తప్పు చేస్తే ఎంతటివారైనా వదలొద్దు..
♦ ఆర్‌బీఐ కాగితపు పులి కాదని నిరూపించండి
♦ సహోద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ లేఖ
ముంబై: తప్పు చేసిన వారు ఎంతటి సంపన్నులైనా, శక్తిమంతులైనా విడిచిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులకు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. శిక్షలు కేవలం సామాన్యులు, బలహీనులకు మాత్రమే పరిమితమన్న అపప్రథను పోగొట్టాలని పేర్కొన్నారు. తద్వారా రిజర్వ్ బ్యాంక్ పేపరు కాగితం కాదని తెలియజెప్పాలని ఆయన సూచించారు.
నూతన సంవత్సరం సందర్భంగా దాదాపు 16,800 మంది ఉద్యోగులకు రాసిన 5 పేజీల లేఖలో రాజన్ ఈ విషయాలు పేర్కొన్నారు. ‘ఎవరూ కూడా సంపన్నులు, శక్తిమంతులతో వైరం తెచ్చుకోవడానికి ఇష్టపడరు. దీంతో వారు మరిన్ని తప్పులు చేసి తప్పించుకునే ఆస్కారం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి వల్లే మనపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది.
దేశం నిలకడగా అధిక వృద్ధి సాధించాలంటే ఈ సంస్కృతి మారాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, దీన్ని సంపన్నులు, వ్యాపార వర్గాలకు వ్యతిరేక విధానాలుగా భావించరాదని, కేవలం తప్పులను అరికట్టడానికి మాత్రమే ఇవి ఉద్దేశించినవని రాజన్ పేర్కొన్నారు. నేరాలను గుర్తించి, శిక్షలు విధించే లా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై నిరంతరం దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
అన్నీ ఉన్నాయ్ .. కానీ..
అత్యంత గౌరవప్రదమైన నియంత్రణ సంస్థగా ఆర్‌బీఐకి పేరుందని, అత్యంత సమర్ధులైన సిబ్బందీ ఉన్నారని.. కానీ నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదన్న భావన కూడా నెలకొందని రాజన్ వ్యాఖ్యానించారు. నియంత్రణ చర్యలు మరిన్ని తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆర్‌బీఐ సిబ్బంది అలసత్వం వహించరాదని, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా సూచించారు.
మీడియా కన్నా ముందుండాలి..
ఆర్‌బీఐపరమైన సమాచార వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా.. ఏవైనా కొత్తవి సాధిం చినా, నిబంధనలు తెచ్చినా గందరగోళానికి తావులేదకుండా అసలైన విషయం సూటిగా అర్థమయ్యేలా ప్రెస్ రిలీజ్ విడుదల చేయాలని ఆయన తమ సిబ్బందికి నిర్ధేశించారవు.