కరుణపై కాంగ్రెస్ ఆక్రోశం
Published Tue, Dec 17 2013 2:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, చెన్నై:నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్లు.. ఒక్క రోజు వ్యవధిలో బద్ద శత్రువులుగా మారారు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్, డీఎంకేల మధ్య బయలుదేరిన వైర్యం. తమను దూషిస్తూ కరుణానిధి చేసిన వ్యాఖ్యల్ని టీఎన్‌సీసీ తీవ్రంగా పరిగణించింది. డీఎంకే తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తమ నెత్తిన ఉన్న ఓ పెద్ద భారం ఊడిపడిందన్న ఆనందాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యక్తం చేశారు. యూపీఏ కూటమి నుంచి డీఎంకే వైదొలగినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకునే తిరిగారు. ఈలం తమిళులు, జాలర్లపై దాడుల వ్యవహారంలో యూపీఏకు వ్యతిరేకంగా కరుణానిధి తన స్వరాన్ని పెంచినా, ఘాటుగా, తీవ్ర పదజాలాలతో స్పందించినా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం నోరు మెదపలేదు.
ఇందుకు కారణం డీఎంకేతో తమ బంధం గట్టిదన్న నమ్మకం. అయితే, ఆ నమ్మకం ఆదివారంతో సన్నగిల్లింది. కాంగ్రెస్‌తో ఇక పొత్తు లేదని కరుణానిధి స్పష్టం చేయడంతో పాటుగా 2జీ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు టీఎన్‌సీసీలో దుమారం రేపాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్లు ఒక్క రాత్రిలో బద్ద శత్రువులుగా మారారు. తమనే విమర్శిస్తారా..? అంటూఎదురు దాడికి దిగారు. కరుణానిధి వ్యాఖ్యల్ని దుయ్య బట్టారు. తమ మీద నిందల్ని మోపొద్దంటూ హితవు పలికారు. ఏమి ద్రోహం చేశాం: తామేదో ద్రోహం చేశామన్నట్టుగా కరుణానిధి వ్యాఖ్యానించడంపై కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2జీ వ్యవహారం కోర్టులో ఉందని, దాన్ని ఎత్తి చూపుతూ తమ మీద నిందల్ని మోపడం మానుకోవాలని హితవు పలికారు. ఇది వరకెప్పుడు లేని విధంగా కొత్తగా పల్లవి అందుకోవడం విచారకరంగా ఉందని పేర్కొంటూ, రాష్ట్రంలో కూటమి ఎవరితో అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
పెద్ద భారం దిగి పోయింది: డీఎంకే టాటా చెప్పడంతో కాంగ్రెస్ నెత్తిన ఉన్న అతి పెద్ద భారం దిగి పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆనందం వ్యక్తం చేశారు. బెదిరింపులు కరుణానిధికి కొత్తేమీ కాదని మండిపడ్డారు. అవసరం ఉన్నప్పుడు పక్కన చేరడం, వద్దనుకున్నప్పుడు విమర్శలు, ఆరోపణలు చేయడం పరిపాటి అరుుందని మండి పడ్డారు. డీఎంకేను కాంగ్రెస్ నుంచి ఎలా తరిమేయాలోనన్న యోచన అనేక మంది నాయకుల మదిలో ఉందని, అయితే, వాళ్లకు వాళ్లే వెళ్లిపోవడంతో తమ నెత్తిన ఉన్న పెద్ద భారం దిగి పోయినట్లయిందన్నారు.బాధగా లేదు: డీఎంకే తీసుకున్న నిర్ణయం తమకు ఎలాంటి బాధ కలిగించ లేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ అన్నారు. అయితే, 2జీ వ్యవహారాన్ని సాకుగా చూపుతూ ఆరోపణలు గుప్పించడాన్ని ఖండిస్తున్నామన్నారు. యూపీఏ నుంచి వాళ్లు ఎప్పుడో బయటకు వెళ్లారని, ఇప్పుడు అధికారికంగా ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు.
డీఎంకేను తామెప్పుడూ మద్దతు కోరలేదని, వాళ్లే తమ మద్దతును పలుమార్లు కోరారని వివరించారు. కాంగ్రెస్‌ను కించ పరిచే విధంగా, నిందల్ని తమ మీద వేసే రీతిలో వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. అవసరం అయితే, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండన్నారు. తమ నేతృత్వంలోనే కూటమి: డీఎంకే వెళ్లినా తమకు ఎలాంటి ఢోకా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ ధరణి ధీమా వ్యక్తం చేశారు. తమ నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు అవకాశం వచ్చిందన్నారు. అయితే, కాంగ్రెస్ మీద అపనిందలు వేసి కరుణానిధి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తాము అనేక ద్రోహాలు చేసినట్టుగా పేర్కొంటున్నారని, అయితే, రాజ్య సభ ఎన్నికల్లో కనిమొళిని గెలిపించి తాము ద్రోహం చేశామా..? అని ప్రశ్నించారు.
Advertisement