మార్కెట్లు దెబ్బతిన్నా సరే... వడ్డీరేటు పెంచండి
అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ సూచన
‘ఈజీ మనీ’తో అంతర్జాతీయ
ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని హెచ్చరిక
బాసెల్(స్విట్జర్లాండ్): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తీవ్ర హెచ్చరిక చేశారు. ‘ఈజీ మనీ’ విధానం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీరో స్థాయిలో ఉన్న ఫెడ్ ఫండ్ రేటును పెంచాలని ఆయన అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు సూచించారు. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించి, హెచ్చరించిన వ్యక్తిగా ప్రపంచ ఆర్థిక రంగంలో రాజన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. జర్మనీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌తో కలిసి ఒక కార్యక్రమంలో విద్యార్ధులతో మాట్లాడిన రాజన్ ఈ వ్యాఖ్య చేశారు. తక్కువ రుణ వ్యయాలు, ద్రవ్య ముద్రణ వంటి అంశాలు ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా వాటిల్లుతాయని, అలాగే ఎక్కువ కాలం కొనసాగితే... ఈ విధానం సమర్థత కూడా కోల్పోతుందని హెచ్చరించారు. రాజన్ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు జర్మనీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ జీన్స్ వైడ్‌మెన్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్‌లో ఫెడ్ రిజర్వ్ రేటు పెంపు ఉంటుందని అభిప్రాయపడిన రాజన్, ఇది మార్కెట్ల ఒడిదుడుకులకు దారితీస్తుందని అన్నారు. అయినా రేటు పెంపు తప్పనిసరి అని వివరించారు.
బీఐఎస్ బోర్డ్ వైస్‌చైర్మన్‌గా నియామకం..
రాజన్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ బ్యాంక్ (బీఐఎస్) బోర్డ్ వైస్‌చైర్మన్‌గా నియమితులయ్యారు. బీఐఎస్ ప్రధాన కార్యాలయం బాసెల్ (స్విట్జర్లాండ్)లో ఉంది. పటిష్ట అంతర్జాతీయ ద్రవ్య విధానం, ఫైనాన్షియల్ స్థిరత్వం లక్ష్యంగా ప్రపంచస్థాయిలో సెంట్రల్ బ్యాంకుల సమన్వయ సాధనకు బీఐఎస్ కృషి చేస్తుంది. ఏడాదికి కనీసం ఆరుసార్లు బ్యాంక్ బోర్డ్ సమావేశమవుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్, బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్‌సహా పలువురు ఆర్థికవేత్తలు ఈ బోర్డ్‌లో సభ్యులుగా ఉంటారు. బాసెల్‌లో సోమవారం జరిగిన బీఐఎస్ డెరైక్టర్ల బోర్డు సమావేశం రాజన్‌ను వైస్‌చైర్మన్‌గా ఎంపికచేసింది. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచీ మూడేళ్లు రాజన్ ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 2013 డిసెంబర్ నుంచి రాజన్ బోర్డ్ డెరైక్టర్లలో ఒకరిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్మనీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ జీన్స్ వైడ్‌మెన్ బీఐఎస్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్నారు.