టీఎన్‌సీసీలో మళ్లీ వర్గపోరు
Published Thu, Dec 26 2013 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
టీఎన్‌సీసీలో మళ్లీ వర్గపోరు రాజుకుం టోంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఫిర్యాదులు ఢిల్లీ చేరుతున్నాయి. తంగబాలు వర్గం తీరుపై అధిష్టానం చెంతకు ఫిర్యాదు చేరడంతో కొరడా ఝుళిపించేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ సిద్ధం అవుతున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఇందులో ప్రధాన గ్రూపులుగా కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వర్గాలు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు తంగబాలు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కృష్ణ స్వామి గ్రూపులు ఆ తర్వాత కోవకు చెందుతాయి.
కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి నాయకులు పలువురు తమదైన శైలిలో గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ రాజకీయాల కారణంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జిల్లా కార్యవర్గాల ఎంపికకు పన్నెండేళ్లు పట్టింది. గ్రూపు నేతలందరూ తాము సమైక్యంగా ఉన్నామని అధిష్టానానికి చాటుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ నెల రెండో వారంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల పదవుల్ని భర్తీ చేస్తూ, ఏఐసీసీ చిట్టా విడుదల చేసింది. దీంతో మళ్లీ గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక శాతం మద్దతుదారుల్ని కల్గిన వాసన్ వర్గం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కీలక పదవుల్ని ఎక్కువ శాతం తన్నుకెళ్లింది. ఆ తర్వాతి స్థానంలో చిదంబరం వర్గం నిలిచింది. తమకు అన్యాయం జరిగిదంటూ చిదంబరం వర్గం లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, తంగబాలు వర్గం మాత్రం ఎదురు దాడికి సిద్ధం అయింది.
ఎదురు దాడి: రెండు రోజుల క్రితం సత్యమూర్తి భవన్‌లో కొత్త కార్యవర్గం పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జికే వాసన్ వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనగా, తక్కిన గ్రూపుల వారు అంతంత మాత్రంగానే వచ్చారు. ఇందులో తంగబాలు వర్గానికి చెందిన తొమ్మిది జిల్లాల అధ్యక్షులతో పాటుగా పదమూడు మంది టీఎన్‌సీసీపై తిరుగు బాటు చేశారు. తమను అవమాన పరుస్తున్నారంటూ ఆ పరిచయ కార్యక్రమాన్ని వాకౌట్ చేయడం వివాదానికి దారి తీసింది. బహిరంగంగా పార్టీపై, పార్టీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్‌పై తంగబాలు వర్గం మాటల దాడికి దిగడాన్ని వాసన్ వర్గం తీవ్రంగా పరిగణించింది. ఇతర గ్రూపులు తమతో ఢీకి సిద్ధం కావొచ్చన్న సంకేతాలతో వాసన్ వర్గానికి చెందిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మేల్కొన్నారు. ఇక మీదట ఏ ఒక్కరూ వేలు ఎత్తి చూపని విధంగా, ఆదిలోనే చెక్ పెట్టడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
ఢిల్లీకి పంచారుుతీ: తంగబాలు వర్గం వ్యవహరిస్తున్న తీరుపై పంచారుుతీ ఢిల్లీకి చేరింది. రాష్ట్ర పార్టీని ధిక్కరించే విధంగా ఆ వర్గానికి చెందిన జిల్లా కార్యదర్శులు, ఇతర పదవుల్లో ఉన్న వాళ్లు దూసుకెళుతుండటంతో వారిపై కొరడా ఝుళిపించాలని అధిష్టానానికి జ్ఞాన దేశికన్ విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ధోరణితో వ్యవహరించిన ఆ నాయకుల పదవుల్ని ఊడ గొట్టేందుకు సిద్ధం అవుతుండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చకు దారి తీస్తున్నది. అధ్యక్షుడిని ధిక్కరించడం ఎంత వరకు సబబు? అన్న నినాదంతో వారి స్థానంలో కొత్త వాళ్లను చేర్చడం లక్ష్యంగా ఢిల్లీలో వాసన్ వర్గం పావులు కదుపుతోంది. ఇక, తాము తక్కువ తిన్నామా..? అన్నట్టు తంగబాలు వర్గం సైతం ఢిల్లీకి ఫిర్యాదులు చేసే పనిలో పడింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల పంచారుుతీ ఢిల్లీకి చేరడంతో అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఓ గ్రూపు వివాదానికి ఆజ్యం పోయడంతో మున్ముందు మరెన్ని గ్రూపులు రాజుకుంటాయోనన్న బెంగ ఏఐసీసీ వర్గాల్ని వేధిస్తోంది.
Advertisement