కేంద్ర మాజీమంత్రి నివాసంలో సీబీఐ సోదాలు
సాక్షి, చెన్నై : కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ నివాసంలో సీబీఐ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. యూపీఏ హయాంలో జార్ఖండ్‌లో పర్యావరణ అనుమతుల కేసులో అధికారుల సోదాలు చేపట్టారు. మైనింగ్ చట్టాల ఉల్లంఘన, అధికార దుర్వినియోగంతో పాటు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగంతో ఆమెపై120బీ పీసీ చట్టం కింద సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రెండు గంటలుగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
అలాగే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్‌తో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి చెన్నైతో పాటు ఢిల్లీ, కోల్‌కతా, రాంచీ, ఒడిశాలోనూ సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. జయంతీ నటరాజన్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు కంపెనీలకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, మైనింగ్ హక్కులకు సంబంధించిన అవకతవకలపై సీబీఐ ఇప్పటికే ఐదు ప్రాథమిక విచారణలను నమోదు చేసింది.
కాగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన జయంతి నటరాజన్ 2015 జనవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో ఇచ్చిన/నిరాకరించిన పర్యావరణ అనుమతులపై సమీక్ష చేపడతామని కేంద్రం గతంతోనే ప్రకటించిన విషయం విదితమే.