
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సహా ఇతర టెలికం కంపెనీలు రూ.74,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్లతో వాటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోనున్నాయని టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ఆమె మంగళవారమిక్కడ టెలికం కంపెనీల సీనియర్ అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు.
టెల్కోలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్, విస్తరణతో కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు మొబైల్ టవర్ల ఏర్పాటుకు స్థలం లభ్యత కష్టంగా మారడం సహా పలు ఇతర సమస్యలు ఎదురౌతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.
‘భారతీ ఎయిర్‌టెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రూ.16,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. మరో రూ.24,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక జియో వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష టవర్ల ఏర్పాటుకు రూ.50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది’ అని సుందరరాజన్ వివరించారు. ఇక ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కూడా వాటి మొబైల్ టవర్ల పెంపునకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment