aruna sundararajan
-
నాలుగేళ్లలో... 5జీ: ట్రాయ్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సర్వీసులపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 2022 నాటికల్లా దేశీయంగా కూడా ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యదర్శి ఎస్.కె.గుప్తా చెప్పారు. ఆ పై ఐదేళ్లలో డిజిటల్ మాధ్యమం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి వినియోగదారుల ధోరణుల్లో మార్పులు తేగలవని గుప్తా చెప్పారు. ‘‘కొన్నాళ్లుగా మీడియా పరిశ్రమలో నాటకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయా సంస్థలు నిలదొక్కుకోవడానికి కొత్త టెక్నాలజీని వినియోగించటమనేది కీలకంగా మారుతోంది’’ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో గుప్తా వ్యాఖ్యానించారు. స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో మీడియా కంటెంట్ స్వరూపంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణమైన కంటెంట్‌ను అందించడంపై మీడియా పరిశ్రమ మరింతగా దృష్టి పెడితే, కంటెంట్ వినియోగం గణనీయంగా పెరగగలదని గుప్తా తెలిపారు. మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులకు 5జీ సేవలు ఉపయోగపడతాయి. అలాగే, తయారీ, రిటైల్, విద్య, వైద్యం తదితర రంగాల వృద్ధికి గణనీయంగా తోడ్పడే అవకాశం ఉంది. 5జీతో జీడీపీ రెట్టింపు: అరుణ సుందరరాజన్ స్థూల దేశీయోత్పత్తిని రెట్టింపు చేయగలిగే సత్తా 5జీ సేవలకుదన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ టెలికం ఇన్ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ చెప్పారు. అంతర్జాతీయంగా టెలికం రంగంపై పెట్టుబడులు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనున్నాయని, ఒక్క చైనాయే డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రా ఏర్పాటుపై ఏటా 188 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు. కేవలం 5జీకే చైనా బడ్జెట్ సుమారు 500 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందన్నారు. బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అరుణ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, నిర్దాక్షిణ్యమైన పోటీ వల్ల భారత టెలికం పరిశ్రమ పెను సవాళ్లమయంగా మారిందని అరుణ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారీ పెట్టుబడులను ఆకర్షించేంత లాభదాయకత, వ్యాపార అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయని చెప్పారామె. ‘‘దేశీ టెలికం పరిశ్రమమ ఇప్పుడిప్పుడే విప్లవాత్మకమైన మార్పులను చూస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరెన్నో చూడాల్సి వస్తుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిలకడగా మూడు దశాబ్దాల పాటు భారత్ 9– 10 శాతం మేర వృద్ధి చెందాలంటే డిజిటల్ వైపు మళ్లాల్సిన అవసరం ఉందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇందుకోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పటిష్టం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది వన్ ప్లస్ 5జీ ఫోన్.. 5జీ టెక్నాలజీ సేవలకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది ఆవిష్కరించనున్నట్లు చైనా హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వెల్లడించింది. ముందుగా యూరప్‌లో దీన్ని ప్రవేశపెడతామని స్నాప్‌డ్రాగన్ టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వన్‌ప్లస్ సీఈవో పీట్ లౌ తెలిపారు. టెలికం ఆపరేటర్ ఈఈ భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియజేశారు. మరింత శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌తో ఇది రూపొందుతుందని పీట్ చెప్పారు. -
టెలికం పరికరాలకు తప్పనిసరిగా సర్టిఫికేషన్
బెంగళూరు: అధీకృత సంస్థలు పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేషన్ ఇచ్చిన పరికరాలను మాత్రమే టెలికం ఆపరేటర్లు ఉపయోగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే నిర్దేశిత నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి దేశీయంగా ఆపరేటర్లు దిగుమతి చేసుకునే ప్రతి పరికరానికి ఇండియన్ టెలిగ్రాఫ్ (సవరణ) చట్టం 2017 ప్రకారం పరీక్షలు తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. చైనా కంపెనీల నుంచి దిగుమతి చేసుకునే పరికరాల విషయంలో అమెరికా, ఆస్ట్రేలియా తరహాలో భారత్ కూడా జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ అరుణ ఈ వివరాలు వెల్లడించారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం నిర్దేశిత పరీక్షలు నిర్వహించని, సర్టిఫై చేయని పరికరాలను టెలికం ఆపరేటర్లు ఉపయోగించడానికి లేదు. అయితే, స్థానికంగా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరన్న నిబంధన మూలంగా నెట్వర్క్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణలో జాప్యం జరిగే అవకాశం ఉందంటూ పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్పొ బ్రీఫ్స్... ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్: స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీని డీలిస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. భారీ రుణ భారంతో కుదేలైన ఈ కంపెనీని వేదాంత కంపెనీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పవర్ ఫైనాన్స్ కంపెనీ: ఈ కంపెనీలో తనకున్న 65.61 శాతం వాటాను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌కు (ఆర్ఈసీ) విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.13,000 కోట్లు వస్తాయని అంచనా. -
కాల్ డ్రాప్స్ కట్టడికి టెల్కోల 74,000 కోట్లు!!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో సహా ఇతర టెలికం కంపెనీలు రూ.74,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లతో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసుకోనున్నాయని టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ఆమె మంగళవారమిక్కడ టెలికం కంపెనీల సీనియర్ అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. టెల్కోలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్, విస్తరణతో కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు మొబైల్ టవర్ల ఏర్పాటుకు స్థలం లభ్యత కష్టంగా మారడం సహా పలు ఇతర సమస్యలు ఎదురౌతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ‘భారతీ ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రూ.16,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. మరో రూ.24,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక జియో వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష టవర్ల ఏర్పాటుకు రూ.50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది’ అని సుందరరాజన్ వివరించారు. ఇక ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కూడా వాటి మొబైల్ టవర్ల పెంపునకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. -
కాల్ డ్రాప్స్‌కి సాకులు చెప్పొద్దు
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాల్సిందేనని టెల్కోలకు కేంద్రం స్పష్టంచేసింది. మొబైల్ టవర్ల ఏర్పాటులో ఇబ్బందులున్నాయనో లేదా మరొకటో సాకులు చెప్పొద్దని తెగేసి చెప్పింది. కాల్స్ నాణ్యత విషయంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతోందని టెలికం శాఖ (డాట్) కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. డ్రాప్స్ సమస్య యథాప్రకారం కొనసాగడానికి వీల్లేదని.. దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పదని పరిశ్రమకు స్పష్టం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. కాల్ డ్రాప్ ఫార్ములా ఆధారిత మొబైల్ సేవల నాణ్యతపై జనవరి 21న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక అందగానే పరిశ్రమ వర్గాలతో డాట్ భేటీ కానున్నట్లు అరుణ వెల్లడించారు. ప్రజల వ్యతిరేకత కారణంగా మొబైల్ ఆపరేటర్లు కొన్ని చోట్ల టవర్ల ఏర్పాటులో సమస్యలు ఎదుర్కోవటం నిజమే అయినా... కాల్ డ్రాప్స్‌కు దాన్ని సాకుగా చూపరాదని అరుణ స్పష్టంచేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపర్చుకోవడానికి టెల్కోలు పెట్టుబడులు పెట్టాల్సిందేనన్నారు. మొబైల్ కాల్స్ అంతరాయాలను నిరోధించేలా ట్రాయ్ తెచ్చిన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత తొలిసారిగా డిసెంబర్ త్రైమాసిక పరిణామాలపై ట్రాయ్ త్వరలో నివేదిక ఇవ్వనుంది. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ల స్థాయిలో కాల్స్ నాణ్యతను పరిశీలించనున్నారు. ప్రమాణాలు పాటించకపోతే టెల్కోలపై గరిష్టంగా రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. -
కొత్త టెలికం పాలసీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నూతన టెలికం పాలసీకి కేంద్ర ప్రభుత్వం మెరుగులు దిద్దుతోంది. డ్రాఫ్ట్ పాలసీ జనవరికల్లా సిద్ధం కానుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వెల్లడించారు. ఇక్కడి టీ–హబ్‌లో యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆమె మాట్లాడారు. నూతన టెలికం పాలసీకి మార్చికల్లా క్యాబినెట్ ఆమోదం లభించవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ను అందరికీ చేరువ చేయడం, టెలికంలో మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టెలికం రంగంలో ఆరోగ్యకర వృద్ధి ప్రధాన అంశాలుగా పాలసీ ఉంటుందని వివరించారు. మొబైల్ నంబర్లు ఆధార్‌కు అనుసంధానంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎప్పటికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారో సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. దీనికి మేం సమాధానం ఇచ్చాం. ప్రజలు ఇబ్బంది పడకుండా ఆధార్ అనుసంధానానికి సులభ ప్రక్రియను తీసుకొస్తున్నాం. ప్రస్తుతానికి ఆధార్ తప్పనిసరి. సుప్రీం తీర్పును అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయి’ అని తెలిపారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ పనితీరు మెరుగుపడిందని చెప్పారు. ఏడాదిలో మార్కెట్ వాటా పెంచుకుందని, సుస్థిర వాటా దిశగా బీఎస్ఎన్ఎల్ ముందుకెళ్తోందన్నారు. బండిల్ ఆఫర్లు, కొత్త ప్రోడక్టులను ఆఫర్ చేస్తోందని గుర్తు చేశారు. భారత్ నెట్ ప్రాజెక్టులో బీఎస్ఎన్ఎల్ గ్రామీణ ప్రాంతాల్లో ముందుండనుందని తెలిపారు. -
ఐటీ రంగం పటిష్టంగానే...
♦ పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు ♦ ఐటీ కార్యదర్శి అరుణ సుందరరాజన్ న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపుపై నెలకొన్న ఆందోళనను తొలగించే దిశగా కేంద్రం రంగంలోకి దిగింది. ఐటీ రంగం పటిష్టంగానే ఉందని, వాస్తవానికి సాదా సీదా సర్వీసుల నుంచి అత్యధిక నైపుణ్యం గల సేవలవైపు మళ్లుతోందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ పేర్కొన్నారు. పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా కొందరు ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం సాధారణంగా ఏటా జరిగేదేనని, ఈ ఏడాదీ అదే జరుగుతోంది తప్ప అసాధారణ చర్యలేమీ తీసుకోవడం లేదని ఐటీ కంపెనీలు తనకు వివరించినట్లు ఆమె తెలిపారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ తదితర ఐటీ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మొబైల్స్ తయారీ ఇండస్ట్రీ ఎన్నికోట్లో తెలుసా?
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్ సెట్లకు ప్రధాన మార్కెట్ లో ఒకటి భారత్. ఈ మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ఇండస్ట్రీ వచ్చే 5-7 ఏళ్లలో భారీగా అభివృద్ధి చెందనుందట. వచ్చే ఏళ్లలో ఈ ఇండస్ట్రీ 500 బిలియన్ డాలర్లకు అంటే 32,50,000 కోట్లకు చేరుకోనుందని అంచనాలు వెలువడుతున్నాయి. దశలవారీగా తయారుచేసే కార్యక్రమం(పీఎంపీ) ద్వారా మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ఇండస్ట్రీ ఈ మేర పెరుగనుందని ఐటీ సెక్రటరీ అరుణా సుందరరాజన్ తెలిపారు. స్థానిక ఉత్పత్తిని పెంచడానికి ప్రధాన ప్రోత్సహకంగా బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉందన్నారు. టెక్ దిగ్గజం ఆపిల్ తన మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభించాలంటే, పీఎంపీతో మీడియం టర్మ్ మానుఫ్రాక్ట్ర్చరింగ్ ప్లాన్స్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని చెప్పారు. మొబైల్, కాంపొనెట్ మానుఫ్రాక్ట్ర్చరింగ్ హబ్ గా దేశాన్ని తీర్చిదిద్దడానికి ఓ టైమ్-బౌండ్ ప్రేమ్ వర్క్ లా ఈ పాలసీ ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాక ఈ ప్రక్రియలో భాగంగా 5.6 మిలియన్ ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. '' ఈ ఇండస్ట్రీ 500 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. దానిలో 230 బిలియన్ డాలర్లు మొబైల్ ఫోన్లు, 270 బిలియన్ డాలర్లు కాంపొనెంట్లకు చెందినది ఉంటాది. పీఎంపీ ద్వారా 40 శాతం గ్లోబల్ డిమాండ్ ను అందుకుంటాం'' అని సుందరరాజన్ చెప్పారు. పీఎంపీ ద్వారా 1.25 బిలియన్ ఫోన్లను ఉత్పత్తి చేసి, వాటిలో 800మిలియన్ ఫోన్లను వచ్చే ఐదు లేదా ఏడేళ్లలో ఎగుమతులు చేపడతామని సుందరరాజన్ విశ్వసిస్తున్నారు. -
నెలాఖరుకల్లా అన్ని బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే దిశగా ఈ నెలాఖరు నాటికి (మార్చి 31) మొబైల్ బ్యాంకింగ్ (ఎం–బ్యాంకింగ్) సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని బ్యాంకులన్నింటినీ కేంద్రం ఆదేశించింది. మొబైల్ ఫోన్ గల ప్రతీ ఖాతాదారు ఎం–బ్యాంకింగ్‌ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. గతంలో మొబైల్ బ్యాంకింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవడంతో అత్యధిక శాతం కస్టమర్లు దీనిపై ఆసక్తి చూపేవారు కాదని, ప్రస్తుతం చాలా మంది ఎం–బ్యాంకింగ్ కోరుకుంటున్న నేపథ్యంలో మార్చి 31లోగా అన్ని బ్యాంకులు తమ తమ ఖాతాదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని పేర్కొన్నట్లు ఆమె వివరించారు. యూపీఐ లేదా భీమ్ యాప్ ఉపయోగిస్తున్న ఖాతాదారులకు ఆటోమేటిక్‌గా మొబైల్ బ్యాంకింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
‘అన్ని బ్యాంకులు 31లోగా పూర్తి చేయాలి’
న్యూఢిల్లీ: తమ బ్యాంకుల్లోని ఖాతాదారులకు మార్చి 31లోగా మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందించాలని అన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలకు మరింత ఊపునిచ్చే ఉద్దేశంతో ఈ పనిని సత్వరంగా వేగిరం చేయాలని స్పష్టం చేసింది. ‘మొబైల్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడికి మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందించాలి. ఇందుకోసం మార్చి 31వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి’ అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సెక్రటరీ అరుణా సుందరరాజన్ బుధవారం విలేకరులకు చెప్పారు. ‘వాస్తవానికి ప్రారంభ సమయంలో మొబైల్ బ్యాంకింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ, తర్వాత పలువురు కస్టమర్లు తమకు మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాలు కావాలని, ఆ మేరకు బ్యాంకులను ఆదేశించాలంటూ మాకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అది తప్పకుండా చేయాల్సిన పని. ఇది ఇప్పటికే ప్రారంభమైనా పెద్దగా బ్యాంకులు స్పందించడం లేదని తెలిసింది. అందుకే మార్చి 31లోగా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడికి అందించాలి’ అని ఆమె ఆదేశించారు.