న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాల్సిందేనని టెల్కోలకు కేంద్రం స్పష్టంచేసింది. మొబైల్ టవర్ల ఏర్పాటులో ఇబ్బందులున్నాయనో లేదా మరొకటో సాకులు చెప్పొద్దని తెగేసి చెప్పింది. కాల్స్ నాణ్యత విషయంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతోందని టెలికం శాఖ (డాట్) కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. డ్రాప్స్ సమస్య యథాప్రకారం కొనసాగడానికి వీల్లేదని.. దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పదని పరిశ్రమకు స్పష్టం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
కాల్ డ్రాప్ ఫార్ములా ఆధారిత మొబైల్ సేవల నాణ్యతపై జనవరి 21న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక అందగానే పరిశ్రమ వర్గాలతో డాట్ భేటీ కానున్నట్లు అరుణ వెల్లడించారు. ప్రజల వ్యతిరేకత కారణంగా మొబైల్ ఆపరేటర్లు కొన్ని చోట్ల టవర్ల ఏర్పాటులో సమస్యలు ఎదుర్కోవటం నిజమే అయినా... కాల్ డ్రాప్స్‌కు దాన్ని సాకుగా చూపరాదని అరుణ స్పష్టంచేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మెరుగుపర్చుకోవడానికి టెల్కోలు పెట్టుబడులు పెట్టాల్సిందేనన్నారు.
మొబైల్ కాల్స్ అంతరాయాలను నిరోధించేలా ట్రాయ్ తెచ్చిన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ తర్వాత తొలిసారిగా డిసెంబర్ త్రైమాసిక పరిణామాలపై ట్రాయ్ త్వరలో నివేదిక ఇవ్వనుంది. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ల స్థాయిలో కాల్స్ నాణ్యతను పరిశీలించనున్నారు. ప్రమాణాలు పాటించకపోతే టెల్కోలపై గరిష్టంగా రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment