హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నూతన టెలికం పాలసీకి కేంద్ర ప్రభుత్వం మెరుగులు దిద్దుతోంది. డ్రాఫ్ట్ పాలసీ జనవరికల్లా సిద్ధం కానుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ వెల్లడించారు. ఇక్కడి టీ–హబ్‌లో యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆమె మాట్లాడారు. నూతన టెలికం పాలసీకి మార్చికల్లా క్యాబినెట్ ఆమోదం లభించవచ్చని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ను అందరికీ చేరువ చేయడం, టెలికంలో మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టెలికం రంగంలో ఆరోగ్యకర వృద్ధి ప్రధాన అంశాలుగా పాలసీ ఉంటుందని వివరించారు. మొబైల్ నంబర్లు ఆధార్‌కు అనుసంధానంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎప్పటికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారో సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. దీనికి మేం సమాధానం ఇచ్చాం.
ప్రజలు ఇబ్బంది పడకుండా ఆధార్ అనుసంధానానికి సులభ ప్రక్రియను తీసుకొస్తున్నాం. ప్రస్తుతానికి ఆధార్ తప్పనిసరి. సుప్రీం తీర్పును అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయి’ అని తెలిపారు. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ పనితీరు మెరుగుపడిందని చెప్పారు. ఏడాదిలో మార్కెట్ వాటా పెంచుకుందని, సుస్థిర వాటా దిశగా బీఎస్‌ఎన్‌ఎల్ ముందుకెళ్తోందన్నారు. బండిల్ ఆఫర్లు, కొత్త ప్రోడక్టులను ఆఫర్ చేస్తోందని గుర్తు చేశారు. భారత్ నెట్ ప్రాజెక్టులో బీఎస్‌ఎన్‌ఎల్ గ్రామీణ ప్రాంతాల్లో ముందుండనుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment