సాక్షి, అమరావతి: శ్రీముఖి తన తల్లితో మాట్లాడాలని ఫోన్ చేసింది. తల్లి పార్వతమ్మ లిఫ్ట్ చేసింది. హలో.. హలో.. అన్నా అవతలి నుంచి సమాధానం లేదు. హలో వినిపిస్తుందా అని శ్రీముఖి అడుగుతోందే తప్ప అవతలి నుంచి శబ్దం రాదు. ఆ కాసేపటికే కాల్ కట్ అయింది. వెంకటేశ్వర్లు తన తమ్ముడితో అత్యవసరంగా మాట్లాడాలని తన మొబైల్ నుంచి ఫోన్ చేశాడు. ఒకసారి, రెండుసార్లు.. మూడు సార్లు.. ఇలా చాలా సార్లు కాల్ చేస్తే ఒక్క కాల్ కలిసింది.
ఇవి ప్రస్తుతం దేశంలో ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఫోన్ చేస్తే కాల్ కలవదు. ఒకవేళ కలిసినా వెంటనే కట్ అవుతుంది. కాల్‌లో ఉండగానే వాయిస్ బ్రేకింగ్.. ఒక్క కాల్ మాట్లాడటానికి మూడు, నాలుగుసార్లు డయల్ చేయాలి. సిగ్నల్స్ ఉన్నా ఒక్కోసారి ఫోన్‌ను ఫ్లైట్ మోడ్/స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తేగాని కాల్ వెళ్లని పరిస్థితి. ప్రస్తుతం టెలికాం రంగంలో ‘కాల్ డ్రాప్’, ‘కాల్ కనెక్షన్’ పెద్ద సమస్యగా మారింది.
మిగతా దేశాలతో పోలిస్తే దేశంలోనే కాల్ డ్రాప్ రేటు ఎక్కువగా ఉంది. సాంకేతికత 2జీ నుంచి 4జీకి వచ్చినప్పటికీ సిగ్నల్ లెవల్స్ పరిధి తగ్గుతోంది. గతంతో పోలిస్తే ఒక టవర్ సిగ్నల్ పరిధి 10వ వంతుకు తగ్గిపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.50 లక్షల మొబైల్ నెట్‌వర్క్ టవర్లు ఉన్నాయి. అయినా సమస్య పరిష్కారమవలేదు.
కొత్త సాంకేతికతతో పాటు మరో లక్ష టవర్లు అందుబాటులోకి వస్తే తప్ప నెట్‌వర్క్ నాణ్యత మెరుగుపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులు కాల్ డ్రాప్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే వినియోగదారులు ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లకే పరిమితమవుతారని, ఎక్కువ వెచ్చించి 5జీ వంటి కొత్త టారిఫ్‌లకు వెళ్లేందుకు ఇష్టపడరని నిపుణులు చెబుతున్నారు.
బ్యాటరీ త్వరగా అయిపోతుంది
భారత టెలికాం మార్కెట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం దేశంలో 1.1 బిలియన్ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. టెలికాం కంపెనీలు ట్రాయ్ నిర్దేశించిన బెంచ్‌మార్క్‌ను అందుకోలేక΄ోవడంతోనే అధిక కాల్ డ్రాప్స్ తలెత్తుతున్నాయి. సిగ్నలింగ్ కవరేజీ క్షీణించడం వల్ల హ్యాండ్‌సెట్ అధిక శక్తితో పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ వేగంగా అయిపోవడంతో పాటటు ఫోన్ కూడా త్వరగా పాడవుతుంది.
ఈ నేపథ్యంలోనే కాల్ డ్రాప్ సమస్యపై వినియోగదారుల నుంచి కచ్చితమైన అభిప్రాయ సేకరణకు.. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ‘ట్రాయ్‌మై కాల్’ వాయిస్ కాల్ క్వాలిటీ మానిటరింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు కాల్ పూర్తి చేసిన తర్వాత తమ అభిప్రాయాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సమాచారంతో టెలికాం సర్కిల్ నెట్‌వర్క్ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు వీలవుతుంది.
పెరిగిన డేటా, వైఫై కాల్స్
ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ దేశంలో 339 జిల్లాల్లో చేసిన సర్వే ప్రకారం 91 శాతం మంది కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇందులో 56 శాతం మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారులు డేటా, వైఫై ఆధారిత కాల్స్‌కు వెళ్తున్నారు. ఈ తరహా కాల్స్ 2019లో 75 శాతం ఉంటే ఇప్పుడు 82 శాతానికి పెరిగాయి. దేశంలో 0 నుంచి 3 సెకన్లలోపు కాల్ డ్రాపింగ్ శాతం పెరిగింది. నిమిషంలోపు డ్రాపింగ్ శాతం
తగ్గింది.
5జీపై అనాసక్తత
సాంకేతికతలో ఎంత మార్పులు వచ్చినప్పటికీ కాల్ డ్రాప్ సమస్యలు తగ్గక΄ోవడంతో మొబైల్ నెట్‌వర్క్ యూజర్లు కొత్త సాంకేతికత వైపు వెళ్లడానికి అంతగా ఇష్టపడటంలేదు. 5జీ వంటి హై స్పీడ్ నెట్‌వర్క్ తేవడానికి ముందుగా నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందుకే ప్రస్తుత టారిఫ్‌లతోనే సరిపెట్టుకొంటామని, ఎక్కువ చార్జీలు పెట్టి కొత్త టారిఫ్‌లు తీసుకోబోమని చెబుతున్నారు. ఇటీవలి సర్వేలో 43 శాతం మంది ప్రస్తుత టారిఫ్‌కంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా లేమని కరాఖండిగా చెప్పడమే దీనికి నిదర్శనం. మరో 43 శాతం మంది 10 శాతం ఎక్కువ చెల్లించగలమని చె΄్పారు. 10 శాతం మంది మాత్రం 10 నుంచి 25 శాతం వరకు ఎక్కువ చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment