గతవారం బిజినెస్‌ | last week business storys | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Dec 12 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

ఐదేళ్లలో 28 లక్షల కోట్లు..
దేశంలోని అగ్రస్థాయి వంద కంపెనీల మార్కెట్‌ విలువ ఐదేళ్లలో జోరుగా పెరిగింది. 2011–16 కాలానికి ఈ కంపెనీలు రూ.28.4 లక్షల కోట్ల సంపదను సృష్టించాయని మోతిలాల్‌ ఓస్వాల్‌ రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నా, సంపద సృష్టి జరుగుతూనే ఉందని వివరించింది. 2011–16 కాలానికి అధిక సంపదను సృష్టించిన కంపెనీగా టీసీఎస్‌ నిలిచింది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీ రూ.2.6 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. మార్కెట్‌ విలువ పెంచడంలో ఈ కంపెనీ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఇక టీసీఎస్‌ తర్వాతి స్థానాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  సాధించింది.

నెల తిరగ్గానే మళ్లీ పరిశ్రమల పడక
పారిశ్రామిక ఉత్పత్తి 2016 అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చింది. 2015 అక్టోబర్‌ నెలతో (9.9 శాతం వృద్ధి) పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా 1.9 శాతం క్షీణత నమోదయ్యింది. జూలై నెలలో సూచీ  2.5 శాతం క్షీణతను నవెదుచేసుకుంది. తరువాతి నెల ఆగస్టులో కూడా 0.7 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే సెప్టెంబర్‌లో మాత్రం ఈ క్షీణత నుంచి బయటపడి, 0.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నెల తిరిగే సరికి తన క్రితం క్షీణ ధోరణికి మారింది.

తగ్గిన విదేశీ మారకపు నిల్వలు
భారత్‌ విదేశీ మారకపు నిల్వలు డిసెంబర్‌ 2వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారంతో పోల్చిచూస్తే (25 నవంబర్‌) భారీగా 1.431 బిలియన్‌ డాలర్లు తగ్గి, 363.874 బిలియన్‌ డాలర్లకు చేరాయి. డాలర్ల రూపంలో చెప్పుకునే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ తగ్గడం దీనికి ప్రధాన కారణమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. నవంబర్‌ 25తో ముగిసిన వారంలో కూడా విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు 198.8 మిలియన్‌ డాలర్లు తగ్గాయి.

కాల్‌ డ్రాప్స్‌ సమస్య.. ఇంకా తీవ్రంగానే..
దేశంలో కాల్‌ డ్రాప్స్‌ రేటు కొన్ని చోట్ల ఇంకా బెంచ్‌ మార్క్‌ (0.5 శాతం) స్థాయి కన్నా ఎక్కువగానే ఉందని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ పేర్కొంది. అందుకే ఈ అంశంపై వచ్చే వారంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్‌ జియో వంటి టెలికం సంస్థలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. టెల్కోలన్నీ వాటి కాల్‌ డ్రాప్స్‌ రేటును వీలైనంత త్వరగా బెంచ్‌ మార్క్‌ స్థాయి కన్నా దిగువకు తీసుకురావాల్సిందేనని, లేకపోతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

లారస్‌ ల్యాబ్స్‌ ఐపీఓకు మంచి స్పందన
హైదరాబాద్‌కు చెందిన లారస్‌ ల్యాబ్స్‌ ఐపీఓ నాలుగున్నర రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 2.19 కోట్ల షేర్లను జారీ చేయనున్నది. ఇన్వెస్టర్ల నుంచి 9.87 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు (క్విబ్‌)లకు కేటాయించిన వాటా 10.54 రెట్లు, సంపన్న ఇన్వెస్టర్లు (హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌)కు కేటాయించిన వాటా 3.5 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.61 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి.  

పాలసీ రేట్లు యథాతథం
ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్‌ పటేల్‌పై అందరి అంచనాలు తప్పాయి. ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్‌ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) 4 శాతంగా కొనసాగనున్నాయి. గత సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల అంచనాలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాల నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు బ్రేక్‌ పడింది.

టెలికం పరిశ్రమ ఆదాయం తగ్గొచ్చు: ఇక్రా
డీమోనిటైజేషన్, కంపెనీల మధ్య పోటీ వంటి అంశాల కారణంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో టెలికం పరిశ్రమ ఆదాయం 57 శాతంమేర తగ్గొచ్చని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. రూ.4,25,000 కోట్ల రుణ ఊబిలో ఉన్న పరిశ్రమకు రిలయన్స్‌ జియో ఉచిత సేవల పొడిగింపు అంశం ’గోరుచుట్టుపై రోకటి పోటు’లా మారిందని పేర్కొంది. తీవ్రమైన పోటీ కారణంగా టెలికం కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, నోట్ల రద్దు వల్ల వాటి ఆదాయానికి గండిపడుతుందని పేర్కొంది.

భారత్‌లో ఈ–కామర్స్‌ మార్కెట్‌ జోరు!
భారత్‌ వచ్చే రెండు దశాబ్దాల కాలంలో అమెరికాను వెనక్కునెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ–కామర్స్‌ మార్కెట్‌గల దేశంగా అవతరించనుంది. అలాగే నంబర్‌వన్‌ స్థానం కోసం చైనాతో నువ్వానేనా అన్నట్లు పోటీపడనుంది. ప్రముఖ గ్లోబల్‌ పేమెంట్స్‌ సంస్థ వరల్డ్‌పే తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. భారత ఈ–కామర్స్‌ మార్కెట్‌లో 2016–2020 మధ్యకాలంలో 28 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదవుతుంది. దీంతో 2034 నాటికి ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ–కామర్స్‌ మార్కెట్‌ గల దేశంగా అవతరిస్తుంది. దీనికి ఇంటర్నెట్‌ విస్తరణ, స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం పెరుగుదల వంటి అంశాలు కారణంగా నిలుస్తాయి.
పేటీఎంలో ఒక్క శాతం వాటా రూ. 325 కోట్లు

డిజిటల్‌ వాలెట్‌ సేవలతోపాటు ఈ–కామర్స్‌ కార్యకలాపాలు నిర్వహించే పేటీఎం (వన్‌97 కమ్యూనికేషన్స్‌)లో ఒక్క శాతం వాటాను ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ ఏకంగా రూ.325 కోట్లకు విక్రయించారు. దీంతో రూ.32,500 కోట్ల మార్కెట్‌ విలువ (అంచనా)తో పేటీఎం భారీ కంపెనీల సరసన నిలవనుంది. పేటీఎం మాతృ సంస్థ అయిన వన్‌97 కమ్యూనికేషన్స్‌లో శర్మకు ఈ ఏడాది మార్చి నాటికి 21 శాతం వాటా ఉంది. ప్రస్తుత వాటా విక్రయం అనంతరం ఇది 20 శాతానికి పరిమితం కానుంది.

టెలికం సబ్‌స్క్రైబర్లు@107.4 కోట్లు
దేశంలో టెలిఫోన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య సెప్టెంబర్‌ చివరి నాటికి 107.4 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య ఆగస్ట్‌ నెలాఖరుకి 105.3 కోట్లుగా ఉంది. అంటే నెలవారి వృద్ధి 1.98 శాతంగా ఉంది. పట్ణణ ప్రాంత సబ్‌స్క్రిప్షన్‌ 60.64 కోట్ల నుంచి 62.43 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంత సబ్‌స్క్రిప్షన్‌ 44.69 కోట్ల నుంచి 44.98 కోట్లకు ఎగసింది. టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాలను పేర్కొంటున్నాయి. నెలవారీగా చూస్తే.. సెప్టెంబర్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంత సబ్‌స్క్రిప్షన్‌ పెరుగుదల వరుసగా 2.95 శాతంగా, 0.65 శాతంగా ఉంది.

టయోటా రేట్లు పెరుగుతున్నాయ్‌
ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ వాహన ధరలు కొత్త ఏడాదిలో పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతో పాటు విదేశీ మారకపు విలువ పెరగుదల వంటి పలు అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా కంపెనీ రూ.5.39 లక్షలు–రూ.1.34 కోట్ల ధర శ్రేణిలో వాహనాలను విక్రయిస్తోంది.

డీల్స్‌..
అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు టెమాసెక్, కేకేఆర్‌ తాజాగా బీమా రంగ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 3.9 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈ వాటాలను విక్రయిస్తోంది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 1,794 కోట్లు (దాదాపు 264 మిలియన్‌ డాలర్లు). షేరు ఒక్కింటికి రూ. 460 చొప్పున జీవిత బీమా వ్యాపార సంస్థలో 3.9 కోట్ల షేర్లను (3.9 శాతం వాటా) విక్రయించేందుకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదముద్ర వేసిందని ఎస్‌బీఐ వెల్లడించింది. కేకేఆర్, టెమాసెక్‌లు తమ తమ అనుబంధ సంస్థల ద్వారా చెరి 1.95 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీతో ఎస్‌బీఐ లైఫ్‌ వేల్యుయేషన్‌ సుమారు రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉండగలదని ఎస్‌బీఐ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య తెలిపారు.

మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో వాటాను ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ విక్రయించింది. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఎంసీఎక్స్‌లో 4.75% (24,21,028 షేర్లు) వాటాను బ్లాక్‌స్టోన్‌ జీపీవీ క్యాపిటల్‌  పార్ట్‌నర్స్‌ (మారిషస్‌) అమ్మేసింది. ఒక్కో షేర్‌ సగటు విక్రయ విలువ రూ. 1,250 అని, మొత్తం షేర్ల విక్రయ విలువ రూ.302 కోట్లు ఉం టుందని అంచనా. స్విస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 24,09,194 షేర్లను రూ.301.15 కోట్లకు కొనుగోలు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement