కాళ్లబేరం
Published Fri, Feb 7 2014 2:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఇతర పార్టీలు బలమైన కూటములుగా మారుతుండగా కాంగ్రెస్, డీఎంకే ఆందోళనలో పడిపోయాయి. ఒకప్పటి మిత్రత్వాన్ని పునరుద్ధరించుకోవాలని రెండు పార్టీలు తహతహలాడుతూ కాళ్లబేరాలకు దిగిపోయాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి చూస్తే రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ అనివార్యంగా మారింది. బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్ తమ కూటములు సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు లేని బలమైన కూటమిని ఏర్పరుచుకుంటామని కరుణానిధి ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఎంకే మిత్రపక్షమైన వీసీకే అధినేత, పార్లమెంటు సభ్యులు తిరుమావళవన్ ఈనెల 5న ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు.
సుమారు ఇద్దరూ 45 నిమిషాల పాటూ ఏకాంతంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటముల గురించి వివరించగా ఇదే జరిగితే కాంగ్రెస్, డీఎంకేలు రెండూ నష్టపోవలసి వస్తుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని డీఎంకే అధినేతకు వివరించి రాజీ పడాలని రాహుల్ కోరినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కోరే ప్రసక్తేలేదని పైకి చెబుతున్న కరుణానిధి కూడా లోలోన కాంగ్రెస్ చెలిమి కోసం పాకులాడుతున్నట్లు తిరుమావళవన్ రాయబారం వల్ల స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ లేని లోటును డీఎండీకే ద్వారా భర్తీ చేయాలని కరుణ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక వేళ డీఎండీకే బీజేపీతో కలిసిపోతే కరుణానిధి తప్పనిసరిగా కాంగ్రెస్‌ను ఆశ్రయించకతప్పదు. తన బెట్టు సడలకుండా కార్యం నెరవేర్చుకునేందుకే తిరుమావళవన్‌ను దొంగచాటుగా పంపినట్లు భావించవచ్చు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఏ ప్రాంతీయ పార్టీ కూడా కాంగ్రెస్‌తో చేయి కలిపేందుకు సిద్ధంగా లేదు. నామమాత్ర ఉనికితో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగితే కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమనే బెంగపట్టుకుంది. భేషజాలకు పోయి ఇరుపార్టీలు నష్టపోయే కంటే పొత్తుతో దగ్గరై మెరుగైన ఫలితాలు రాబట్టుకోవడం శ్రేయస్కరమనే భావనలో పడిపోయారు. ఎవరున్నా లేకున్నా కాంగ్రె స్, డీఎంకేలు కలిసి నడిస్తే కనీస స్థానాలనైనా దక్కించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామానికి ముగింపు పలికేలా డీఎంకే దూత డిల్లీకి వెళ్లి రాహుల్‌ను ఆశ్రయించగా, రాహుల్ సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ దీనపరిస్థితిని వివరించి పొత్తుకు సిద్ధం చేయమని కోరడం ద్వారా పరస్పరం కాళ్లబేరాలకు దిగారు. రాహుల్ తన మధ్య సాగిన ఈ అంశాలన్నింటినీ తిరుమావళవన్ ధృవీకరించడం గమనార్హం.
Advertisement
Advertisement