ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి : విజయవాడలో ఉంటున్న నరేంద్రకు ఆఫీసు నుంచి ముఖ్యమైన ఫోన్ వచ్చింది. ఇంట్లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే అవతలి వైపు వారికి తన మాట వినిపించడం లేదు. ఫోన్ కట్ చేసి బయటకు వచ్చి తిరిగి కాల్ చేస్తే కలవటం లేదు. దాదాపు ప్రతి సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటున్న అనుభవం ఇది. కొందరైతే సిగ్నల్స్ అందక బయటకు లేదా ఇంటిపైకి పరిగెత్తాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఖాతాదారులను పెంచుకోవడంపై చూపుతున్న శ్రద్ధను టవర్ల సంఖ్యపై కూడా చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
టవర్లు తగినన్ని లేకనే..
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న మొబైల్ వాడకందారులకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచడంలో సెల్‌ఫోన్ ఆపరేటర్లు విఫలమవుతున్నారు. ఖాతాదారుల సంఖ్యకు తగినట్టుగా టవర్లు, సామర్థ్యం పెంచకపోవడంతో కాల్‌డ్రాప్స్ ఎక్కువవుతున్నాయి. కాల్‌డ్రాప్స్‌ను అరికట్టేందుకు ‘ట్రాయ్’ ఎన్ని పెనాల్టీలు విధిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. సబ్‌స్క్రైబర్స్ అధికంగా ఉన్న సెల్యూలర్ సంస్థల్లో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. వారం క్రితం నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఖాతాదారులు ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, దీన్ని వెంటనే సరిదిద్దినట్లు ఐడియా ఏపీ సర్కిల్ హెడ్ బి.రామకృష్ణ తెలిపారు. వొడాఫోన్‌ను టేకోవర్ చేయడం వల్ల ఆ ఖాతాదారులు ఐడియాలోకి మారటంతో కూడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు.
పోటాపోటీగా ఆఫర్లు
సెల్‌ఫోన్ కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆఫర్లు ప్రకటిస్తుండటంతో ప్రతి నెలా సబ్‌స్క్రైబర్స్ భారీగా పెరుగుతున్నారు. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన ఓ కంపెనీ ధాటిని తట్టుకుని ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఇతర ఆపరేటర్లు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఖాతాదారుల సంఖ్య పెరుగుతున్నా ఆదాయం తగ్గిపోతోందని కంపెనీలు చెబుతున్నాయి.
హైస్పీడ్ లేదు... 2జీనే
సెల్‌ఫోన్ కంపెనీలు చెబుతున్న హైస్పీడ్ డేటా కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని, పలు సందర్భాల్లో 2 జీ స్పీడు కూడా ఉండటం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌లు ప్రకటిస్తుండటంతో వినియోగం భారీగా పెరిగి పీక్ సమయాల్లో వేగం తగ్గిపోతోంది. 4 జీ టవర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కానీ డేటా స్పీడ్ పెరిగే అవకాశం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐడియా సెల్యూలర్‌కు 11,000కి పైగా 2జీ టవర్లు ఉంటే 3జీ టవర్లు సుమారు 9,000 ఉన్నాయి. ఐడియా 4 జీ టవర్లు కేవలం 8,000 మాత్రమే ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ అనుమతి లేనందున ఇతర సంస్థల స్పీడ్‌తో పోల్చి చూడకూడదని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
8 కోట్లుదాటిన వాడకం దారులు
ప్రస్తుతం ఏపీ సర్కిల్‌లో (ఏపీ, తెలంగాణ) ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీల ఖాతాదారుల సంఖ్య 7.02 కోట్లకు చేరింది. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఖాతాదారులను కూడా కలిపితే 8 కోట్లు దాటుతోంది. కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆఫర్లు ప్రకటిస్తుండటంతో లాభాలు తగ్గి సామర్థ్యం పెంచుకోలేకపోతున్నాయి. దీనికి తోడు కొత్త టవర్ల ఏర్పాటుకు అనుమతులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. కాలనీల మధ్యలో వెలుస్తున్న ఎత్తైన అపార్ట్‌మెంట్ల వల్ల కూడా సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతోందని, ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదు అందగానే టవర్ల ఫ్రీక్వెన్సీని మారుస్తున్నట్లు టెలికాం అధికారులు పేర్కొంటున్నారు.
7.02కోట్లు
ప్రైవేట్ సెల్‌ఫోన్ కంపెనీల ఖాతా దారుల సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment