TNCC
-
కుష్బుకు కాంగ్రెస్ పగ్గాలు ?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్ష స్థానానికి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, నటి కుష్బు పేరు పరిశీలనలో ఉంది. అదే జరిగితే టీఎన్‌సీసీకి తొలిసారిగా ఒక మహిళ అధ్యక్షురాలు అయిన ఘనత ఆమెకు సొంతం అవుతుంది. తమిళనాడు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు ఇటీవల ముగిశాయి. సుమారు 19 ఏళ్ల విరామం తరువాత సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి కొత్త అధ్యక్షుని ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఇటీవలే తీర్మానం చేశారు. తిరునావుక్కరసర్‌పై ఫిర్యాదులు ప్రస్తుతం తమిళకాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌పై అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో కాంగ్రెస్ ట్రస్టు నిర్వాహకుల మూలంగా పార్టీ కోశాధికారి వోరా విచారణ చేపట్టి టీఎన్‌సీసీకి కొన్ని సూచనలు చేశారు. ట్రస్టు పర్యవేక్షణకు కేరళకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. చెక్ పవర్‌ను సైతం అతని స్వాధీనంలోకే వెళ్లింది. ఈ నేపథ్యంలో తమిళ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకంపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టిపెట్టగా, తన పదవిని కాపాడుకునేందుకు తిరునావుక్కరసర్ ఢిల్లీలో పావులు కదపడం ప్రారంభించారు. రాహుల్‌గాంధీని సైతం ఆయన కలుసుకోగా అది ఎంతవరకు ఫలించిందో తెలియరాలేదు. తిరునావుక్కరసర్‌కు ముందు అధ్యక్షునిగా ఉండిన ఈవీకేఎస్ ఇళంగోవన్, మరికొందరు ముఖ్యులతో రాహుల్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కొత్త అధ్యక్షుని పరిశీలన జాబితాలో కుష్బుతోపాటూ ఇళంగోవన్, కేఎస్ అళగిరి, చెల్లకుమార్, వసంతకుమార్, పీటర్ ఆల్బోన్స్, మాణిక్య ఠాకూర్ తదితర పేర్లున్నాయి. ఏ బాధ్యతలు అప్పగించినా సిద్ధం ఈ సందర్భంగా కుష్బును పలుకరిస్తే అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధమని బదులిచ్చారు. ఇళంగోవన్‌కు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం మద్దతు పలుకుతున్నారు. ఇళంగోవన్‌ను కాదనుకున్న పక్షంలో తన మద్దతుదారైన కేఎస్ అళగిరికి ఇవ్వాల్సిందిగా ఇళంగోవన్ కోరారు. మాణిక్యఠాకూర్ పార్టీ పరంగా రాహుల్‌తో ప్రత్యక్ష సంబంధాలు, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగి ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో మహిళా అధ్యక్షురాలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి సైతం కుష్బు ఉంటే సమజోడిగా ఉంటుందనే వాదనను ఆమె అభిమానులు అధిష్టానం ముందుంచినట్లు సమాచారం. ఈనెల 21వ తేదీ నుంచి ఢిల్లీలో కార్యవర్గ సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడు కాంగ్రెస్ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళుతాయో తేలిపోగలదని పార్టీ శ్రేణుల అంచనా. -
జయలలిత ఇల్లు ఇప్పుడు ఎలా మారబోతోంది?
తమిళనాట రాజకీయాల్లో ధీరవనితగా నిలిచి అసువులు బాసిన జయలలితకు అమ్మంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమతో తల్లి వేదవల్లి పేరుని తన ఇంటికి పెట్టుకున్నారు. చెన్నై నడిమధ్యన పోయస్ గార్డెన్లో ఉండే తన నివాసాన్ని వేదనిలయంగా మార్చారు. అయితే జయలలిత మరణ అనంతరం ఈ ఇల్లు ఎవరికి చెందుతుందా? అని పలువాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఇంటికి తామెంటే తాము వారసులమని కొంతమంది లైన్లోకి వస్తున్నారు. దీంతో పోయస్ గార్డెన్‌లోని వేదనిలయాన్ని జయలలిత స్మారకమందిరంగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ నిలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని జయలలిత స్మారకమందిరంగా మార్చేందుకే టీఎన్‌సీసీ(తమిళనాడు కాంగ్రెస్ కమిటీ) కూడా మొగ్గుచూపింది. జయలలిత వాడిన వస్తువులను ప్రజలు తిలకించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్. తిరునవుక్కరసర్ కోరారు. జయలలిత అనారోగ్య వార్త, మరణ వార్త విని 77 మంది మృతిచెందారని ఆయన చెప్పారు. వారందరికీ ఆయన సంతాపం తెలిపారు. పుదేచ్చెరిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జయలలిత జీవిత కాల సైజులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామికి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి కేబినెట్ భేటీ కానున్నట్టు నారాయణస్వామి చెప్పినట్టు అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం జయలలిత నివాసంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బంధువులు నివసిస్తున్నారు. -
టార్గెట్ ‘కార్యాలయాలు’
సాక్షి, చెన్నై : రాష్ర్టంలోని కాంగ్రెస్ కార్యాలయాలు తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు వాసన్ వర్గం సన్నద్ధం అవుతోంది. గురువారం కడలూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీయడంతో జిల్లా కలెక్టర్ రం గంలోకి దిగారు. టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి పదవికి కిళ్లియూర్ ఎమ్మెల్యే జాన్ జాకబ్ రాజీనామా చేశారు. తన పార్టీ, గుర్తు, కార్యాచరణ తెలియాలంటే వారం రోజులు వేచి ఉండాల్సిందేనని వాసన్ స్పష్టం చేశారు.రాష్ట్ర కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన మద్దతు బలాన్ని పెంచుకునే పనిలో పడ్డా రు. గతంలో కాంగ్రెస్ నుంచి మూపనార్ బయటకు వచ్చిన సమయంలో ముఖ్య నేతలందరూ ఆయన వెంట నడిచారు. అయితే, ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్య నేతలందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నా, కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వాసన్ వెంట నడిచేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే వాసన్‌కు 30 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది మాజీ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎంపీలు మద్దతు ప్రకటించారు. అలాగే, కాంగ్రెస్‌లో కొన్ని గ్రూపులకు చెందిన నాయకుల అనుచర గణాన్ని సైతం తమ వైపు తిప్పుకునేందుకు వాసన్ తీవ్ర ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. గ్రూపు నేతలతో విభేదాలున్న వారందర్నీ తమ వెంట తిప్పుకుని తిరుచ్చి వేదికగా బలాన్ని చాటేందుకు కుస్తీలుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని జిల్లాల్లో వాసన్ మద్దతుదారులు జిల్లా పార్టీ కార్యాలయాలను టార్గెట్ చేయ టం చర్చకు దారి తీసింది. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఆస్తులు, అనేక భవనాలు ట్రస్టు రూపంలో ఒకే చోటకు చేర్చారు. ఇందుకు ట్రస్టీగా గతంలో మూపనార్, తాజాగా వాసన్ వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భవనాలు మూపనార్ హయూంలో నిర్మించారు. కాంగ్రెస్ నిధితో కాకుండా విరాళాలు సేకరించి నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయాలు అనేకం ఉన్నట్టు సమాచారం. వాసన్ బలం అధికంగా ఉన్న జిల్లాల్లోను పార్టీ భవనా లు నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనాల్ని వాసన్ వర్గం టార్గెట్ చేసింది. వాటిని కాంగ్రెస్ గుప్పెట్లో నుంచి తమ ఆధీనంలోకి తెచ్చుకునే పనిలో పడ్డారు. అనేక మండల కార్యాలయాలు, నగర కార్యాలయాల భవనాలను తమ గుప్పెట్లోకి తెచ్చుని తమాకా జెండాల్ని ఎగుర వేయడం, ఆ కార్యాలయాలకు పేర్లను మార్చ డం వంటి చర్యల్లో మునిగారు. ఈ నేపథ్యంలో గురువారం కడలూరు జిల్లా పార్టీ కార్యాలయం కైవశం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నా, వారిని తరిమి కొట్టి, తమ గుప్పెట్లోకి తెచ్చుకునే యత్నం చేశారు. ఆ భవనం రూపు రేఖల్ని తమాకా కార్యాలయంగా మార్చేశారు. అయితే, ఈ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీయడంతో ఆ జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. తాత్కాలికంగా ఆ భవనానికి సీల్ వేయడం గమనార్హం. జాకబ్ రాజీనామా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి కిళ్లియూరు ఎమ్మె ల్యే జాన్ జాకబ్ రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపించా రు. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో వాసన్ బలం అధికంగా ఉండడంతో, ఆ బలాన్ని మరింత రెట్టింపు చేయడం లక్ష్యంగా ఆ ప్రాంతానికి చెందిన నేతల్ని ఏకం చేసే పనిలో జాన్‌జాకబ్ నిమగ్నం అయ్యారు. దక్షిణ తమిళనాడులోని అనేక అసెం బ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్‌కు పట్టుకొమ్మలుగా గతంలో ఉండడంతో, అక్కడ పాగా వేయడమే లక్ష్యంగా కొన్ని బృందాలు కార్యాచరణ చేపట్టారుు. వెయిట్ అండ్ సీ ఆళ్వార్‌పేటలోని నివాసంలో వాసన్‌ను మీడియా కదలించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తమ వాళ్లు కైవశం చేసుకోవడం లేదని, వారికి చెందిన భవనాలపై ఉన్న హక్కుపై నిలదీస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీ పేరు, జెండా, విధి విధానాలు, అన్నింటిపై కసరత్తులు జరుగుతున్నాయని, వారం రోజుల్లో తిరుచ్చి వేదికగా అన్నీ ప్రకటిస్తామన్నారు. బిజీబిజీగా వున్న వాసన్ అప్పుడప్పుడు ఫోన్లలో మంతనాలలో మునిగి ఉండడం గమనించాల్సిందే. -
అంతా ఒకే గ్రూపు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్ చేపట్టారు. టీఎన్‌సీసీలో గ్రూపులు లేవని, అంతా ఒకే గ్రూపు అని ప్రకటించారు. ఖద్దరు చొక్కా తొడిగిన వాడు రాష్ట్రాన్ని ఏలే పాలకుడు కావాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. పూర్వ వైభవం లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. సాక్షి, చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి నుంచి జ్ఞానదేశికన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను ఏఐసీసీ రంగంలోకి దించింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, జీకే వాసన్ వర్గాల ఆధిపత్య సమరానికి చెక్ పెట్టడం లక్ష్యంగానే ఏఐసీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు టీఎన్‌సీసీలో చర్చ మొదలైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను రంగంలోకి దించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చతికిలబడ్డ పార్టీని మళ్లీ పైకి తీసుకువచ్చే బాధ్యతల్ని తన భుజాన వేయడంతో అందుకు తగ్గ కార్యాచరణకు ఈవీకేఎస్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం రాష్ట్ర పార్టీ పగ్గాల్ని తన గుప్పెట్లోకి తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణ: ఆదివారం ఉదయం పదిన్నర గం ట లకు ఈవీకేఎస్ ఇళంగోవన్ సత్యమూర్తి భవన్లో అడుగు పెట్టారు. ఆయనకు మాజీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ ఆహ్వానం పలికారు. ఈ ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనందరం తన చాంబర్‌కు ఈవీకేఎస్ను తీసుకెళ్లిన జ్ఞాన దేశికన్ తన బాధ్యతల్ని అప్పగించారు. తాను తప్పుకుంటున్నట్టు సంతకం చేశారు. దీంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు స్వీకరిస్తూ ఈవీకేఎస్ సంతకం చేసి, అందరి ఆభినందనల్ని అందుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, నేతలు తిరునావుక్కరసర్, రాయపురం మనో, సెల్వకుమార్, జయకుమార్, ఎమ్మెల్యే విజయ ధరణి, గోపినాథ్, మాజీ ఎంపీ కృష్ణ స్వామి, స్థానిక నాయకుడు, రాయపురం మనో, మాజీ ఎమ్మెల్యే వసంతకుమార్ తదితరులు తరలి వచ్చి కొత్త అధ్యక్షుడిని శుభాకాంక్షలతో ముంచెత్తారు. మూడు గంటల సమయంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం , ఆయన తనయుడు కార్తీ చిదంబరం తదితరులు సత్యమూర్తి భవన్ చేరుకున్నారు. అక్కడ ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను అభినందనలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రూపు రాజకీయూల్లేవు: బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో ఈవీకేఎస్ మాట్లాడారు. తనకు గ్రూపు రాజకీయాలు పడవు అని, అసలు గ్రూపు రాజకీయాల్నే తాను నమ్మనని స్పష్టంచేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇక గ్రూపులు లేవని, అంతా ఒకే గ్రూపుగా ప్రకటించారు. అమావాస్య ముగిసి పౌర్ణమిలోకి అడుగు పెట్టినట్టుగా ఈ రోజును తాను భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. ఖద్దరు చొక్కా తొడిగినోడు రాష్ట్రాన్ని ఏలాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఆ రోజుల కోసం ఎదురు చూస్తున్నట్టు పరోక్షంగా, డీఎంకే , అన్నాడీఎంకేలపై విమర్శలు గుప్పించారు. తనకు బాధ్యతల్ని అప్పగించిన సోనియా, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కామరాజర్ లేకుంటే కాంగ్రెస్ లేదు అని, అలాగే, కాంగ్రెస్ లేకుంటే కామరాజర్ లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. కామరాజర్, మూపనార్ ఫొటోల్ని సభ్యత్వ పుస్తకం నుంచి తొలగించాలని అధిష్టానం ఆదేశించలేదని, ఇవన్నీ విషమ ప్రచారంగా ఆరోపించారు. చెప్పాలంటే, ఆ వ్యవహారం చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. వాసన్ పార్టీ పెట్టరు: జీకే వాసన్ సొంతంగా పార్టీ పెట్టరన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగాలని తానే కాదు, ఢిల్లీ పెద్దలు సైతం ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఆయన ఇక్కడే ఉండాలని, ఆయన సేవలు కాంగ్రెస్‌కు అవసరమని పేర్కొన్నారు. తామాకా రూపంలో కాంగ్రెస్‌ను చీల్చడం కన్నా, ఒకే చోట ఉండి మరింత బలోపేతం లక్ష్యంగా అందరూ కలసి కట్టుగా శ్రమిస్తే బాగుంటుందని సూచించారు. ఇక, ఈ సమావేశంలో ప్రసంగించిన కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, ఎమ్మెల్యే విజయ ధరణిలు సైతం వాసన్ కొత్త పార్టీ పెట్టరన్న నమ్మకం ఉందని, ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
హస్తంలో సారథి పోరు
జవసత్వాలు కోల్పోయిన త మిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) సారథిగా కొత్త వ్యక్తిని నియమించడం ద్వారా బలోపేతం చేయాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అధ్యక్షుడిని మార్చదలుచుకుంటే జీకే వాసన్‌కే పట్టం కట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యూయి. చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రాంతీయ పార్టీల పొత్తులతోనే ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న టీఎన్‌సీసీ ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ చిన్న ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో ఏకాకిగానే పోటీచేసి అనేక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. పార్టీ పరాజయం పాలుకాగానే ప్రస్తుత టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్‌ను బాధ్యతల నుంచి తొలగించాలనే నినాదాలు మొదలయ్యూయి. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం వర్గీయులే ఈ నినాదాలకు నేతృత్వం వహించారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో బలమైన క్యాడర్ కలిగి ఉన్న జీకే వాసన్ మద్దతు ఉండడంతో అధిష్టానం తాత్కాలికంగా మిన్నకుండిపోయింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆ తరువాత చూద్దాంలెమ్మని సర్దిచెప్పింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ముగిసిపోయి ఆ రెండు రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో పార్టీ అధ్యక్షుల మార్పు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలో నానాటికీ తరిగిపోతున్న కాంగ్రెస్ ప్రాభవాన్ని కాపాడుకునేందుకు అధ్యక్షుల మార్పు అనివార్యమనే ఆలోచనలో అధిష్టానం పడిపోయింది. జీకే వాసన్ పోస్టర్లు మరో రెండేళ్లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని ఫలితాలే తమిళనాడులో పునరావృతం కాకుండా కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో టీఎన్‌సీసీ అధ్యక్షుని మార్పు అంశం అత్యంత ప్రాధాన్యమైంది. జీకే ముప్పనార్ కాంగ్రెస్‌ను వీడి తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ స్థాపించినపుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన వెంటనడిచారు. ముప్పనార్ మరణం తరువాత ఆయన కుమారుడు జీకే వాసన్ ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ కారణంగా రాష్ట్రంలో జీకే వాసన్‌కు బలమైన అనుచర వర్గం ఉంది. టీఎన్‌సీసీ అధ్యక్షుని మార్పు అనివార్యమని అధిష్టానం భావించినట్లయితే జీకే వాసన్‌కే అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పోస్టర్లు అంటించారు. ‘అయ్యానే కాంగ్రెస్..కాంగ్రెస్సే అయ్యా జీకే వాసన్’ అనే నినాదంతో పోస్టర్లు వెలిశాయి. పనిలోపనిగా ఆ పోస్టర్లలో దీపావళి శుభాకాంక్షలు సైతం పొందుపరిచారు. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కూడా తనకు లేదా తన అనుచరునికి టీఎన్‌సీసీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. జీకే వాసన్ నాయకత్వాన్ని తీవ్రంగా విబేధించే పీ చిదంబరం గట్టి పోటీనే ఇచ్చే అవకాశం ఉంది. అయితే జీకే వాసన్‌ను విస్మరిస్తే తమిళ మానిల కాంగ్రెస్ ఎక్కడ మళ్లీ పుట్టుకొస్తుందోననే భయం అధిష్టానంలో ఉంది. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా జ్ఞానదేశికన్‌ను కొనసాగించినా లేదా ఆయనను బలపరిచే జీకే వాసన్‌ను నియమించినా కొత్త సీసాలో పాత సారా మాదిరిగా తయరై అసలు ఉద్దేశం నీరుగారిపోతుందని కాంగ్రెస్ యోచిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తుండగా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోంటారోననే ఆసక్తి నెలకొంది. -
ఫిబ్రవరిలో రాష్ట్రానికి రాహుల్ రాక
టీనగర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో రాష్ట్రానికి రానున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తెలిపారు. ఆయన సత్యమూర్తి భవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో కళాశాల విద్యార్థుల వద్ద అవినీతికి వ్యతిరేకంగా మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. 30న విద్యార్థి కాంగ్రెస్ తరపున జిల్లా ప్రధాన నగరాల్లో అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 31న అవినీతికి వ్యతిరేకంగా విజ్ఞప్తులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 4న జిల్లా స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా ధర్నా, 5న పార్లమెంటులో లోక్‌పాల్ ముసాయిదా ప్రవేశపెట్టేందుకు మద్దతు కోరుతూ చెన్నైలో ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. 12న రాష్ర్టవ్యాప్తంగా మద్య నిషేధం కోరుతూ ఆందోళన జరపనున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి చివరిలో రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు. -
టీఎన్‌సీసీలో మళ్లీ వర్గపోరు
టీఎన్‌సీసీలో మళ్లీ వర్గపోరు రాజుకుం టోంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఫిర్యాదులు ఢిల్లీ చేరుతున్నాయి. తంగబాలు వర్గం తీరుపై అధిష్టానం చెంతకు ఫిర్యాదు చేరడంతో కొరడా ఝుళిపించేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ సిద్ధం అవుతున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఇందులో ప్రధాన గ్రూపులుగా కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వర్గాలు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు తంగబాలు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కృష్ణ స్వామి గ్రూపులు ఆ తర్వాత కోవకు చెందుతాయి. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి నాయకులు పలువురు తమదైన శైలిలో గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ రాజకీయాల కారణంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జిల్లా కార్యవర్గాల ఎంపికకు పన్నెండేళ్లు పట్టింది. గ్రూపు నేతలందరూ తాము సమైక్యంగా ఉన్నామని అధిష్టానానికి చాటుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ నెల రెండో వారంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల పదవుల్ని భర్తీ చేస్తూ, ఏఐసీసీ చిట్టా విడుదల చేసింది. దీంతో మళ్లీ గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక శాతం మద్దతుదారుల్ని కల్గిన వాసన్ వర్గం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కీలక పదవుల్ని ఎక్కువ శాతం తన్నుకెళ్లింది. ఆ తర్వాతి స్థానంలో చిదంబరం వర్గం నిలిచింది. తమకు అన్యాయం జరిగిదంటూ చిదంబరం వర్గం లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, తంగబాలు వర్గం మాత్రం ఎదురు దాడికి సిద్ధం అయింది. ఎదురు దాడి: రెండు రోజుల క్రితం సత్యమూర్తి భవన్లో కొత్త కార్యవర్గం పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జికే వాసన్ వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనగా, తక్కిన గ్రూపుల వారు అంతంత మాత్రంగానే వచ్చారు. ఇందులో తంగబాలు వర్గానికి చెందిన తొమ్మిది జిల్లాల అధ్యక్షులతో పాటుగా పదమూడు మంది టీఎన్సీసీపై తిరుగు బాటు చేశారు. తమను అవమాన పరుస్తున్నారంటూ ఆ పరిచయ కార్యక్రమాన్ని వాకౌట్ చేయడం వివాదానికి దారి తీసింది. బహిరంగంగా పార్టీపై, పార్టీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్పై తంగబాలు వర్గం మాటల దాడికి దిగడాన్ని వాసన్ వర్గం తీవ్రంగా పరిగణించింది. ఇతర గ్రూపులు తమతో ఢీకి సిద్ధం కావొచ్చన్న సంకేతాలతో వాసన్ వర్గానికి చెందిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మేల్కొన్నారు. ఇక మీదట ఏ ఒక్కరూ వేలు ఎత్తి చూపని విధంగా, ఆదిలోనే చెక్ పెట్టడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీకి పంచారుుతీ: తంగబాలు వర్గం వ్యవహరిస్తున్న తీరుపై పంచారుుతీ ఢిల్లీకి చేరింది. రాష్ట్ర పార్టీని ధిక్కరించే విధంగా ఆ వర్గానికి చెందిన జిల్లా కార్యదర్శులు, ఇతర పదవుల్లో ఉన్న వాళ్లు దూసుకెళుతుండటంతో వారిపై కొరడా ఝుళిపించాలని అధిష్టానానికి జ్ఞాన దేశికన్ విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ధోరణితో వ్యవహరించిన ఆ నాయకుల పదవుల్ని ఊడ గొట్టేందుకు సిద్ధం అవుతుండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చకు దారి తీస్తున్నది. అధ్యక్షుడిని ధిక్కరించడం ఎంత వరకు సబబు? అన్న నినాదంతో వారి స్థానంలో కొత్త వాళ్లను చేర్చడం లక్ష్యంగా ఢిల్లీలో వాసన్ వర్గం పావులు కదుపుతోంది. ఇక, తాము తక్కువ తిన్నామా..? అన్నట్టు తంగబాలు వర్గం సైతం ఢిల్లీకి ఫిర్యాదులు చేసే పనిలో పడింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల పంచారుుతీ ఢిల్లీకి చేరడంతో అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఓ గ్రూపు వివాదానికి ఆజ్యం పోయడంతో మున్ముందు మరెన్ని గ్రూపులు రాజుకుంటాయోనన్న బెంగ ఏఐసీసీ వర్గాల్ని వేధిస్తోంది. -
కరుణపై కాంగ్రెస్ ఆక్రోశం
సాక్షి, చెన్నై:నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్లు.. ఒక్క రోజు వ్యవధిలో బద్ద శత్రువులుగా మారారు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్, డీఎంకేల మధ్య బయలుదేరిన వైర్యం. తమను దూషిస్తూ కరుణానిధి చేసిన వ్యాఖ్యల్ని టీఎన్‌సీసీ తీవ్రంగా పరిగణించింది. డీఎంకే తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తమ నెత్తిన ఉన్న ఓ పెద్ద భారం ఊడిపడిందన్న ఆనందాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యక్తం చేశారు. యూపీఏ కూటమి నుంచి డీఎంకే వైదొలగినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకునే తిరిగారు. ఈలం తమిళులు, జాలర్లపై దాడుల వ్యవహారంలో యూపీఏకు వ్యతిరేకంగా కరుణానిధి తన స్వరాన్ని పెంచినా, ఘాటుగా, తీవ్ర పదజాలాలతో స్పందించినా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం నోరు మెదపలేదు. ఇందుకు కారణం డీఎంకేతో తమ బంధం గట్టిదన్న నమ్మకం. అయితే, ఆ నమ్మకం ఆదివారంతో సన్నగిల్లింది. కాంగ్రెస్‌తో ఇక పొత్తు లేదని కరుణానిధి స్పష్టం చేయడంతో పాటుగా 2జీ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు టీఎన్‌సీసీలో దుమారం రేపాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్లు ఒక్క రాత్రిలో బద్ద శత్రువులుగా మారారు. తమనే విమర్శిస్తారా..? అంటూఎదురు దాడికి దిగారు. కరుణానిధి వ్యాఖ్యల్ని దుయ్య బట్టారు. తమ మీద నిందల్ని మోపొద్దంటూ హితవు పలికారు. ఏమి ద్రోహం చేశాం: తామేదో ద్రోహం చేశామన్నట్టుగా కరుణానిధి వ్యాఖ్యానించడంపై కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2జీ వ్యవహారం కోర్టులో ఉందని, దాన్ని ఎత్తి చూపుతూ తమ మీద నిందల్ని మోపడం మానుకోవాలని హితవు పలికారు. ఇది వరకెప్పుడు లేని విధంగా కొత్తగా పల్లవి అందుకోవడం విచారకరంగా ఉందని పేర్కొంటూ, రాష్ట్రంలో కూటమి ఎవరితో అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పెద్ద భారం దిగి పోయింది: డీఎంకే టాటా చెప్పడంతో కాంగ్రెస్ నెత్తిన ఉన్న అతి పెద్ద భారం దిగి పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆనందం వ్యక్తం చేశారు. బెదిరింపులు కరుణానిధికి కొత్తేమీ కాదని మండిపడ్డారు. అవసరం ఉన్నప్పుడు పక్కన చేరడం, వద్దనుకున్నప్పుడు విమర్శలు, ఆరోపణలు చేయడం పరిపాటి అరుుందని మండి పడ్డారు. డీఎంకేను కాంగ్రెస్ నుంచి ఎలా తరిమేయాలోనన్న యోచన అనేక మంది నాయకుల మదిలో ఉందని, అయితే, వాళ్లకు వాళ్లే వెళ్లిపోవడంతో తమ నెత్తిన ఉన్న పెద్ద భారం దిగి పోయినట్లయిందన్నారు.బాధగా లేదు: డీఎంకే తీసుకున్న నిర్ణయం తమకు ఎలాంటి బాధ కలిగించ లేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ అన్నారు. అయితే, 2జీ వ్యవహారాన్ని సాకుగా చూపుతూ ఆరోపణలు గుప్పించడాన్ని ఖండిస్తున్నామన్నారు. యూపీఏ నుంచి వాళ్లు ఎప్పుడో బయటకు వెళ్లారని, ఇప్పుడు అధికారికంగా ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. డీఎంకేను తామెప్పుడూ మద్దతు కోరలేదని, వాళ్లే తమ మద్దతును పలుమార్లు కోరారని వివరించారు. కాంగ్రెస్‌ను కించ పరిచే విధంగా, నిందల్ని తమ మీద వేసే రీతిలో వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. అవసరం అయితే, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండన్నారు. తమ నేతృత్వంలోనే కూటమి: డీఎంకే వెళ్లినా తమకు ఎలాంటి ఢోకా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ ధరణి ధీమా వ్యక్తం చేశారు. తమ నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు అవకాశం వచ్చిందన్నారు. అయితే, కాంగ్రెస్ మీద అపనిందలు వేసి కరుణానిధి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తాము అనేక ద్రోహాలు చేసినట్టుగా పేర్కొంటున్నారని, అయితే, రాజ్య సభ ఎన్నికల్లో కనిమొళిని గెలిపించి తాము ద్రోహం చేశామా..? అని ప్రశ్నించారు.