న్యూఢిల్లీ: 5జీ సేవలను విస్తరించాలంటే మరింత స్పెక్ట్రం అవసరమని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచర్ తెలిపారు. కీలకమైన 6 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను టెలికం సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలా జరగని పక్షంలో 5జీ సేవలను విస్తరించడం, వేగంగాను.. చౌకగాను అందించడంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కొచర్ వివరించారు.
భారీ జనాభా ఉండే ప్రాంతాల్లో.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నెట్ సర్వీస్ లను విస్తరించడానికి అత్యంత నాణ్యమైన 6 గిగాహెట్జ్ బ్యాండ్ అనువుగా ఉంటుంది. దీంతో ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రం కోసం వైఫై సంస్థలు, టెల్కోల మధ్య పోటీ ఉంటోంది. నగరాల్లో విస్తృతంగా మొబైల్ నెట్‌వర్క్‌ను పెంచుకోవాలంటే 6 గిగాహెట్జ్ బ్యాండ్ కీలకమని కొచర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెలికం శాఖకు విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. దీనిపై ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటైందని వివరించారు.
కాల్ డ్రాప్స్‌పై రాష్ట్ర స్థాయి డేటా సాధ్యం కాదు
కాల్ అంతరాయాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా డేటా ఇవ్వాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని కొచర్ పేర్కొన్నారు. యూజర్లకు ఎట్టి పరిస్థితుల్లోనైనా నాణ్యమైన సేవలను అందించేందుకు టెల్కోలు ప్రయత్నిస్తుంటాయని, కానీ ఈ సూచనలను అమలు చేయాలంటే క్షేత్ర స్థాయిలో అడ్మిని్రస్టేషన్‌పరంగా అనేక సవాళ్లు ఉంటాయని ఆయన చెప్పారు.
నిబంధనల ప్రకారం టెలికం సేవలను ప్రస్తుతం సర్కిళ్ల వారీగా, ఎల్‌ఎస్‌ఏ (లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియా)వారీగా అందిస్తున్నామని, దానికి అనుగుణంగానే డేటా కూడా ఉంటుందని కొచర్ తెలిపారు. ఇవన్నీ వివిధ జ్యూరిడిక్షన్‌లలో ఉంటాయి కాబట్టి రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో డేటా ఇవ్వాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాటిస్తున్న ఎల్‌ఎస్‌ఏ (లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియా) స్థాయి డేటా విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని కొచర్ వివరించారు. రాష్ట్ర స్థాయి డేటా వెల్లడి ఆదేశాలపై పునరాలోచన చేయాలని ట్రాయ్‌ను సీవోఏఐ కోరినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment