సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారులను చికాకుపరిచే కాల్‌డ్రాప్స్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సీరియస్ అయింది. కాల్‌డ్రాప్స్‌పై నూతన సేవా నాణ్యతా ప్రమాణాలను అందించడంలో విఫలమయ్యారంటూ కొన్ని టెలికాం కంపెనీలకు ట్రాయ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వారాంతంలోగా దీనిపై సరైన వివరణలతో ముందుకురావాలని ఆయా కంపెనీలను కోరింది. అయితే ఏ టెలికాం ప్రొవైడర్లకు ఈ నోటీసులు జారీ అయ్యాయో టెలికాం రెగ్యులేటర్ వివరించలేదు. నిబంధనలు పాటించని ఆపరేటర్ల పేర్లను తాము బహిర్గతం చేయదలుచుకోలేదని ట్రాయ్ ఛైర్మన్ ఆర్‌ఎస్ శర్మ చెప్పారు.
ఆయా కంపెనీల నుంచి వివరణలు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు. ట్రాయ్ ఇటీవల నిర్ధేశించిన నూతన సేవా ప్రమాణాలను కొన్ని సర్కిళ్లలో పాటించని కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. కాగా, 2017, అక్టోబర్ 1 నుంచి కాల్‌డ్రాప్స్ ను అధిగమించేందుకు ట్రాయ్ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో కాల్‌డ్రాప్స్‌కు రూ పదిలక్షల జరిమానాను టెలికాం సర్కిల్ స్ధాయిలో విధిస్తుండగా, తాజా నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ స్ధాయిలోనే చర్యలను చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment