పుట్టినరోజు రిటర్న్ గిఫ్ట్ లేదు... | RBI signal: Budget first, rate cuts later | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు రిటర్న్ గిఫ్ట్ లేదు...

Published Wed, Feb 4 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

పుట్టినరోజు రిటర్న్ గిఫ్ట్ లేదు...

పుట్టినరోజు రిటర్న్ గిఫ్ట్ లేదు...

ద్వైమాసిక సమీక్షలో పాలసీరేట్లను
యథాతథంగా కొనసాగించిన రాజన్
ఎస్‌ఎల్‌ఆర్ మాత్రం అరశాతం కోత
21.5 శాతంగా 7వ తేదీ నుంచీ అమలు
వ్యవస్థలోకి దాదాపు రూ.42,000 కోట్లు
 రుణాల పెంపునకు బ్యాంకులకు వెసులుబాటు

 
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నరు రఘురామ్ రాజన్ తన 52వ పుట్టిన రోజున అటు పాలకవర్గాలకు కానీ, ఇటు పారిశ్రామిక రంగానికి కానీ కోరుకున్న విధంగా భారీ రిటర్న్ గిఫ్ట్ అందించలేదు. మంగళవారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో పాలసీరేటు- రెపోను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే  రుణ మంజూరీలు పెరిగేందుకు వీలుగా స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను (ఎస్‌ఎల్‌ఆర్) 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతానికి తగ్గుతుంది. 7వ తేదీ నుంచీ ఇది అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థలోకి రూ.42,000 కోట్లు విడుదలవుతాయి. 2013 సెప్టెంబర్లో రాజన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక, ఆర్‌బీఐ 2.5 శాతం వరకూ ఎస్‌ఎల్‌ఆర్‌ను తగ్గించింది. రెపోరేటు యథాతథంగా 7.75 శాతంగా కొనసాగనుంది.

 ఎలా పనిచేస్తాయి?

అంతర్జాతీయంగా చమురు ధరలు, దేశీయంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆమోదనీయ స్థాయిలో ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యంగా (ఫిబ్రవరి 3 పాలసీ రేటుకు ముందుగానే) జనవరి 15న ఆర్‌బీఐ రెపోరేటును పావుశాతం తగ్గించి, బ్యాంకులకు రుణ రేటు తగ్గింపు సంకేతాలిచ్చింది. 2013 మే తరువాత రెపో తగ్గింపు ఇదేకావటం గమనార్హం. రెపో రేటు పావుశాతం తగ్గినందున, దీనికి అనుగుణంగా ఉండే రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద స్వల్పకాలికంగా ఉంచే నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీరేటు) 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గింది. కాగా బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్) 4 శాతంగానే కొనసాగించింది. జనవరి 15న ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోగా... 45 వాణిజ్య బ్యాంకుల్లో  మూడు మాత్రమే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాయి.  ఇక తాజాగా మంగళవారం ఆర్‌బీఐ తగ్గించిన ఎస్‌ఎల్‌ఆర్ విషయానికి వస్తే- బ్యాంకుల రుణ మంజూరీ వృద్ధికి దోహదపడడానికి తీసుకున్న చర్య ఇది.  ఇప్పటివరకూ ఈ నిష్పత్తి 22 శాతంగా ఉంది. దీనిని తాజాగా 21.5 శాతానికి తగ్గించారు. అంటే ఆ మేరకు రూ.42,000 కోట్ల  నిధులు ఇప్పుడు బ్యాంకులకు ‘రుణాలు ఇవ్వడానికి’ అందుబాటులోకి వస్తాయి. దీంతో బ్యాంకుల రుణ మంజూరీలు పెరిగే వీలుంది.
 
మరికొన్ని ముఖ్యాంశాలు...


2014-15 కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.3% ఉంటుంది.
2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 6 శాతం.
పాత బేస్ ప్రకారం (2004-05) ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 5.5%. 2015-16లో 6.5 %.
ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు అందాలి. పెట్టుబడుల పునరుత్తేజానికి, వృద్ధికి ఇది అవసరం.
లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఒక భారతీయుడు వ్యక్తిగతంగా విదేశాల్లో 2,50,000 డాలర్ల వరకూ పెట్టు బడులు పెట్టవచ్చు. ఇంతక్రితం పరిమితికన్నా ఇది రెట్టింపు. పటిష్ట దేశీయ విదేశీ మారకద్రవ్య నిల్వల స్థితికి నిదర్శనం.
చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు 72 అప్లికేషన్లు, పేమెంట్స్ బ్యాంకులకు 41 అప్లికేషన్లు అందాయి.
ఏప్రిల్ 1 తరువాత కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ విండోను పొడిగించాలన్న బ్యాంకర్ల విజ్ఞప్తికి నో...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఆయా ఫలితాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం.
 
 పోటీతో రేట్లు తగ్గుతాయి


బ్యాంకుల లాభాలు తక్కువగా ఉన్నాయి. అయితే రుణ వృద్ధి రేటు  బలహీనంగా ఉన్నందున, అవి తిరిగి పుంజుకోడానికి బ్యాంకులు ప్రయత్నించాలి. దీనికోసం పరస్పరం పోటీపడాలి. దీనర్థం అవి కనీస రుణ రేటును తప్పకుండా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆర్‌బీఐ సంకేతాలకు అనుగుణంగా తనకు అందివచ్చిన పాలసీరేటు ప్రయోజనాన్ని అంతిమంగా కస్టమర్‌కు బదలాయించాల్సిన పరిస్థితి బ్యాంకులకు ఏర్పడుతుంది. ఈ దిశలో బ్యాంకులు తగిన నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నా. పలు బ్యాంకులు ఇప్పటికే తమ డిపాజిట్ రేట్లను తగ్గించిన విషయం గమనిస్తున్నాం. అయితే అంతే స్పీడుగా రుణ రేట్లపై నిర్ణయం తీసుకోలేదు. రెపోరేటుకు సంబంధించి ప్రస్తుతానికి మా విధానం పూర్తిగా సరైనదే. పలు స్థూల ఆర్థిక రంగాలకు సంబంధించి ఇంకా తాజా గణాంకాలు రావాల్సి ఉన్నాయి. ద్రవ్య పటిష్టత, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల వంటి అంశాల ప్రాతిపదికన దీనిపై మా తదుపరి చర్య ఆధారపడి ఉంటుంది. పరపతి విధానం అనేది దీర్ఘకాలం ప్రభావం చూపే ఒక ప్రక్రియ. కేంద్ర బ్యాంక్ చర్య ఏదైనా అది వాస్తవ రూపంలో కనబడేసరికి మూడు త్రైమాసికాల సమయం పడుతుంది. రేట్ల కోత నిర్ణయం ఒక వార్త కావచ్చు కానీ, దాని ప్రభావం కనబడ్డానికి తొమ్మిది నెలలు పడుతుంది. అన్ని పరిస్థితులనూ పూర్తిగా అధ్యయనం చేయడం ద్వారా తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
 - రఘురామ్ జీ రాజన్, గవర్నర్, ఆర్‌బీఐ.
 
బడ్జెట్ తర్వాత: పరిశ్రమలు


బహుశా బడ్జెట్ అనంతరం రేట్ల కోత దిశలో అడుగు వేయవచ్చని  సీఐఐ అధ్యక్షుడు అజయ్ ఎస్ శ్రీరామ్ చెప్పారు. ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరీ మాట్లాడుతూ, 2015లో రుణ రేటును మరో 75 బేసిస్ పాయింట్లు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ మాత్రం ఆర్‌బీఐ కాకున్నా... ప్రభుత్వమైనా వడ్డీ ప్రయోజనాన్ని పారిశ్రామికవేత్తలకు బదలాయించే చర్యలు తీసుకోవాలన్నారు.
 
రియల్టర్ల నిరుత్సాహం: క్రెడాయ్

మరోవైపు ఆర్‌బీఐ పాలసీ పట్ల రియల్టర్లు నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ సీ శేఖర్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, గృహ అమ్మకాల భారీ వృద్ధికి రుణ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధి రేటు పురోగమించడానికి ఇది సరైన సమయమని, దీనికి వడ్డీరేట్ల తగ్గింపు అవసరమని తాము భావిస్తున్నామని చెప్పారు. ఎస్‌ఎల్‌ఆర్ కోతపై హర్షం వ్యక్తంచేశారు.
 
తక్షణ తగ్గింపు ఉండదు: బ్యాంకర్లు

 ఆర్‌బీఐ రుణ రేటు తగ్గింపు సాంకేతాలు ఇచ్చినప్పటికీ తక్షణం ఈ దిశలో చర్యలేవీ ఉండవని.. బడ్జెట్ వరకూ వేచిచూస్తామని బ్యాంకర్లు చెప్పారు. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా పాలసీ ఉందని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ చెప్పారు.  ఎస్‌ఎల్‌ఆర్ కోతతో తమకు రూ.7,000 కోట్లు అందుబాటులోకి వస్తాయని అరుంధతి తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement