అంతా ఒకే గ్రూపు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్ చేపట్టారు. టీఎన్‌సీసీలో గ్రూపులు లేవని, అంతా ఒకే గ్రూపు అని ప్రకటించారు. ఖద్దరు చొక్కా తొడిగిన వాడు రాష్ట్రాన్ని ఏలే పాలకుడు కావాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. పూర్వ వైభవం లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టు తెలిపారు.
సాక్షి, చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి నుంచి జ్ఞానదేశికన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను ఏఐసీసీ రంగంలోకి దించింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, జీకే వాసన్ వర్గాల ఆధిపత్య సమరానికి చెక్ పెట్టడం లక్ష్యంగానే ఏఐసీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు టీఎన్‌సీసీలో చర్చ మొదలైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను రంగంలోకి దించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చతికిలబడ్డ పార్టీని మళ్లీ పైకి తీసుకువచ్చే బాధ్యతల్ని తన భుజాన వేయడంతో అందుకు తగ్గ కార్యాచరణకు ఈవీకేఎస్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం రాష్ట్ర పార్టీ పగ్గాల్ని తన గుప్పెట్లోకి తీసుకున్నారు.
బాధ్యతల స్వీకరణ: ఆదివారం ఉదయం పదిన్నర గం ట లకు ఈవీకేఎస్ ఇళంగోవన్ సత్యమూర్తి భవన్‌లో అడుగు పెట్టారు. ఆయనకు మాజీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ ఆహ్వానం పలికారు.
ఈ ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనందరం తన చాంబర్‌కు ఈవీకేఎస్‌ను తీసుకెళ్లిన జ్ఞాన దేశికన్ తన బాధ్యతల్ని అప్పగించారు. తాను తప్పుకుంటున్నట్టు సంతకం చేశారు. దీంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు స్వీకరిస్తూ ఈవీకేఎస్ సంతకం చేసి, అందరి ఆభినందనల్ని అందుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, నేతలు తిరునావుక్కరసర్, రాయపురం మనో, సెల్వకుమార్, జయకుమార్, ఎమ్మెల్యే విజయ ధరణి, గోపినాథ్, మాజీ ఎంపీ కృష్ణ స్వామి, స్థానిక నాయకుడు, రాయపురం మనో, మాజీ ఎమ్మెల్యే వసంతకుమార్ తదితరులు తరలి వచ్చి కొత్త అధ్యక్షుడిని శుభాకాంక్షలతో ముంచెత్తారు. మూడు గంటల సమయంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం , ఆయన తనయుడు కార్తీ చిదంబరం తదితరులు సత్యమూర్తి భవన్ చేరుకున్నారు. అక్కడ ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను అభినందనలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రూపు రాజకీయూల్లేవు: బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో ఈవీకేఎస్ మాట్లాడారు. తనకు గ్రూపు రాజకీయాలు పడవు అని, అసలు గ్రూపు రాజకీయాల్నే తాను నమ్మనని స్పష్టంచేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇక గ్రూపులు లేవని, అంతా ఒకే గ్రూపుగా ప్రకటించారు. అమావాస్య ముగిసి పౌర్ణమిలోకి అడుగు పెట్టినట్టుగా ఈ రోజును తాను భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. ఖద్దరు చొక్కా తొడిగినోడు రాష్ట్రాన్ని ఏలాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఆ రోజుల కోసం ఎదురు చూస్తున్నట్టు పరోక్షంగా, డీఎంకే , అన్నాడీఎంకేలపై విమర్శలు గుప్పించారు. తనకు బాధ్యతల్ని అప్పగించిన సోనియా, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కామరాజర్ లేకుంటే కాంగ్రెస్ లేదు అని, అలాగే, కాంగ్రెస్ లేకుంటే కామరాజర్ లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు.
కామరాజర్, మూపనార్ ఫొటోల్ని సభ్యత్వ పుస్తకం నుంచి తొలగించాలని అధిష్టానం ఆదేశించలేదని, ఇవన్నీ విషమ ప్రచారంగా ఆరోపించారు. చెప్పాలంటే, ఆ వ్యవహారం చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. వాసన్ పార్టీ పెట్టరు: జీకే వాసన్ సొంతంగా పార్టీ పెట్టరన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగాలని తానే కాదు, ఢిల్లీ పెద్దలు సైతం ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఆయన ఇక్కడే ఉండాలని, ఆయన సేవలు కాంగ్రెస్‌కు అవసరమని పేర్కొన్నారు. తామాకా రూపంలో కాంగ్రెస్‌ను చీల్చడం కన్నా, ఒకే చోట ఉండి మరింత బలోపేతం లక్ష్యంగా అందరూ కలసి కట్టుగా శ్రమిస్తే బాగుంటుందని సూచించారు. ఇక, ఈ సమావేశంలో ప్రసంగించిన కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, ఎమ్మెల్యే విజయ ధరణిలు సైతం వాసన్ కొత్త పార్టీ పెట్టరన్న నమ్మకం ఉందని, ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.