ఈసారి రేట్ల కోత ఉండకపోవచ్చు
ద్రవ్యోల్బణం తగ్గుదలపై స్పష్టత వచ్చేదాకా అంతే విశ్లేషకుల అంచనాలు
ముంబై: వచ్చే మంగళవారం (ఆగస్టు 5) జరిపే పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్.. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని, తగ్గించకపోవచ్చని బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా ఆర్‌బీఐ రేట్ల తగ్గింపుపై హడావుడిగా నిర్ణయం తీసుకోకపోవచ్చని సింగపూర్‌కి చెందిన బ్రోకరేజి సంస్థ డీబీఎస్ పేర్కొంది. జూన్‌లో నిర్వహించిన పరపతి విధాన సమీక్ష అనంతరం స్థూల ఆర్థికపరిస్థితులు మెరుగ్గా కనిపిస్తున్నాయని, పారిశ్రామిక వృద్ధిలో కాస్త స్థిరత్వం కనిపిస్తోందని ఒక నివేదికలో తెలిపింది.
రాబోయే త్రైమాసికాల్లో పారిశ్రామిక వృద్ధి కన్సాలిడేట్ కాగలదని పేర్కొంది. మరోవైపు, ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గుముఖం పట్టిందని స్పష్టత వచ్చే దాకా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ ఒక నివేదికలో పేర్కొంది. అప్పటిదాకా ఆర్‌బీఐ చేపట్టే ద్రవ్య నిర్వహణ చర్యలను నిశితంగా గమనించాల్సి ఉంటుందని వివరించింది. ఏదేమైనా వర్షపాతం మెరుగ్గా ఉండి, ద్రవ్యోల్బణం దిగి వస్తే డిసెంబర్‌లో ఆర్‌బీఐ రేట్లను తగ్గించవచ్చని అంచనా వేసింది. ఒకవేళ ధరల పెరుగుదల మరింత కాలం కొనసాగితే రేట్ల కోత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగొచ్చని పేర్కొంది.
ద్రవ్యోల్బణంపై పోరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇవి కల్పించే ఊరట స్వల్పకాలికమైనదేనని డీబీఎస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉండే వర్షపాతం ప్రభావాలను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సరిపోవని కూడా వివరించింది. వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండటం, పండ్లు.. కూరగాయల రేట్లు ఎగియడం నేపథ్యంలో ద్రవ్యోల్బణం తగ్గినా.. అది స్థిరంగా కొనసాగేలా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్న సంగతి తెలిసిందే.
రేట్లు తగ్గిస్తే కార్పొరేట్లకు కష్టాలు
రిజర్వ్ బ్యాంకు గనుక కీలక వడ్డీ రేట్లను ఇప్పుడిప్పుడే తగ్గించిందంటే కార్పొరేట్లపై ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ హెచ్చరించింది. పాలసీ రేట్లను ఏమాత్రం తగ్గించినా రూపాయి పతనానికి దారి తీస్తుందని, ఇది టాప్ 500 కంపెనీల్లో చాలా మటుకు సంస్థల దిగుమతి ప్రణాళికలను దెబ్బతీస్తుందని ఒక నివేదికలో పేర్కొంది.
ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత రూపాయి మారకం విలువ దాదాపు 1.1-5.8 శాతం మేర క్షీణించిన ఉదంతాలు అనేకం ఉన్నాయని ఇండియా రేటింగ్స్ సీనియర్ డెరైక్టర్ దీప్ ఎన్ ముఖర్జీ పేర్కొన్నారు. రూపాయి విలువ 1 శాతం క్షీణించినా కంపెనీల స్థూల లాభాలు 1.3 శాతం తగ్గిన సందర్భాలు ఉన్నాయని ఆయన వివరించారు. బీఎస్‌ఈ 500లో నికరంగా దిగుమతి ఎక్కువగా ఉండే 53 శాతం సంస్థల గత ఫలితాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని ముఖర్జీ చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆరు-తొమ్మిది నెలల కాలంలో రేట్ల కోత చేపడితే కంపెనీలకు సమస్యలు తప్పవన్నారు.
జైట్లీతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఆగస్టు 5వ తేదీన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య,పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశం అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. పలు ఆర్థిక అంశాలపై తాను ఆర్థికమంత్రితో చర్చించినట్లు తెలిపారు.
శుక్రవారంనాటి మార్కెట్ భారీ నష్టాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాల నుంచి మనం పక్కకు జరగలేమని అన్నారు. ఆగస్టు 5 పాలసీ సందర్భంగా యథాతథ పరిస్థితిని ఆర్‌బీఐ కొనసాగించవచ్చన్న ఊహాగానాలే మార్కెట్ నష్టానికి కారణమని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.