మెజారిటీ ఓకేచెప్పినా.. రాజన్ నో!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)సెప్టెంబర్ 30 ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ముందు జరిగిన కీలక సమావేశం మినిట్స్ వివరాలను ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం పరపతి విధాన సలహా ఎక్స్‌టర్నల్ కమిటీ సమావేశంలో మెజారిటీ సభ్యులు పాలసీ రేట్లలో కోత అవసరమని అభిప్రాయపడినప్పటికీ, దీనికి భిన్నంగా గవర్నర్ రాజన్ నిర్ణయం తీసుకున్నారు.
టెక్నికల్ అడ్వైజరీ కమిటీగా (టీఏసీ)గా పేర్కొనే విధాన సలహా ఎక్స్‌టర్నల్ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు పాలసీ వడ్డీ రేట్ల కోతకు మొగ్గుచూపగా, ముగ్గురు సభ్యులు వ్యతిరేకించినట్లు మినిట్స్ తెలిపింది. నలుగురిలో ముగ్గురు పావుశాతం కోతకు మొగ్గుచూపగా, ఒకరు అరశాతంగా సూచించారు. టీఏసీ సభ్యుల్లో వెహైచ్ మాలేగావ్, శంకర్ ఆచార్య, అరవిండ్ విర్మాణి, ఇందిరా రాజారామన్, ఇరోల్ డిసౌజా, అస్మి గోయల్, ఛేతన్ ఘాటే ఉన్నారు. సంబంధిత సమావేశానికి రాజన్ నేతృత్వం వహించారు.