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ వరకూ డాలర్‌ మారకంలో రూపాయి మారకపు విలువ 4.7 శాతం పతనమైంది. భారత ఆర్థిక వ్యవస్థ  స్థూల ఆర్థిక మూలాధారాల బలహీనత కంటే,  అమెరికా డాలర్‌ విలువ పెరగడం వల్ల రూపాయి విలువ మరింతగా క్షీణించింది. అయినా డాలర్‌ మారకంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్‌ కరెన్సీ పటిష్టంగానే ఉంది.  
► భారత్‌లోని తమ కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య చెల్లింపుల కోసం ఎన్‌ఆర్‌ఐలు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌)ను వినియోగించుకునేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించనుంది.  
► 2021 ఏప్రిల్‌–జూన్‌ మధ్య దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐల పరిమాణం 11.6 బిలియన్‌ డాలర్లు అయితే, 2022 ఇదే కాలంలో ఈ పరిమాణం 13.6 బిలియన్‌ డాలర్లకు చేరింది.  
► తదుపరి ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్‌ 28 నుంచి 30వ తేదీ మధ్య జరగనుంది.


డిపాజిట్లను సమీకరించుకోండి!
రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్‌ బ్యాంక్‌ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాల వు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్‌ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపా జిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధో రణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది.          
    – శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

ఐసీఐసీఐ, పీఎన్‌బీ వడ్డింపు..
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రుణాలపై రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కీలక రెపో రేటును ఆర్‌బీఐ అరశాతం పెంచుతున్నట్టు ప్రకటించిన రోజే ఈ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటును 9.10%కి పెంచింది. పీఎన్‌బీ రెపో ఆధారిత రుణ రేట్లను 7.40% నుంచి 7.90%కి పెంచినట్టు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement