Call drops
-
క్లౌడ్ కంప్యూటింగ్‌తో కాల్ డ్రాప్స్‌కు చెక్
బార్సెలోనా: కాల్ అంతరాయాల (డ్రాప్స్) సమస్య పరిష్కారించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు మూడు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత టెలికం నెట్వర్క్, ఇళ్లకు చేరువలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్‌ను వర్చువల్ విధానానికి మార్చడం ఇందుకు సహాయపడగలదని ఆయన పేర్కొన్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కుమార్ ఈ విషయాలు వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత డేటాకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, టెల్కోలు తమ నెట్‌వర్క్‌ల నిర్వహణ కోసం క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వైపు మళ్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నోకియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ 3.2 రెట్లు పెరిగింది. అయితే, టెల్కోల నెట్వర్క్ సాఫ్ట్వేర్ వినియోగం ఆ స్థాయిలో పెరగలేదని కుమార్ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను, క్లౌడ్ సాంకేతికతలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
5జీ సేవలకు మరింత స్పెక్ట్రం కావాలి
న్యూఢిల్లీ: 5జీ సేవలను విస్తరించాలంటే మరింత స్పెక్ట్రం అవసరమని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. కీలకమైన 6 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను టెలికం సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలా జరగని పక్షంలో 5జీ సేవలను విస్తరించడం, వేగంగాను.. చౌకగాను అందించడంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కొచర్ వివరించారు. భారీ జనాభా ఉండే ప్రాంతాల్లో.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నెట్ సర్వీస్ లను విస్తరించడానికి అత్యంత నాణ్యమైన 6 గిగాహెట్జ్ బ్యాండ్ అనువుగా ఉంటుంది. దీంతో ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రం కోసం వైఫై సంస్థలు, టెల్కోల మధ్య పోటీ ఉంటోంది. నగరాల్లో విస్తృతంగా మొబైల్ నెట్‌వర్క్‌ను పెంచుకోవాలంటే 6 గిగాహెట్జ్ బ్యాండ్ కీలకమని కొచర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెలికం శాఖకు విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. దీనిపై ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటైందని వివరించారు. కాల్ డ్రాప్స్‌పై రాష్ట్ర స్థాయి డేటా సాధ్యం కాదు కాల్ అంతరాయాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా డేటా ఇవ్వాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని కొచర్ పేర్కొన్నారు. యూజర్లకు ఎట్టి పరిస్థితుల్లోనైనా నాణ్యమైన సేవలను అందించేందుకు టెల్కోలు ప్రయత్నిస్తుంటాయని, కానీ ఈ సూచనలను అమలు చేయాలంటే క్షేత్ర స్థాయిలో అడ్మిని్రస్టేషన్పరంగా అనేక సవాళ్లు ఉంటాయని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారం టెలికం సేవలను ప్రస్తుతం సర్కిళ్ల వారీగా, ఎల్ఎస్ఏ (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా)వారీగా అందిస్తున్నామని, దానికి అనుగుణంగానే డేటా కూడా ఉంటుందని కొచర్ తెలిపారు. ఇవన్నీ వివిధ జ్యూరిడిక్షన్లలో ఉంటాయి కాబట్టి రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో డేటా ఇవ్వాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాటిస్తున్న ఎల్ఎస్ఏ (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా) స్థాయి డేటా విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని కొచర్ వివరించారు. రాష్ట్ర స్థాయి డేటా వెల్లడి ఆదేశాలపై పునరాలోచన చేయాలని ట్రాయ్‌ను సీవోఏఐ కోరినట్లు చెప్పారు. -
ఇలానే కొనసాగితే ఫోనూ పాడవుతుంది.. అసలు కారణం ఇదే..!
సాక్షి, అమరావతి: శ్రీముఖి తన తల్లితో మాట్లాడాలని ఫోన్ చేసింది. తల్లి పార్వతమ్మ లిఫ్ట్ చేసింది. హలో.. హలో.. అన్నా అవతలి నుంచి సమాధానం లేదు. హలో వినిపిస్తుందా అని శ్రీముఖి అడుగుతోందే తప్ప అవతలి నుంచి శబ్దం రాదు. ఆ కాసేపటికే కాల్ కట్ అయింది. వెంకటేశ్వర్లు తన తమ్ముడితో అత్యవసరంగా మాట్లాడాలని తన మొబైల్ నుంచి ఫోన్ చేశాడు. ఒకసారి, రెండుసార్లు.. మూడు సార్లు.. ఇలా చాలా సార్లు కాల్ చేస్తే ఒక్క కాల్ కలిసింది. ఇవి ప్రస్తుతం దేశంలో ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఫోన్ చేస్తే కాల్ కలవదు. ఒకవేళ కలిసినా వెంటనే కట్ అవుతుంది. కాల్లో ఉండగానే వాయిస్ బ్రేకింగ్.. ఒక్క కాల్ మాట్లాడటానికి మూడు, నాలుగుసార్లు డయల్ చేయాలి. సిగ్నల్స్ ఉన్నా ఒక్కోసారి ఫోన్‌ను ఫ్లైట్ మోడ్/స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తేగాని కాల్ వెళ్లని పరిస్థితి. ప్రస్తుతం టెలికాం రంగంలో ‘కాల్ డ్రాప్’, ‘కాల్ కనెక్షన్’ పెద్ద సమస్యగా మారింది. మిగతా దేశాలతో పోలిస్తే దేశంలోనే కాల్ డ్రాప్ రేటు ఎక్కువగా ఉంది. సాంకేతికత 2జీ నుంచి 4జీకి వచ్చినప్పటికీ సిగ్నల్ లెవల్స్ పరిధి తగ్గుతోంది. గతంతో పోలిస్తే ఒక టవర్ సిగ్నల్ పరిధి 10వ వంతుకు తగ్గిపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.50 లక్షల మొబైల్ నెట్వర్క్ టవర్లు ఉన్నాయి. అయినా సమస్య పరిష్కారమవలేదు. కొత్త సాంకేతికతతో పాటు మరో లక్ష టవర్లు అందుబాటులోకి వస్తే తప్ప నెట్వర్క్ నాణ్యత మెరుగుపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులు కాల్ డ్రాప్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే వినియోగదారులు ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లకే పరిమితమవుతారని, ఎక్కువ వెచ్చించి 5జీ వంటి కొత్త టారిఫ్‌లకు వెళ్లేందుకు ఇష్టపడరని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ త్వరగా అయిపోతుంది భారత టెలికాం మార్కెట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం దేశంలో 1.1 బిలియన్ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. టెలికాం కంపెనీలు ట్రాయ్ నిర్దేశించిన బెంచ్‌మార్క్‌ను అందుకోలేక΄ోవడంతోనే అధిక కాల్ డ్రాప్స్ తలెత్తుతున్నాయి. సిగ్నలింగ్ కవరేజీ క్షీణించడం వల్ల హ్యాండ్సెట్ అధిక శక్తితో పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ వేగంగా అయిపోవడంతో పాటటు ఫోన్ కూడా త్వరగా పాడవుతుంది. ఈ నేపథ్యంలోనే కాల్ డ్రాప్ సమస్యపై వినియోగదారుల నుంచి కచ్చితమైన అభిప్రాయ సేకరణకు.. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ‘ట్రాయ్మై కాల్’ వాయిస్ కాల్ క్వాలిటీ మానిటరింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు కాల్ పూర్తి చేసిన తర్వాత తమ అభిప్రాయాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సమాచారంతో టెలికాం సర్కిల్ నెట్వర్క్ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు వీలవుతుంది. పెరిగిన డేటా, వైఫై కాల్స్ ఆన్లైన్ ఫ్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ దేశంలో 339 జిల్లాల్లో చేసిన సర్వే ప్రకారం 91 శాతం మంది కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇందులో 56 శాతం మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారులు డేటా, వైఫై ఆధారిత కాల్స్‌కు వెళ్తున్నారు. ఈ తరహా కాల్స్ 2019లో 75 శాతం ఉంటే ఇప్పుడు 82 శాతానికి పెరిగాయి. దేశంలో 0 నుంచి 3 సెకన్లలోపు కాల్ డ్రాపింగ్ శాతం పెరిగింది. నిమిషంలోపు డ్రాపింగ్ శాతం తగ్గింది. 5జీపై అనాసక్తత సాంకేతికతలో ఎంత మార్పులు వచ్చినప్పటికీ కాల్ డ్రాప్ సమస్యలు తగ్గక΄ోవడంతో మొబైల్ నెట్వర్క్ యూజర్లు కొత్త సాంకేతికత వైపు వెళ్లడానికి అంతగా ఇష్టపడటంలేదు. 5జీ వంటి హై స్పీడ్ నెట్వర్క్ తేవడానికి ముందుగా నెట్వర్క్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందుకే ప్రస్తుత టారిఫ్‌లతోనే సరిపెట్టుకొంటామని, ఎక్కువ చార్జీలు పెట్టి కొత్త టారిఫ్‌లు తీసుకోబోమని చెబుతున్నారు. ఇటీవలి సర్వేలో 43 శాతం మంది ప్రస్తుత టారిఫ్కంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా లేమని కరాఖండిగా చెప్పడమే దీనికి నిదర్శనం. మరో 43 శాతం మంది 10 శాతం ఎక్కువ చెల్లించగలమని చె΄్పారు. 10 శాతం మంది మాత్రం 10 నుంచి 25 శాతం వరకు ఎక్కువ చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్ -
ఈ సమస్యలు మీకూ ఉన్నాయా? షాకింగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశం వేగవంతమైన 5 జీ నెట్వర్క్ సేవలకు పరుగులు తీస్తున్నక్రమంలో నెట్వర్క్ సమస్యలపై షాకింగ్ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. వినియోగదారులకు కాల్‌డ్రాప్, కాల్ కనెక్ట్ కాకపోవడం అనేది ఎంత చికాకు కలిగిస్తుందో అందరికి అనుభవమే. తాజాగా దేశంలో 339 జిల్లాల పరిధిలోని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది యూజర్లు తమ నెట్వర్క్ బాధలను వెల్లడించారు. తీవ్రమైన కాల్ డ్రాప్, కాల్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నా మన్నారు. అంతేకాదు 82 శాతం మంది ప్రజలు ఈ నెట్వర్క్ సమస్యలను అధిగమించడానికి డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సోమవారం ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. సర్వే ప్రకారం గత 3 నెలల్లో వారి మొబైల్ ఫోన్ కాల్లలో ఎంత శాతం చెడ్డ కనెక్షన్ లేదా కాల్ డ్రాప్ సమస్యలను కలిగి ఉన్నాయనే ప్రశ్నకు సమాధానంగా, 37 శాతం మంది 20-50 శాతం సమస్యను ఎదుర్కొన్నారు. కాల్ కనెక్షన్ డ్రాప్‌పై ఇచ్చిన ప్రశ్నకు 8,364 ప్రత్యుత్తరాలు వచ్చాయి. మొత్తంగా 91 శాతం మంది తాము సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పగా, 56 శాతం మంది తమ విషయంలో సమస్య మరింత తీవ్రంగా ఉందని చెప్పారు. కాల్ నాణ్యతపై దృష్టి సారించిన సర్వే 31వేల మందిపై లోకల్ సర్కిల్స్ సర్వే చేసింది. ఇందులో టైర్ 1 నగరాల్లోని 42 శాతం మంది, టైర్ 2 నుండి 31 శాతం , టైర్ 3, 4 గ్రామీణ జిల్లాల నుండి 27 శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. 78 శాతం పౌరులు తప్పు కనెక్షన్ ఉన్నప్పటికీ 30 సెకన్లలోపు ఆటోమేటిక్ కాల్ డ్రాప్ సమస్య రాలేదని సర్వే తేల్చింది. డేటా లేదా వైఫై కనెక్షన్ ఉన్న 82 శాతం మంది పౌరులు తరచుగా డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌ను పొందడం లేదా కనెక్ట్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది -
కాల్‌డ్రాప్స్‌పై ఐడియా, బీఎస్ఎన్ఎల్కు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెల్కో సంస్థలు ఐడియా, బీఎస్ఎన్ఎల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా లోక్‌సభకు తెలిపారు. నాలుగు సర్వీస్ ఏరియాల్లో (అస్సాం, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు) ఐడియాకు, ఒక సర్వీస్ ఏరియాలో (పశ్చిమ బెంగాల్లో) ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కు జనవరి 18న వీటిని జారీ చేసినట్లు వివరించారు. మరోవైపు, 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో సేవల కోసం టెలికం ఆపరేటర్లు 1.02 లక్షల టవర్లు ఇన్స్టాల్ చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
తొలి దేశీ ఎలక్ట్రానిక్ చిప్!!
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్‌కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్సెట్ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్‌లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి, అధునాతన టీవీ వ్యవస్థ గల చిప్ అని ఆయన పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు ఎదుర్కొంటున్న కాల్స్ నాణ్యతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. వీడియో కంటెంట్‌ను మొబైల్ నెట్వర్క్ నుంచి వేరు చేయడం ద్వారా స్పెక్ట్రంపై ఎక్కువ భారం పడకుండా కాల్ నాణ్యతను పెంచేందుకు ఈ చిప్ తోడ్పడుతుందని సాంఖ్య ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పరాగ్ నాయక్ చెప్పారు. దీనితో.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను శాటిలైట్ ఫోన్లా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్సెట్స్ను ప్రస్తుతం విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. దేశీయంగా అధునాతన సెమీకండక్టర్ తయారీ ప్లాంటు లేకపోవడంతో భారత్‌లో వీటిని ఉత్పత్తి చేయడం లేదు. సాంఖ్య ల్యాబ్స్ ఎలక్ట్రానిక్ చిప్సెట్స్.. దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ప్లాంటులో తయారవుతున్నాయి. -
కాల్ డ్రాప్ కష్టాలు...
సాక్షి, అమరావతి : విజయవాడలో ఉంటున్న నరేంద్రకు ఆఫీసు నుంచి ముఖ్యమైన ఫోన్ వచ్చింది. ఇంట్లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే అవతలి వైపు వారికి తన మాట వినిపించడం లేదు. ఫోన్ కట్ చేసి బయటకు వచ్చి తిరిగి కాల్ చేస్తే కలవటం లేదు. దాదాపు ప్రతి సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటున్న అనుభవం ఇది. కొందరైతే సిగ్నల్స్ అందక బయటకు లేదా ఇంటిపైకి పరిగెత్తాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఖాతాదారులను పెంచుకోవడంపై చూపుతున్న శ్రద్ధను టవర్ల సంఖ్యపై కూడా చూపాలని డిమాండ్ చేస్తున్నారు. టవర్లు తగినన్ని లేకనే.. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న మొబైల్ వాడకందారులకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచడంలో సెల్‌ఫోన్ ఆపరేటర్లు విఫలమవుతున్నారు. ఖాతాదారుల సంఖ్యకు తగినట్టుగా టవర్లు, సామర్థ్యం పెంచకపోవడంతో కాల్డ్రాప్స్ ఎక్కువవుతున్నాయి. కాల్‌డ్రాప్స్‌ను అరికట్టేందుకు ‘ట్రాయ్’ ఎన్ని పెనాల్టీలు విధిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. సబ్స్క్రైబర్స్ అధికంగా ఉన్న సెల్యూలర్ సంస్థల్లో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. వారం క్రితం నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఖాతాదారులు ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, దీన్ని వెంటనే సరిదిద్దినట్లు ఐడియా ఏపీ సర్కిల్ హెడ్ బి.రామకృష్ణ తెలిపారు. వొడాఫోన్‌ను టేకోవర్ చేయడం వల్ల ఆ ఖాతాదారులు ఐడియాలోకి మారటంతో కూడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. పోటాపోటీగా ఆఫర్లు సెల్‌ఫోన్ కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆఫర్లు ప్రకటిస్తుండటంతో ప్రతి నెలా సబ్స్క్రైబర్స్ భారీగా పెరుగుతున్నారు. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన ఓ కంపెనీ ధాటిని తట్టుకుని ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఇతర ఆపరేటర్లు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఖాతాదారుల సంఖ్య పెరుగుతున్నా ఆదాయం తగ్గిపోతోందని కంపెనీలు చెబుతున్నాయి. హైస్పీడ్ లేదు... 2జీనే సెల్‌ఫోన్ కంపెనీలు చెబుతున్న హైస్పీడ్ డేటా కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని, పలు సందర్భాల్లో 2 జీ స్పీడు కూడా ఉండటం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. అన్లిమిటెడ్ డేటా ప్యాక్‌లు ప్రకటిస్తుండటంతో వినియోగం భారీగా పెరిగి పీక్ సమయాల్లో వేగం తగ్గిపోతోంది. 4 జీ టవర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కానీ డేటా స్పీడ్ పెరిగే అవకాశం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐడియా సెల్యూలర్‌కు 11,000కి పైగా 2జీ టవర్లు ఉంటే 3జీ టవర్లు సుమారు 9,000 ఉన్నాయి. ఐడియా 4 జీ టవర్లు కేవలం 8,000 మాత్రమే ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్కు 4జీ అనుమతి లేనందున ఇతర సంస్థల స్పీడ్‌తో పోల్చి చూడకూడదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 8 కోట్లుదాటిన వాడకం దారులు ప్రస్తుతం ఏపీ సర్కిల్లో (ఏపీ, తెలంగాణ) ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీల ఖాతాదారుల సంఖ్య 7.02 కోట్లకు చేరింది. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులను కూడా కలిపితే 8 కోట్లు దాటుతోంది. కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆఫర్లు ప్రకటిస్తుండటంతో లాభాలు తగ్గి సామర్థ్యం పెంచుకోలేకపోతున్నాయి. దీనికి తోడు కొత్త టవర్ల ఏర్పాటుకు అనుమతులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. కాలనీల మధ్యలో వెలుస్తున్న ఎత్తైన అపార్ట్మెంట్ల వల్ల కూడా సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతోందని, ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదు అందగానే టవర్ల ఫ్రీక్వెన్సీని మారుస్తున్నట్లు టెలికాం అధికారులు పేర్కొంటున్నారు. 7.02కోట్లు ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీల ఖాతా దారుల సంఖ్య -
కాల్ డ్రాప్స్‌పై టెల్కోలకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడంలో విఫలమైనందుకు గాను కొన్ని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వారాంతంలోగా వివరణనివ్వాలని ఆదేశించింది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ విషయాలు వెల్లడించారు. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు ఇచ్చినదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. గతేడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య కాలంలో కొన్ని నిర్దిష్ట సర్కిల్స్‌లో సర్వీసుల నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చినట్లు శర్మ చెప్పారు. ఆయా ఆపరేటర్ల వివరణను బట్టి చర్యలు ఉంటాయని ఆయన వివరించారు. కాల్ డ్రాప్స్ నివారించేందుకు ఉద్దేశించిన కఠిన నిబంధనలు 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం టెలికం సర్కిల్ స్థాయిలో కాకుండా కాల్ డ్రాప్స్ సమస్యను మొబైల్ టవర్ స్థాయిలో పరిశీలిస్తారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన పక్షంలో ఆపరేటర్లకు గరిష్టంగా రూ. 10 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. -
కాల్‌డ్రాప్స్‌పై టెలికాం కంపెనీలకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారులను చికాకుపరిచే కాల్‌డ్రాప్స్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సీరియస్ అయింది. కాల్‌డ్రాప్స్‌పై నూతన సేవా నాణ్యతా ప్రమాణాలను అందించడంలో విఫలమయ్యారంటూ కొన్ని టెలికాం కంపెనీలకు ట్రాయ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వారాంతంలోగా దీనిపై సరైన వివరణలతో ముందుకురావాలని ఆయా కంపెనీలను కోరింది. అయితే ఏ టెలికాం ప్రొవైడర్లకు ఈ నోటీసులు జారీ అయ్యాయో టెలికాం రెగ్యులేటర్ వివరించలేదు. నిబంధనలు పాటించని ఆపరేటర్ల పేర్లను తాము బహిర్గతం చేయదలుచుకోలేదని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. ఆయా కంపెనీల నుంచి వివరణలు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు. ట్రాయ్ ఇటీవల నిర్ధేశించిన నూతన సేవా ప్రమాణాలను కొన్ని సర్కిళ్లలో పాటించని కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. కాగా, 2017, అక్టోబర్ 1 నుంచి కాల్డ్రాప్స్ ను అధిగమించేందుకు ట్రాయ్ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో కాల్‌డ్రాప్స్‌కు రూ పదిలక్షల జరిమానాను టెలికాం సర్కిల్ స్ధాయిలో విధిస్తుండగా, తాజా నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ స్ధాయిలోనే చర్యలను చేపట్టారు. -
కాల్ డ్రాప్స్ కట్టడికి టెల్కోల 74,000 కోట్లు!!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో సహా ఇతర టెలికం కంపెనీలు రూ.74,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లతో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసుకోనున్నాయని టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ఆమె మంగళవారమిక్కడ టెలికం కంపెనీల సీనియర్ అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. టెల్కోలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్, విస్తరణతో కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు మొబైల్ టవర్ల ఏర్పాటుకు స్థలం లభ్యత కష్టంగా మారడం సహా పలు ఇతర సమస్యలు ఎదురౌతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ‘భారతీ ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రూ.16,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. మరో రూ.24,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక జియో వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష టవర్ల ఏర్పాటుకు రూ.50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది’ అని సుందరరాజన్ వివరించారు. ఇక ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కూడా వాటి మొబైల్ టవర్ల పెంపునకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. -
ట్రాయ్ యాక్షన్ ప్లాన్ అవసరం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్, మొబైల్ సేవల నాణ్యత వంటి సమస్యలను పరిష్కరించేలా టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) పేర్కొంది. సమస్యకు పరిష్కారం చూపే యాక్షన్ ప్లాన్ వల్ల పరిశ్రమ దైహిక సమస్యలను అధిగమించగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, నెట్వర్క్ విస్తరణకు సంబంధించి టెలికం కంపెనీలు సంస్థాగతంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. అందుకే వీటన్నింటి పరిష్కారానికి ట్రాయ్ సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తీసుకురావడంపై కసరత్తు చేయాలన్నారు. కాగా కాల్ డ్రాప్స్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కాల్ నాణ్యత అంశమై టెలికం ఆపరేటర్లతో భేటీ కానుంది. -
కాల్ డ్రాప్స్‌కి సాకులు చెప్పొద్దు
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాల్సిందేనని టెల్కోలకు కేంద్రం స్పష్టంచేసింది. మొబైల్ టవర్ల ఏర్పాటులో ఇబ్బందులున్నాయనో లేదా మరొకటో సాకులు చెప్పొద్దని తెగేసి చెప్పింది. కాల్స్ నాణ్యత విషయంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతోందని టెలికం శాఖ (డాట్) కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. డ్రాప్స్ సమస్య యథాప్రకారం కొనసాగడానికి వీల్లేదని.. దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పదని పరిశ్రమకు స్పష్టం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. కాల్ డ్రాప్ ఫార్ములా ఆధారిత మొబైల్ సేవల నాణ్యతపై జనవరి 21న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక అందగానే పరిశ్రమ వర్గాలతో డాట్ భేటీ కానున్నట్లు అరుణ వెల్లడించారు. ప్రజల వ్యతిరేకత కారణంగా మొబైల్ ఆపరేటర్లు కొన్ని చోట్ల టవర్ల ఏర్పాటులో సమస్యలు ఎదుర్కోవటం నిజమే అయినా... కాల్ డ్రాప్స్‌కు దాన్ని సాకుగా చూపరాదని అరుణ స్పష్టంచేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపర్చుకోవడానికి టెల్కోలు పెట్టుబడులు పెట్టాల్సిందేనన్నారు. మొబైల్ కాల్స్ అంతరాయాలను నిరోధించేలా ట్రాయ్ తెచ్చిన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత తొలిసారిగా డిసెంబర్ త్రైమాసిక పరిణామాలపై ట్రాయ్ త్వరలో నివేదిక ఇవ్వనుంది. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ల స్థాయిలో కాల్స్ నాణ్యతను పరిశీలించనున్నారు. ప్రమాణాలు పాటించకపోతే టెల్కోలపై గరిష్టంగా రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. -
కాల్ డ్రాప్స్‌పై కఠిన చర్యలు
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింత సీరియస్‌గా దృష్టి సారించింది. వరుసగా మూడు త్రైమాసికాలు ఆపరేటర్లు గానీ ప్రమాణాలు పాటించకపోతే దశలవారీగా రూ. 10 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి వచ్చేలా కఠినతరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. -
కాల్ డ్రాప్స్‌పై ట్రాయ్ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : కస్టమర్లకు తీవ్ర అసౌకర్యం కలిగించే కాల్‌డ్రాప్స్‌పై టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ స్పందించింది. కాల్ డ్రాప్స్‌ను నిరోధించేందుకు కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యే మొబైల్ ఆపరేటర్లకు రూ పది లక్షల వరకూ జరిమానాను విధిస్తున్నట్టు ట్రాయ్ పేర్కొంది. కాల్ డ్రాప్స్‌ను నివారించడంలో విఫలమైతే తొలుత 5 లక్షల వరకూ జరిమానా విధిస్తామని, ఇదే పద్ధతి కొనసాగితే జరిమానాను రూ పదిలక్షలకు పెంచుతామని ట్రాయ్ కార్యదర్శి ఎస్కే గుప్తా తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కాల్ డ్రాప్‌పై రూ 50,000 పెనాల్టీ విధిస్తున్నారు. ఆయా నెట్‌వర్క్‌ల సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానాలను నిర్ధేశిస్తామని ట్రాయ్ వర్గాలు తెలిపాయి. -
కాల్ నాణ్యత కోసం ట్రాయ్ యాప్
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టిన టెలికం రంగ నియంత్రణ సంస్థ తాజాగా కాల్ నాణ్యతను సమీక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తేనుంది. కాల్ పూర్తయిన తర్వాత సబ్‌స్క్రయిబర్స్.. సేవల నాణ్యతకు రేటింగ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడనుంది. అలాగే మొబైల్ యూజర్లకు టెలీమార్కెటర్స్ బెడద తప్పించే దిశగా ’డు నాట్ డిస్టర్బ్’ రిజిస్ట్రీని మరింత పటిష్టం చేయనుంది. ట్రాయ్ ఏర్పాటై ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే డీఎన్డీ రిజిస్ట్రీ అమల్లో ఉంది. ఇందులో నమోదు చేసుకున్న సబ్స్క్రయిబర్స్కు కాల్స్ చేసే టెలీమార్కెటింగ్ కంపెనీలకు భారీగా జరిమానాలకు ఆస్కారం ఉంది. -
గతవారం బిజినెస్
ఐదేళ్లలో 28 లక్షల కోట్లు.. దేశంలోని అగ్రస్థాయి వంద కంపెనీల మార్కెట్ విలువ ఐదేళ్లలో జోరుగా పెరిగింది. 2011–16 కాలానికి ఈ కంపెనీలు రూ.28.4 లక్షల కోట్ల సంపదను సృష్టించాయని మోతిలాల్ ఓస్వాల్ రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, సంపద సృష్టి జరుగుతూనే ఉందని వివరించింది. 2011–16 కాలానికి అధిక సంపదను సృష్టించిన కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీ రూ.2.6 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. మార్కెట్ విలువ పెంచడంలో ఈ కంపెనీ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఇక టీసీఎస్ తర్వాతి స్థానాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధించింది. నెల తిరగ్గానే మళ్లీ పరిశ్రమల పడక పారిశ్రామిక ఉత్పత్తి 2016 అక్టోబర్‌లో మళ్లీ నిరాశను మిగిల్చింది. 2015 అక్టోబర్ నెలతో (9.9 శాతం వృద్ధి) పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా 1.9 శాతం క్షీణత నమోదయ్యింది. జూలై నెలలో సూచీ 2.5 శాతం క్షీణతను నవెదుచేసుకుంది. తరువాతి నెల ఆగస్టులో కూడా 0.7 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే సెప్టెంబర్‌లో మాత్రం ఈ క్షీణత నుంచి బయటపడి, 0.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నెల తిరిగే సరికి తన క్రితం క్షీణ ధోరణికి మారింది. తగ్గిన విదేశీ మారకపు నిల్వలు భారత్ విదేశీ మారకపు నిల్వలు డిసెంబర్ 2వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారంతో పోల్చిచూస్తే (25 నవంబర్) భారీగా 1.431 బిలియన్ డాలర్లు తగ్గి, 363.874 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్ల రూపంలో చెప్పుకునే ఫారిన్ కరెన్సీ అసెట్స్ తగ్గడం దీనికి ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. నవంబర్ 25తో ముగిసిన వారంలో కూడా విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు 198.8 మిలియన్ డాలర్లు తగ్గాయి. కాల్ డ్రాప్స్ సమస్య.. ఇంకా తీవ్రంగానే.. దేశంలో కాల్ డ్రాప్స్ రేటు కొన్ని చోట్ల ఇంకా బెంచ్ మార్క్ (0.5 శాతం) స్థాయి కన్నా ఎక్కువగానే ఉందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పేర్కొంది. అందుకే ఈ అంశంపై వచ్చే వారంలో ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో వంటి టెలికం సంస్థలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. టెల్కోలన్నీ వాటి కాల్ డ్రాప్స్ రేటును వీలైనంత త్వరగా బెంచ్ మార్క్ స్థాయి కన్నా దిగువకు తీసుకురావాల్సిందేనని, లేకపోతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లారస్ ల్యాబ్స్ ఐపీఓకు మంచి స్పందన హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్స్ ఐపీఓ నాలుగున్నర రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 2.19 కోట్ల షేర్లను జారీ చేయనున్నది. ఇన్వెస్టర్ల నుంచి 9.87 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లు (క్విబ్)లకు కేటాయించిన వాటా 10.54 రెట్లు, సంపన్న ఇన్వెస్టర్లు (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్)కు కేటాయించిన వాటా 3.5 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.61 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. పాలసీ రేట్లు యథాతథం ఆర్బీఐ గవర్నర్‌గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్ పటేల్‌పై అందరి అంచనాలు తప్పాయి. ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. గత సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాల నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు బ్రేక్ పడింది. టెలికం పరిశ్రమ ఆదాయం తగ్గొచ్చు: ఇక్రా డీమోనిటైజేషన్, కంపెనీల మధ్య పోటీ వంటి అంశాల కారణంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో టెలికం పరిశ్రమ ఆదాయం 57 శాతంమేర తగ్గొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. రూ.4,25,000 కోట్ల రుణ ఊబిలో ఉన్న పరిశ్రమకు రిలయన్స్ జియో ఉచిత సేవల పొడిగింపు అంశం ’గోరుచుట్టుపై రోకటి పోటు’లా మారిందని పేర్కొంది. తీవ్రమైన పోటీ కారణంగా టెలికం కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, నోట్ల రద్దు వల్ల వాటి ఆదాయానికి గండిపడుతుందని పేర్కొంది. భారత్‌లో ఈ–కామర్స్ మార్కెట్ జోరు! భారత్ వచ్చే రెండు దశాబ్దాల కాలంలో అమెరికాను వెనక్కునెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ–కామర్స్ మార్కెట్గల దేశంగా అవతరించనుంది. అలాగే నంబర్‌వన్ స్థానం కోసం చైనాతో నువ్వానేనా అన్నట్లు పోటీపడనుంది. ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ సంస్థ వరల్డ్‌పే తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. భారత ఈ–కామర్స్ మార్కెట్లో 2016–2020 మధ్యకాలంలో 28 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదవుతుంది. దీంతో 2034 నాటికి ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ–కామర్స్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుంది. దీనికి ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల వంటి అంశాలు కారణంగా నిలుస్తాయి. పేటీఎంలో ఒక్క శాతం వాటా రూ. 325 కోట్లు డిజిటల్ వాలెట్ సేవలతోపాటు ఈ–కామర్స్ కార్యకలాపాలు నిర్వహించే పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్)లో ఒక్క శాతం వాటాను ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఏకంగా రూ.325 కోట్లకు విక్రయించారు. దీంతో రూ.32,500 కోట్ల మార్కెట్ విలువ (అంచనా)తో పేటీఎం భారీ కంపెనీల సరసన నిలవనుంది. పేటీఎం మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌లో శర్మకు ఈ ఏడాది మార్చి నాటికి 21 శాతం వాటా ఉంది. ప్రస్తుత వాటా విక్రయం అనంతరం ఇది 20 శాతానికి పరిమితం కానుంది. టెలికం సబ్స్క్రైబర్లు@107.4 కోట్లు దేశంలో టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య సెప్టెంబర్ చివరి నాటికి 107.4 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య ఆగస్ట్ నెలాఖరుకి 105.3 కోట్లుగా ఉంది. అంటే నెలవారి వృద్ధి 1.98 శాతంగా ఉంది. పట్ణణ ప్రాంత సబ్స్క్రిప్షన్ 60.64 కోట్ల నుంచి 62.43 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంత సబ్స్క్రిప్షన్ 44.69 కోట్ల నుంచి 44.98 కోట్లకు ఎగసింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాలను పేర్కొంటున్నాయి. నెలవారీగా చూస్తే.. సెప్టెంబర్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంత సబ్స్క్రిప్షన్ పెరుగుదల వరుసగా 2.95 శాతంగా, 0.65 శాతంగా ఉంది. టయోటా రేట్లు పెరుగుతున్నాయ్ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’టయోటా కిర్లోస్కర్ మోటార్’ వాహన ధరలు కొత్త ఏడాదిలో పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతో పాటు విదేశీ మారకపు విలువ పెరగుదల వంటి పలు అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా కంపెనీ రూ.5.39 లక్షలు–రూ.1.34 కోట్ల ధర శ్రేణిలో వాహనాలను విక్రయిస్తోంది. డీల్స్.. ⇔ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు టెమాసెక్, కేకేఆర్ తాజాగా బీమా రంగ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 3.9 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ వాటాలను విక్రయిస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,794 కోట్లు (దాదాపు 264 మిలియన్ డాలర్లు). షేరు ఒక్కింటికి రూ. 460 చొప్పున జీవిత బీమా వ్యాపార సంస్థలో 3.9 కోట్ల షేర్లను (3.9 శాతం వాటా) విక్రయించేందుకు బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదముద్ర వేసిందని ఎస్బీఐ వెల్లడించింది. కేకేఆర్, టెమాసెక్లు తమ తమ అనుబంధ సంస్థల ద్వారా చెరి 1.95 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీతో ఎస్బీఐ లైఫ్ వేల్యుయేషన్ సుమారు రూ. 46,000 కోట్ల పైచిలుకు ఉండగలదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. ⇔ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో వాటాను ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ విక్రయించింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఎంసీఎక్స్‌లో 4.75% (24,21,028 షేర్లు) వాటాను బ్లాక్‌స్టోన్ జీపీవీ క్యాపిటల్ పార్ట్నర్స్ (మారిషస్) అమ్మేసింది. ఒక్కో షేర్ సగటు విక్రయ విలువ రూ. 1,250 అని, మొత్తం షేర్ల విక్రయ విలువ రూ.302 కోట్లు ఉం టుందని అంచనా. స్విస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 24,09,194 షేర్లను రూ.301.15 కోట్లకు కొనుగోలు చేసింది. -
కాల్ డ్రాప్ సమస్య ఇంకా తీవ్రమే...
వచ్చే వారంలో టెల్కోలతో ట్రాయ్ సమావేశం న్యూఢిల్లీ: దేశంలో కాల్ డ్రాప్స్ రేటు కొన్ని చోట్ల ఇంకా బెంచ్ మార్క్ (0.5 శాతం) స్థారుు కన్నా ఎక్కువగానే ఉందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పేర్కొంది. అందుకే ఈ అంశంపై వచ్చే వారంలో ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో వంటి టెలికం సంస్థలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. టెల్కోలన్నీ వాటి కాల్ డ్రాప్స్ రేటును వీలైనంత త్వరగా బెంచ్ మార్క్ స్థారుు కన్నా దిగువకు తీసుకురావాల్సిందేనని, లేకపోతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘కాల్ డ్రాప్ సమస్యలో పురోగతి కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలి. అరుుతే కొన్ని చోట్ల కాల్ డ్రాప్ సమస్య అలాగే ఉంటోంది. ఇది ఆందోళనకరం. అందుకే వచ్చే వారంలో పలు టెలికం సంస్థలతో సమావేశం నిర్వహిస్తాం’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ‘ఐడియాకు సంబంధించి ఏ సర్కిల్లో కూడా కాల్ డ్రాప్స్‌లేవు. ఎరుుర్‌టెల్‌కు ఏడు సర్కిళ్లలో కాల్ డ్రాప్స్ 0.5 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారుు. వొడాఫోన్‌కు 11 సర్కిళ్లలో కాల్ డ్రాప్స్ ఉన్నారుు’ అని వివరించారు. కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి మేం తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నామని, ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపామని ఆయన వివరించారు. -
కాల్స్ డ్రాప్స్‌పై చేతులెత్తేసిన ప్రభుత్వం
కాల్స్ డ్రాప్స్ సమస్యతో ఓవైపు కస్టమర్లు సతమతమవుతుంటే, ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించలేమని కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొనే సమస్యగా పేర్కొన్న కేంద్రం టెలికాం నెట్‌వర్క్‌లో కాల్‌డ్రాప్స్‌పై పూర్తిగా పరిష్కరించలేమంటూ శుక్రవారం వెల్లడించింది. బలహీనమైన రేడియో కవరేజ్, రేడియో ఇంటర్ఫియరెన్స్, అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ లోడింగ్, ట్రాఫిక్ తీరులో మార్పులు, పవర్ ఫెయిల్యూర్స్‌తో సైట్లు మూత వంటి వివిధ కారణాల చేత కాల్డ్రాప్స్ ఏర్పడతాయని టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభ్యకు శుక్రవారం తెలిపారు. ఈ కారణాలచే ప్రతి వైర్లెస్ నెట్‌వర్క్‌ల్లో కాల్ డ్రాప్స్ సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని, టెలికాం ఆపరేటర్లు కాల్ డ్రాప్ సమస్యను గుర్తించి, వారి పరిమిత స్థాయిలో తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. కానీ పూర్తిగా మాత్రం నిర్మూలించలేమని చెప్పారు. -
కాల్డ్రాప్స్ పై ఫీడ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్: మనోజ్ సిన్హా
అవసరమైతే టెల్కోలపై కఠిన చర్యలు న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ విషయంలో అవసరమైతే టెలికం ఆపరేటర్లపై చర్యలు తీసకుంటామని, జరిమానా సైతం విధిస్తామని ఆ శాఖ మంత్రి మనోజ్‌సిన్హా హెచ్చరించారు. కాల్స్ ఫెయిల్ అవడంపై వినియోగదారులు నేరుగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు నెలరోజుల్లోపు ఓ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రిలయన్స్ జియో నెట్వర్క్ నుంచి వచ్చే కాల్స్ కోసం తగినన్ని ఇంటర్ కనెక్షన్ పాయింట్లు సమకూర్చనందున భారీగా కాల్డ్రాప్స్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాల నుంచి రూ.3,050 కోట్ల భారీ జరిమానా వసూలు చేయాలని ట్రాయ్ ఇప్పటికే టెలికం శాఖకు సూచించిన విషయం తెలిసిందే. ట్రాయ్ సిఫారసులు తమకు చేరాయని, నిబంధనల ప్రకారం తాము ఎవరికైనా లెసైన్స్ జారీ చేస్తే వారు సేవలు అందిస్తారని, అలా అందేలా తాము చూస్తామని సిన్హా చెప్పారు. నియంత్రణపరమైన కార్యాచరణకు లోబడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్టు టెలికం ఆపరేటర్లతో మంగళవారం సమావేశం అనంతరం మంత్రి మీడియాతో చెప్పారు. ఆపరేటర్ల మధ్య వివాదంతో వినియోగదారులు సమస్యలు ఎదుర్కోరాదన్నారు. దేశంలో కాల్ డ్రాప్స్ సమస్య అనేదే ఉండరాదన్నారు. ఈ విషయంలో జరిమానా మాత్రమే కాదని, అవసరమైతే ఇతర చర్యలు కూడా తీసుకుంటామని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
45 రోజుల్లో 48వేల టవర్లు
♦ కాల్ డ్రాప్స్ పరిష్కారానికి ఆపరేటర్ల చర్యలు: మనోజ్ సిన్హా ♦ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్‌కు కొత్త బ్యాండ్లు కావాలని వినతి న్యూఢిల్లీ : మొబైల్ కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం కోసం రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో లక్ష టవర్లను ఏర్పాటు చేసేందుకు టెలికం కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే, మరింత స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాయి. కాల్ డ్రాప్స్ అంశంపై టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా సోమవారం కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. 100 రోజుల్లో 60 వేల టవర్లు నిర్మిస్తామన్న హామీలో భాగంగా 45 రోజుల్లో 48వేల టవర్ల నిర్మాణం పూర్తి చేసినట్టు సమావేశం అనంతరం మంత్రి మనోజ్ సిన్హా విలేకరులకు తెలిపారు. ఆపరేటర్ల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, ప్రభుత్వం మాత్రం వినియోగదారుల అనుభవం ఆధారంగా నెట్‌వర్క్‌ను ఇంకా పటిష్ట పరచాలని ఆశిస్తోందని చెప్పారు. కాల్ డ్రాప్స్ అంశంపై ప్రభుత్వానికి, కంపెనీలకు మధ్య జరిగిన రెండో సమావేశం ఇది. జూన్‌లో జరిగిన తొలి సమావేశం సందర్భంగా నెట్వర్క్ పటిష్టతకు కంపెనీలు అదనపు టవర్ల ఏర్పాటుపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. సెప్టెంబర్‌లో స్పెక్ట్రం వేలం సెప్టెంబర్‌లో స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నామని, దీంతో స్పెక్టమ్ కొరత సమస్య తీరిపోతుందని ఆపరేటర్లకు మంత్రి తెలియజేశారు. అయితే, ఈ వేలంలో 71 నుంచి 76 గిగాహెడ్జ్, 50 గిగాహెడ్జ్ నూతన ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా అందుబాటులోకి తేవాలని ఆపరేటర్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బ్యాండ్లలో వైర్లెస్ సేవల ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ను 1 గిగాబైట్ వేగంతో అం దించడానికి వీలవుతుందని సూచించారు. తాము ఏడాదిలో లక్ష టవర్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో నెట్‌వర్క్‌ల సామర్థ్యం పెంచుకునేందుకు గాను ఈ (71-76), వీ (50గిగాహెడ్జ్) బ్యాండ్లను కూడా అందుబాటులోకి తేవాలని కోరినట్టు సెల్యులర్ ఆపరేటర్ల సంఘం డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేసేందుకు అనుమతులు కష్టంగా ఉండడంతో ఈ బ్యాండ్లు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. అలాగే, స్పెక్ట్రమ్ కోసం చేసే చెల్లింపులపై వడ్డీ రేటు తక్కువగా ఉంచాలని కోరినట్టు కూడా ఆయన తెలిపారు. -
కాల్ డ్రాప్స్ కు కఠిన శిక్షలు
చట్టాన్ని సవరించండి ప్రభుత్వాన్ని కోరిన ట్రాయ్ న్యూఢిల్లీ: ఎయిర్టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి మొబైల్ కంపెనీలు రేడియో లింక్ టైమ్-అవుట్ టెక్నాలజీ(ఆర్ఎల్టీ)ని కాల్‌డ్రాప్స్‌కు ముసుగుగా వాడుకుంటున్నాయని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. హైదారబాద్‌లో నిర్వహించిన నెట్వర్క్ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. కాల్‌డ్రాప్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 14 నెట్‌వర్క్‌ల్లో తాము నిర్వహించిన తనిఖీల్లో 11 నెట్‌వర్క్‌లు విఫలమయ్యాయని పేర్కొంది. నిర్దేశిత పరిమితి కంటే తక్కువకు సిగ్నల్ నాణ్యత పడిపోతే కాల్ ఎంత కాలం కొనసాగగలదో ఆర్ఎల్టీ వెల్లడిస్తుంది. నెట్వర్క్ కవరేజ్ బలహీనంగా ఉన్నప్పటికీ, కాల్స్ కనెక్టయ్యేలా, సిగ్నల్స్ లేవని వినియోగదారులే కాల్స్‌ను డిస్కనెక్ట్ చేసుకునేలా ఈ టెక్నాలజీని టెల్కోలు వాడుకుంటున్నాయనేది ఆరోపణ. ఆర్ఎల్టీని టెల్కోలు కాల్‌డ్రాప్స్‌కు వాడుతున్నాయనడాన్ని సెల్యులర్ ఆపరేటర్స్ ఆసోసియేషన్(సీఓఏఐ) ఖండించింది. కాగా, కాల్డ్రాప్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడానికి మరిన్ని అధికారాలు కావాలని ట్రాయ్ కోరుతోంది. కాల్డ్రాప్స్ సంబంధిత నియమాలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ.10 కోట్ల జరిమానా విధించడానికి, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించడానికి వీలు కల్పిస్తూ చట్టాలను సవరించాలని ట్రాయ్ ప్రభుత్వాన్ని కోరింది. -
కాల్ డ్రాప్స్ కు పరిహారం కుదరదు..
♦ టెల్కోలపై ట్రాయ్ ఆదేశాలను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ♦ చట్ట విరుద్ధ ఏకపక్ష చర్యని స్పష్టీకరణ న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ విషయంలో సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. కాల్ డ్రాప్స్‌కు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సిందేనని ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలను తోసిపుచ్చింది. ఈ నిబంధన చట్ట విరుద్ధమైనదని, ఏకపక్షంగా ఉందని, తగిన కారణాలు లేవని, పారదర్శకత లోపించిందని కూడా న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాల్డ్రాప్స్ ఒక్కింటికీ రూ.1 చొప్పున వినియోగదారులకు పరిహారం చెల్లించాలని గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను భారత్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ల అత్యున్నత సంస్థ- సీఓఏఐ (సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. అయితే ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ హైకోర్టులోనూ తీర్పు ప్రతికూలంగా వచ్చింది. దీనితో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా సుప్రీంకోర్టు రూలింగ్‌తో కాల్ డ్రాప్స్ విషయంలో టెలికం సంస్థలకు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. సీఓఏఐలో వొడాఫోన్, భారతీ, రియలన్స్ వంటి సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం: టెలికం కంపెనీలు ఈ కేసులో టెలికం కంపెనీలు తమ వాదనలు వినిపిస్తూ... ఈ రంగం ఇప్పటికే తీవ్ర రుణ సంక్షోభంలో ఉన్నట్లు తెలిపాయి. స్పెక్ట్రమ్‌కు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తున్నట్లు వివరించాయి. ఈ రంగంలో భారీ లాభాలను పొందుతున్నట్లు ట్రాయ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ... మౌలిక రంగంపైనే భారీ ఖర్చులు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదీ కాకుండా కాల్ డ్రాప్స్ దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే ఉన్నట్లు టెలికం కంపెనీల తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. తాజా తీర్పు పట్ల సీఓఏఐ, అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ ఒక సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. వినియోగదారులకు పటిష్ట, నాణ్యమైన సేవలు అందాలన్న ట్రాయ్ ఆలోచనలను అర్థం చేసుకున్నామని, ఈ లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాయి. సేవలు మెరుగుపడాలి: కేంద్రం సుప్రీం తీర్పుపై టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆచితూచి స్పందించారు. కోర్టు ఉత్తర్వుల తదనంతర పరిణామాలను, సేవల పెంపును మెరుగుపరిచే మార్గాలను ట్రాయ్ పరిశీలిస్తుందని అన్నారు. టెలికం కంపెనీలు సేవల మెరుగుదలపై మరింత దృష్టి సారిస్తాయని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఇంకా టెలికం సేవలు బలహీనంగా ఉన్న విషయం సుస్పష్టమన్నారు. కాగా సుప్రీం ఉత్తర్వుపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. -
కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీలకు ఊరట
న్యూఢిల్లీ: కాల్‌డ్రాప్ విషయంలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వినియోగదారుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ అయితే ఆ కాల్స్‌కు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీల నుంచి పరిహారం కోరే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టు తీర్పుతో టెలికం కంపెనీలకు ఊరట లభించినట్లు అయింది. కాగా వినియోగదారులు కాల్ చేసినప్పుడు, ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్‌లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ. 1 చొప్పున, రోజుకు రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని నిబంధనలను ట్రాయ్ రూపొందించింది. ట్రాయ్ నిర్ణయాన్ని టెలికం కంపెనీలు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు ట్రాయ్ నిర్ణయాన్ని కొట్టివేసింది. -
కాల్ డ్రాప్స్‌పై ట్రాయ్ తనిఖీలు...
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌కు సంబంధించి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్(టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) ఏడు నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. టెలికం కంపెనీల సేవల నాణ్యత మెరుగుపడిందో లేదో చూడ్డానికి ఈ పరీక్షలను ఏడు నగరాల్లో-ఢిల్లీ, ముంబై, సూరత్, కోల్‌కత, పుణే, భువనేశ్వర్, ఇండోర్ల్లో నిర్వహిస్తున్నామని ట్రాయ్ ఉన్నతాధికారొకరు చెప్పారు. గత నెల 21 నుంచి మొదలైన ఈ పరీక్షలు ఈ నెల 8 వరకూ జరుగుతాయని పేర్కొన్నారు. కాగా కాల్డ్రాప్స్ సమస్య మెరుగుపడుతోందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. -
కాల్డ్రాప్స్ విషయంలో కఠిన చర్యలు
టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ టెల్కోల సేవలు మెరుగుపడట్లేదని వ్యాఖ్య... న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం కంపెనీలు తమ కస్టమర్లను పెంచుకుంటున్నాయే తప్ప అధ్వాన్నంగా ఉంటున్న సేవల నాణ్యతను మెరుగుపర్చుకోవడం లేదని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మొబైల్ కాల్ డ్రాపింగ్ సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగ్రవాల్ సోమవారం రాజ్యసభలో దీనిపై లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా పరిగణిస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవాల్సిందిగా టెలికం కంపెనీలను ఆదేశించామని, ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ప్రసాద్ వివరించారు. ‘నేను కఠినంగా వ్యవహరించే మంత్రిని. సేవలు మెరుగుపడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటాము’ అని ఆయన తెలిపారు. వొడాఫోన్, ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీల చీఫ్‌లు కూడా సమస్యలను అంగీకరించి, సర్వీసులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినట్లు ప్రసాద్ చెప్పారు. దేశవ్యాప్తంగా 18 లక్షల పైచిలుకు ప్రైవేట్ కంపెనీల మొబైల్ టవర్లు ఉండగా, వీటిలో 35,000 టవర్లలో లోపాలు ఉన్నాయని ఒక సర్వేలో గుర్తించినట్లు మంత్రి వివరించారు. వీటిలో 20,000 దాకా టవర్లను సరిదిద్దడం జరిగిందని, మిగతావాటిని సరిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా గడిచిన మూడు నెలల్లో ప్రైవేట్ టెల్కోలు 14,000 పైగా కొత్త టవర్లను ఏర్పాటు చేశాయన్నారు. కాల్ డ్రాప్ విషయంలో టెల్కోలపై జరిమానా విధించాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫర్సులు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను మళ్లీ లాభాల బాట పట్టిస్తానని ఆయన తెలిపారు.