ఒత్తిళ్లకు తలొగ్గని రాజన్.. | Policy rates unchanged | Sakshi
Sakshi News home page

ఒత్తిళ్లకు తలొగ్గని రాజన్..

Published Wed, Aug 5 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

ఒత్తిళ్లకు తలొగ్గని రాజన్..

ఒత్తిళ్లకు తలొగ్గని రాజన్..

పాలసీ రేట్లు యథాతథం 
ఆహార ధరలపై ఆందోళన

ఈ ఏడాది 0.75 శాతం రెపో కోతలో సగమే కస్టమర్లకు అందిందని వ్యాఖ్య
తద్వారా బ్యాంకులు రుణరేటును మరింత తగ్గించాలని సూచన
వర్షపాతం బాగుండి, ధరలు తగ్గితే... రేటు కోత ఉంటుందని స్పష్టీకరణ
ముంబై:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్- అటు ప్రభుత్వ వర్గాల నుంచి.. ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు లొంగలేదు. మంగళవారం జరిపిన మూడవ ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా పాలసీ రేట్లలో ఎటువంటి మార్పులూ చేయకుండా, యథాతథంగా ఉంచారు. దీనితో రెపో రేటు 7.25 శాతంగా కొనసాగనుంది. రివర్స్ రెపో రేటు 6.25 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంగా యథాతథ స్థితిలో ఉండనున్నాయి.
 
ఎందుకింత ప్రాధాన్యం...
దేశంలో ద్రవ్య, పరపతి విధాన తీరుతెన్నులను ఆర్‌బీఐ సమీక్షే నిర్దేశిస్తుంది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే- రెపో. బ్యాంకులు స్వల్పకాలం తన వద్ద ఉంచే  నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటే- రివర్స్ రెపో. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల పరిమాణమే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్). వ్యవస్థలో ద్రవ్యోల్బణం, డిమాండ్, ద్రవ్య సరఫరా పరిస్థితులను తగిన విధంగా నియంత్రించడానికి రెపో, రివర్స్ రెపో, సీఆర్‌ఆర్ వంటి ప్రధాన మార్గాలను ఆర్‌బీఐ అనుసరిస్తుంది. ఉదాహరణకు రెపో రేటు తగ్గిస్తే.. బ్యాంకులు ఆ మేరకు తక్కువ వడ్డీరేటుకు ఆర్‌బీఐ నుంచి రుణం పొందగలుగుతాయి.

ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తే... వ్యవస్థలో రుణ వృద్ధికి... అటుపై వినియోగ డిమాండ్‌కు దారితీస్తుందని, తద్వారా పారిశ్రామిక వృద్ధి... దేశాభివృద్ధికి ఇది కారణమవుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. అయితే ధరలు తీవ్రంగా ఉంటే- రేటు కట్టడి ద్వారా వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) డిమాండ్ పరిస్థితులను నియంత్రించి ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుత ధరల తీవ్రత తాజా నిర్ణయానికి ఒక కారణమని ఆర్‌బీఐ పేర్కొనడం ఇక్కడ గమనార్హం.
 
పాలసీ ముఖ్యాంశాలు...

- ఆర్థిక రికవరీ ఇంకా పురోగతిలో ఉంది
- జూన్‌లో వర్షపాతం బాగుంది. అయితే జూలైలో ఆశాజనకంగా లేదు. మొత్తంగా రుతుపవనాల పరిస్థితి సాధారణానికి సమీపంలోనే ఉంది
- వినియోగ డిమాండ్ ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి
- బలహీన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఎగుమతులకు విఘాతంగా మారుతున్నాయి.
- ప్రైవేటు రంగం నుంచి కొత్త పెట్టుబడులకు క్రమంగా డిమాండ్  పెరుగుతున్న సంకేతాలు కనబడుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి పరిస్థితి స్థిరంగా ఉంది.
- 2015-16లో వృద్ధి లక్ష్యం 7.6 శాతంగానే కొనసాగింపు
- నాల్గవ త్రైమాసిక పరపతి సమీక్ష సెప్టెంబర్ 29న
- ఆగస్టు చివరినాటికి కొన్ని చిన్న ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకుల లెసైన్సుల జారీ చేసే అవకాశం ఉంది.
- ప్రభుత్వం బ్యాంకులకు మరింతగా మూలధనం కేటాయించేలా కేంద్రం  ప్రకటించిన ప్రణాళిక హర్షణీయం.
 
పాలసీ రేటుపై మెజారిటీ నిర్ణయం మంచిదే...
వడ్డీరేటు విషయంలో ఆర్‌బీఐ గవర్నర్ వీటో పవర్‌ను కట్‌చేసే అంశం పరిశీలనలో ఉన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు రాజన్ ఇందుకు సంబంధించి నెలకొన్న వివాదాన్ని చల్లార్చే కామెంట్ చేశారు. ఇలాంటి కమిటీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. బెంచ్‌మార్క్ రేట్లను ఒక వ్యక్తి నిర్ణయించడానికి బదులు, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించడం మంచిదేనని అన్నారు.

ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారు క్రమంలో ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య విభేదాలు ఏమీ ఉండబోవని అన్నారు. రేట్లపై గవర్నర్‌కు వీటో పవర్ అక్కర్లేదని ఈ సందర్భంగా పేర్కొన్న ఆయన, అత్యున్నత సంస్థ ఆర్‌బీఐకి నిర్ణయాలు తీసుకోవడంలో మరింత ప్రతిపత్తి అవసరం అని అన్నారు. పరపతి విధాన రూపకల్పన ప్రక్రియ వ్యవస్థీకరణ ముఖ్యమని ఆయన పేన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఆర్‌బీఐకి ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చిందన్నారు. ఆయా అంశాలన్నింటిలో ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవని వివరణ ఇచ్చారు.
 
బ్యాంకులు తగ్గించింది కొంతే...
ద్రవ్యోల్బణం పటిష్టస్థాయిలో కొనసాగుతుండడం ఆందోళనకరం. తగిన వర్షపాతం నమోదై.. ధరలు తగ్గిన పరిస్థితుల్లో కీలక రేటు కోత ఉంటుంది. దీనితోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లకు సంబంధించి ఇచ్చే సంకేతాలూ రేటు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.  ఈ ఏడాది రెపో రేటును మూడు దఫాలు 75 బేసిస్ పాయింట్లు (100 పాయింట్లు ఒక శాతం) తగ్గించడం జరిగింది.

ఈ ప్రయోజనంలో దాదాపు  30 బేసిస్ పాయింట్లే..  బ్యాంకింగ్ కస్టమర్లకు అందించింది. ఈ ప్రయోజనాన్ని మరింత బదలాయించాల్సి ఉంటుంది. ఆయా అంశాలన్నింటిపైనా తదుపరి పాలసీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. పాలసీ సమీక్ష తేదీకి, రేట్లపై నిర్ణయానికి సంబంధం ఉండదు. తగిన అనువైన పరిస్థితుల్లో ఎప్పుడైనా ఆర్‌బీఐ పాలసీ రేట్లను సవరిస్తుంది.  మూడవ త్రైమాసికం నుంచీ రుణ డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంది. రుణ రేటు తగ్గించిన ప్రయోజనాన్ని బ్యాంకులు దీనిద్వారా పొందుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement