న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఈ వారంలో జరిగే ద్వైమాసిక సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ .. పాలసీ రేట్లను క్రమానుగతంగా కఠినతరం చేసే విధానం నుంచి తటస్థ విధానానికి మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు రేట్ల పెరుగుదల, ద్రవ్యలోటుపరమైన సవాళ్ల కారణంగా కీలక పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని చెబుతున్నారు. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ అంచనా వేసిన 3.8 శాతం కన్నా తక్కువగా 2.6 శాతంగానే నమోదైన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడం, అటు అంతర్జాతీయంగా మందగమన ఆందోళనల నేపథ్యంలో 2018–19లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ సమీర్ నారంగ్ చెప్పారు. పరపతి విధానాన్ని మార్చుకోవడానికి ఆర్‌బీఐ దీనివల్ల కాస్త వెసులుబాటు లభిస్తుందని, అయితే విద్య, వైద్యం, గృహావసరాల వ్యయాలు అధికంగానే ఉండటం వల్ల రేట్ల తగ్గింపునకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇటు పెరుగుతున్న ముడి చమురు ధరలు, అటు ద్రవ్యపరమైన సవాళ్ల కారణంగా ఈ ఏడాది ఆర్‌బీఐ పాలసీపరంగా సంక్లిష్టమైన నిర్ణయాలే తీసుకోవాల్సి రావొచ్చని కన్సల్టెన్సీ సంస్థ డీబీఎస్ ఎకనామిక్స్ పేర్కొంది. ఉర్జిత్ పటేల్ నిష్క్రమణ అనంతరం కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ సారథ్యంలో ఫిబ్రవరి 5 నుంచి 7 దాకా మూడు రోజులపాటు ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. 7వ తేదీ(గురువారం) మధ్యాహ్నం పాల సీ నిర్ణయం వెలువడుతుంది. ఈ ఆర్థిక సంవత్స రం రెండు సార్లు రేట్లను పెంచిన ఆర్‌బీఐ క్రమానుగతంగా కఠినతర విధానాన్ని పాటిస్తోంది. డిసెంబర్‌లో రేట్లను మార్చకపోయినప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగే రిస్కులు లేకపోతే తగ్గించే సంకేతాలే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశ్లేషకుల అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
9న ఆర్‌బీఐ బోర్డుతో ఆర్థిక మంత్రి భేటీ..
సాంప్రదాయం ప్రకారం బడ్జెట్ అనంతరం ఫిబ్రవరి 9న ఆర్‌బీఐ బోర్డు సభ్యులతో ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ సమావేశం కానున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో కీలక అంశాల గురించి వివరించనున్నారు. ఆర్‌బీఐ ఆరో ద్వైమా సిక పాలసీ విధాన సమీక్ష అనంతరం రెండు రోజులకు ఈ భేటీ జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర డివిడెండ్ చెల్లించాలన్న కేంద్రం సూచన కూడా ఇందు లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం రూ. 28,000 కోట్ల దాకా మధ్యంతర డివిడెండ్ రావొచ్చని అంచనా వేస్తోంది.
వడ్డీరేట్లు అక్కడే..!
Published Mon, Feb 4 2019 5:19 AM | Last Updated on Mon, Feb 4 2019 5:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment