ఆర్థికవ్యవస్థ పుంజుకుంటోంది..
చెన్నై : భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని.. కంపెనీల పెట్టుబడులు కూడా మెరుగుపడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అయితే, పటిష్టమైన వృద్ధిని సాధించాలంటే మరిన్ని సంస్కరణలను అమలు చేయడంతోపాటు నిలిచిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తగిన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ ఆర్‌బీఐ బోర్డు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజన్ పలు అంశాలను ప్రస్తావించారు.
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతుల మందగమనం కొంత ఆందోళనకరమైన అంశమేనన్నారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన రికవరీ బాటలో ఉంది. దీన్ని మరింత జోరందుకునేలా చేయాలంటే.. కొన్ని అడ్డంకులను తొలగించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంస్కరణలను పరుగులు పెట్టించడం, ఆగిపోయిన ప్రాజెక్టులను గాడిలోపెట్టడం వంటివి కీలకం’ అని రాజన్ వ్యాఖ్యానించారు.
ఆశాజనకంగానే రుతుపవనాలు...
రుతుపవన వర్షాలపై ఇప్పటిదాకా ఆశాజనకమైన వార్తలే వస్తున్నాయని.. అయితే, వచ్చే కొద్ది రోజుల్లో వర్షాలు ఎలాఉంటాయనేది నిశితంగా గమనించాల్సి ఉందని రాజన్ పేర్కొన్నారు. ఇక ద్రవ్యోల్బణం అనేది ఎప్పుడూ ఆందోళనకరమైన విషయమేనని చెప్పారు. గణాంకాల ఆధారంగానే తమ పాలసీ చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.01%, టోకు ధర ద్రవ్యోల్బణం మైనస్ 2.36% చొప్పున నమోదైన సంగతి తెలిసిందే.
రికవరీబాటలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ...
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనంగానే ఉన్నప్పటికీ.. రికవరీ బాటలో కొనసాగుతోంది. అయితే, 1930ల నాటి మహా మాంద్యం తరహా పరిస్థితులేవీ లేవు’ అని రాజన్ పేర్కొన్నారు. ప్రపంచం మళ్లీ మహా మాంద్యం తరహా సమస్యల్లోకి జారిపోతోందంటూ రాజన్ వ్యాఖ్యానించినట్లు(లండన్ బిజినెస్ స్కూల్ ప్రసంగంలో) మీడియాలో వార్తలు రావడం.. ఆయన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోలేదంటూ ఆర్‌బీఐ వివరణ ఇవ్వడం తెలిసిందే. ఈ అంశంపై రాజన్ మాట్లాడుతూ.. అంతర్గతంగా జరిగిన అప్పటి సమావేశంలో తన ప్రసంగాన్ని మీడియా అనవసర ఊహాగానాలతో పెద్ద సంచలనం చేసిందని పేర్కొన్నారు.
గ్రీస్ ప్రభావం పరిమితమే...
ఐఎంఎఫ్ చెల్లింపుల విషయంలో గ్రీస్ డిఫాల్ట్ కావడం, అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రత్యక్ష ప్రభావం భారత్‌పై చాలా పరిమితంగానే ఉండొచ్చని రాజన్ చెప్పారు. గ్రీస్‌తో వాణిజ్యం, ఇతరత్రా ఆర్థికపరమైన కార్యకలాపాలు భారత్‌కు పెద్దగా లేకపోవడమే దీనికి కారణమని ఆయన వెల్లడించారు. అయితే, యూరో ఒడిదుడుకులు భారత్ కరెన్సీపై కొంతమేరకు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. భారత్ వృద్ధిపథంపై ఇన్వెస్టర్లలో సానుకూల ధోరణి కొనసాగుతుందని కూడా రాజన్ స్పష్టం చేశారు.
అన్ని అకౌంట్లూ ఒకేచోట చూసుకోవచ్చు..!
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే విషయంపై ప్రభుత్వం, ఆర్‌బీఐల మధ్య చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్స్ మెరుగుపడేందుకు ఈ అదనపు నిధులు దోహదం చేస్తాయి. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని రాజన్ పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం పీఎస్‌యూ బ్యాంకులకు రూ.7,940 కోట్ల మూల ధన నిధులను కేటాయించడం తెలిసిందే. తీవ్ర సమస్యగా మారిన మొండిబకాయిల విషయంలో పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టామని రాజన్ చెప్పారు.
ఆర్‌బీఐ పాలసీకి అనుగుణంగా చాలా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు బాటపట్టాయన్నారు. వివిధ ఫైనాన్షియల్ ప్రొడక్టుల ఖాతాలకు సంబంధించి ప్రత్యేక మధ్యవర్తిత్వ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ-అకౌంట్ అగ్రిగేటర్)ను ఏర్పాటు చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించనుందని రాజన్ వెల్లడించారు. బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్‌లు ఇతరత్రా ఫైనాన్షియల్ సంస్థలకు చెందిన అకౌంట్లను ప్రజలు ఒకేచోట చూసుకునేందుకు(కామన్ ఫార్మాట్) వీలుకల్పించడమే దీని లక్ష్యమని చెప్పారు. నియంత్రణపరమైన కార్యాచరణపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.