న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సర్వీసులపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 2022 నాటికల్లా దేశీయంగా కూడా ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యదర్శి ఎస్.కె.గుప్తా చెప్పారు. ఆ పై ఐదేళ్లలో డిజిటల్ మాధ్యమం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి వినియోగదారుల ధోరణుల్లో మార్పులు తేగలవని గుప్తా చెప్పారు. ‘‘కొన్నాళ్లుగా మీడియా పరిశ్రమలో నాటకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఆయా సంస్థలు నిలదొక్కుకోవడానికి కొత్త టెక్నాలజీని వినియోగించటమనేది కీలకంగా మారుతోంది’’ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో గుప్తా వ్యాఖ్యానించారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో మీడియా కంటెంట్ స్వరూపంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణమైన కంటెంట్‌ను అందించడంపై మీడియా పరిశ్రమ మరింతగా దృష్టి పెడితే, కంటెంట్ వినియోగం గణనీయంగా పెరగగలదని గుప్తా తెలిపారు. మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులకు 5జీ సేవలు ఉపయోగపడతాయి. అలాగే, తయారీ, రిటైల్, విద్య, వైద్యం తదితర రంగాల వృద్ధికి గణనీయంగా తోడ్పడే అవకాశం ఉంది.
5జీతో జీడీపీ రెట్టింపు: అరుణ సుందరరాజన్
స్థూల దేశీయోత్పత్తిని రెట్టింపు చేయగలిగే సత్తా 5జీ సేవలకుదన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ టెలికం ఇన్‌ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ చెప్పారు. అంతర్జాతీయంగా టెలికం రంగంపై పెట్టుబడులు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనున్నాయని, ఒక్క చైనాయే డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రా ఏర్పాటుపై ఏటా 188 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు. కేవలం 5జీకే చైనా బడ్జెట్ సుమారు 500 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందన్నారు. బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అరుణ ఈ విషయాలు చెప్పారు.
మరోవైపు, నిర్దాక్షిణ్యమైన పోటీ వల్ల భారత టెలికం పరిశ్రమ పెను సవాళ్లమయంగా మారిందని అరుణ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారీ పెట్టుబడులను ఆకర్షించేంత లాభదాయకత, వ్యాపార అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయని చెప్పారామె. ‘‘దేశీ టెలికం పరిశ్రమమ ఇప్పుడిప్పుడే విప్లవాత్మకమైన మార్పులను చూస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరెన్నో చూడాల్సి వస్తుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిలకడగా మూడు దశాబ్దాల పాటు భారత్ 9– 10 శాతం మేర వృద్ధి చెందాలంటే డిజిటల్ వైపు మళ్లాల్సిన అవసరం ఉందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇందుకోసం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పటిష్టం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది వన్ ప్లస్ 5జీ ఫోన్..
5జీ టెక్నాలజీ సేవలకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది ఆవిష్కరించనున్నట్లు చైనా హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వెల్లడించింది. ముందుగా యూరప్‌లో దీన్ని ప్రవేశపెడతామని స్నాప్‌డ్రాగన్ టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వన్‌ప్లస్ సీఈవో పీట్ లౌ తెలిపారు. టెలికం ఆపరేటర్ ఈఈ భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియజేశారు. మరింత శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌తో ఇది రూపొందుతుందని పీట్ చెప్పారు.
నాలుగేళ్లలో... 5జీ: ట్రాయ్
Published Fri, Dec 7 2018 4:44 AM | Last Updated on Fri, Dec 7 2018 4:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment