EVKS Elangovan
-
రజనీ రాజకీయాల్లోకి రారు.. అన్నీ సినీ స్టంట్లే..!
సాక్షి, చెన్నై : రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. కొత్త సినిమాల విడుదల సమయంలో సినీ స్టంట్ తరహాలో ఏదో ఒక ప్రకటనను ఆయన ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని, ఎవరి వాదనలు వారివేనని వ్యాఖ్యానించారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. అయితే, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటే, తమిళ ప్రజలు మరెన్నో ఏళ్లు ఆయనను కొనియాడుతారని తెలిపారు. తనకు తెలిసినంత వరకు ఆయన రాజకీయాల్లోకి రారూ..! అన్నది స్పష్టం అవుతోందన్నారు. సినిమాల బిజీలో ఉంటూ, సినిమా విడుదల సమయంలో సినీ తరహా స్టంట్ అన్నట్టుగా ఏదో ఒక ప్రకటన ఇస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. అంతేగానీ, పూర్తి స్థాయిలో ఆయన రాజకీయాల్లోకి రావడం అనుమానమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తూ ఉంటాయి.. పోతూఉంటాయని, అయితే, రజనీ మాత్రం రాజకీయాల్లోకి రారూ.. అన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. -
ఈవీకేఎస్కే చాన్స్?
సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక వివాదానికి పరిష్కారం లభించక తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు రూటు మార్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈవీకేఎస్కే మళ్లీ చాన్స్ అప్పగించే విధంగా, అధ్యక్ష పదవిలో కొనసాగింపునకు కసరత్తుల్లో పడ్డట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈవీకేఎస్ ఇళంగోవన్ రాజీనామా చేసి నెలన్నర రోజులకు పైగా అవుతున్నది. ఇంత వరకు కొత్త అధ్యక్షుడి నియామకం జరగలేదు. ఇందుకు కార ణం కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలేతమ కంటే, తమకు అధ్యక్ష పదవి కేటాయించాలంటూ, పలువురు ఢిల్లీకి ఉరకలు తీశారు. ఓ రోజు ఒకరి పేరు, మరోరోజు మరొకరి పేరు అన్నట్టుగా అధ్యక్ష పదవి కుర్చీలాట సాగింది. ఈ గ్రూపు రాజకీయాల పుణ్యమా కాంగ్రెస్ చరిత్రలతో ప్రప్రథమంగా తమిళనాడు అధ్యక్షుడ్ని నియమించలేని పరిస్థితి ఢిల్లీ పెద్దలకు ఏర్పడింది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రంగంలోకి దిగినా, కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయలేని పరిస్థితి. పలానా వ్యక్తిని ఎంపిక చేద్దామనుకుంటే, మరుసటి రోజే హెచ్చరికలు, ఫిర్యాదుల హోరు సాగుతుండడంతో అధ్యక్ష ఎంపిక ఢిల్లీ వర్గాలకు శిరోభారంగా మారింది. అధ్యక్ష ఎంపికలో ఇన్నాళ్లు తలలు పట్టుకుంటూ వచ్చిన ఢిల్లీ పెద్దలు ఇక, రూటు మార్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికను తాత్కాలికంగా పక్కన పెట్టి, ఈవీకేఎస్ను కొనసాగించేందుకు తగ్గట్టుగా మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈవీకేఎస్‌కు చాన్స్: స్థానిక సమరం కసరత్తుల్లో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు మునిగి ఉన్నాయి. అందరికన్నా ముందుగా క్లీన్ స్వీప్ లక్ష్యంగా అన్నాడీఎంకే ఉరకలు తీస్తుంటే, సత్తా చాటేందుకు డీఎంకే ప్రయత్నాల్లో ఉన్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది సభ్యుల్ని కలిగి డీఎంకే తదుపరి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌లో స్థానిక పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇందుకు కారణం అధ్యక్షుడు లేకపోవడమే. కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని పదే పదే జిల్లాల అధ్యక్షులు విన్నవించుకున్నా, గ్రూపు తగాదాలతో బ్రేక్‌లు పడడంతో స్థానిక సమరం కసరత్తుల్లో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. దీంతో కేడర్‌లో ఆందోళన బయలు దేరినట్టు అయింది. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం కొత్త అధ్యక్షుడ్ని ఈ పరిస్థితుల్లో ఎంపిక చేయడం కష్టతరంగా భావించింది. అందుకే కాబోలు ఈవీకేఎస్ను కొనసాగించే విధంగా కొత్త మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు ఈవీకేఎస్ అంగీకరించేనా అన్న ప్రశ్న బయలు దేరినా, అధిష్టానం ఒత్తిడికి తలొగ్గే అవకాశాలు ఎక్కువే. అందుకే కాబోలు ఈవీకేఎస్‌కు ఢిల్లీ నుంచి ఆహ్వానం వచ్చినట్టుగా సమాచారాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చినా, బయలు దేరడానికి ఈవీకేఎస్ యోచిస్తున్నట్టు సమాచారం. అధిష్టానం ఒత్తిడితో అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఈవీకేఎస్ అంగీకరించిన పక్షంలో గ్రూపు రాజకీయాల వివాదాలు కాంగ్రెస్‌లో మరింత తారా స్థాయికి చేరేనా.. లేదా తన రాజకీయంతో అణగదొక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. -
ఎదుర్కొంటా!
గవర్నర్ పరవునష్టం దావాపై ఈవీకేఎస్ వ్యాఖ్య కోవై, నీలగిరుల్లో ప్రచారం సాక్షి, చెన్నై: రాష్ర్ట గవర్నర్ రోశయ్య తనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పరువు నష్టం దావాను చట్టపరంగా ఎదుర్కొంటానని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పష్టం చేశారు. మదుపుటేనుగును గుంకీ ద్వారా అణచి వేయాలే గానీ, తోడేలు, ముల్ల పంది, నక్క ద్వారా కా దంటూ పరోక్షంగా డీఎండీకే - ప్రజాసంక్షేమ కూటమిపై విరుచుకుపడ్డారు. ఈ కూటమి అన్నాడీఎంకేకు మద్దతుగా ఆవిర్భవించిందేనని ధ్వజమెత్తారు. గురువారం కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో ఎన్నికల బరిలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సుడిగాలి ప్రచారం సాగించారు. తన మీద గవర్నర్ ద్వారా పరువు నష్టం దావా వేయించారని, దీనిని ఎలా ఎదుర్కొనాలో తనకు తెలుసునని, చట్టపరంగా ఎదుర్కొంటా అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న సమరంగా పేర్కొన్నారు. ధర్మం నిల బడాలంటే, డీఎంకే , కాంగ్రెస్ కూటమిని ఆదరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మదపుటేనుగును గుంకీ ద్వారా అణగదొక్కాలేగానీ, తోడేలు, ముళ్లపంది, నక్క ద్వారా కాదని పరోక్షంగా ప్రజా సంక్షేమ కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందులో గుంకీ ఎనుగు డీఎంకే, కాంగ్రెస్ కూటమి అని, మదపుటేనుగు, తోడేలు, ముళ్ల పంది, నక్క ఎవ్వరో ఈ పాటికి ఓటర్లకు అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమ కూటమి అన్నాడీఎంకేకు అనుకూలంగా పుట్టుకొచ్చిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమ కూటమి లక్ష్యం మళ్లీ జయలలితను సీఎం చేయడమేనని పేర్కొన్నారు. వారి కుట్రల్ని భగ్నం చేద్దామని, డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కరుణానిధి చేతికి అధికార పగ్గాలు అప్పగిద్దామని పిలుపునిచ్చారు. ఏదో మాయాజాలం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, వారి పాచికలు ఇక్కడ పారబోవని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్నే అమలు చేయని కేంద్రంలోని పాలకులు, ఇక్కడ అంతా ఇచ్చేస్తారంటా..? అని ఎద్దేవా చేశారు. జౌళి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న కోయంబత్తూరు జిల్లా ఇప్పుడు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అన్నాడీఎంకేకు అవకాశాలు ఇస్తూ రావడంతోనే, ఓటర్లు ఆ పార్టీకి చులకన అయ్యారని సూచించారు. ఏనుగుల మీద చూపించే ప్రేమను కూడా ఇక్కడి ఓటర్ల మీద ఆ పార్టీ అధినేత్రి చూపించడం లేదని మండి పడ్డారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా మొదటి స్థానంలో ఉండేదని, ఇప్పుడు చివరి స్థానానికి చేరిందని వ్యాఖ్యానించారు. ఇతర రంగాల్లో వెనుకబడుతూ వస్తున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కు నెట్టడం, వీధివీధికి ఓ టాస్మాక్ తెరిచి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం వంటివే ఐదేళ్ల అన్నాడీఎంకే అధినేత్రి పాలన ఘనత అని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలని డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఆదరించాలని విన్నవించారు. -
కన్నె ర్ర !
రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా గవర్నర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది పరువునష్టం దావాను బుధవారం కోర్టులో దాఖలు చేశారు. గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కల్గించే విధంగా వ్యాఖ్యలు చేసిన టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై కన్నెర్ర చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు ఎవ్వరైనా గుప్పిస్తే చాలు పరువునష్టం దావాల మోత మోగుతుంది. ఇప్పటికే డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు తదితర నాయకులు ఈ దావాల్ని ఎదుర్కొంటున్నారు. ఈ దావాల పర్వం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు విచారణలకు అడ్డుకట్ట వేయాలంటూ ఉన్నత న్యాయస్థానం ద్వారా స్టేలు తెంచుకున్న నాయకులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా ప్రభుత్వం తరఫున గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన వారిపై కన్నెర్ర చేస్తూ చెన్నై సెషన్స్‌కోర్టులో పరువు నష్టం కేసు నమోదుకు పిటిషన్ దాఖలైంది. పరువు నష్టం దావా: రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరువు నష్టం దావాల్ని కోర్టుల్లో కార్పొరేషన్ న్యాయవాది ఎంఎల్ జగన్ దాఖలు చేస్తూ రావడం తెలిసిందే. ఉదయం చెన్నై సెషన్స్ కోర్టులో ఆయన ఓ దావా దాఖలు చేశారు. అందులో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ గత నెల చివర్లో ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కలిగే విధంగా ఆధార రహిత ఆరోపణలు చేశారని వివరించారు. వీసీల నియామకంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయని, ఇందులో ఓ వాటా తనకు, మరో వాటా సీఎం జయలలితకు రోశయ్య ఇచ్చి ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. బాధ్యత గల పదవిలో, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఉన్న రోశయ్యపై ఆయన చేసిన ఆరోపణలు ఆధార రహితంగా పేర్కొన్నారు. రాజకీయ ఉద్దేశంతో ఈవీకేఎస్ ఈ వ్యాఖ్యలు చేసి ఉన్నారని పేర్కొంటూ, సీఎం జయలలితను సైతం కించ పరిచే విధంగా ఆధార రహితంగా వ్యాఖ్యలు చేసి ఉన్నారని కోర్టుకు వివరించారు. రాష్ర్ట గవర్నర్ పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై క్రిమినల్ కేసుగా పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నామని వివరించారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి రాజమాణిక్యం ముందు ఒకటి రెండు రోజుల్లో విచారణకు రానున్నది. -
ఢిల్లీకి పందేరం
ఈవీకేఎస్ పరుగు రాహుల్‌తో భేటీ నేడు తుది నిర్ణయానికి అవకాశం సాక్షి, చెన్నై: డీఎంకేతో కాంగ్రెస్ సీట్ల పందేరం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ పిలుపుతో ఢిల్లీకి టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పరుగులు తీశారు. రాహుల్ గాంధితో భేటీ అయ్యారు. గురువారం సీట్ల పందేరం కొలిక్కి రావడంతో పాటుగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.డీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ గులాం నబి ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ రెండు సార్లు డీఎంకే అధినేత ఎం కరుణానిధితో భేటీ అయ్యారు. అయితే, సీట్ల పందేరం మాత్రం కొలిక్కి రాలేదు. గత ఎన్నికల్లో తమకు కేటాయించిన 63 సీట్లే మళ్లీ అప్పగించాలన్న డిమాండ్‌న డీఎంకే ముందు ఉంచారు. అయితే, గతంలో వాసన్ కాంగ్రెస్‌లో ఉండడం, ప్రస్తుతం ఆయన వేరు కుంపటితో ఎన్నికల్ని ఎదుర్కొంటుండడం, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగ్గిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని 25 సీట్లను మాత్రం ఇవ్వడానికి డిఎంకే నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. డిఎంకే తక్కువ సీట్లు ఇవ్వడానికి నిర్ణయించడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి బయలు దేరింది. అదే సమయంలో కాంగ్రెస్ బయటకు వెళ్తే, డీఎంకేలోకి వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ను ఆహ్వానించేందుకు తగ్గ కసరత్తుల్లో డీఎంకే ఉండడంతో ఆచీతూచీ అడుగులు వేసే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. పలు మార్లు తమిళనాడు కాంగ్రెస్(టీఎన్‌సీసీ) అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నేతృత్వంలోని సీట్ల పందేరం కమిటీ సమాలోచించినా, సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో ఈవీకేఎస్ ఇళంగోవన్ పరుగులు తీశారు. రాహుల్‌తో సమాలోచన: ఢిల్లీ చేరుకున్న ఈవీకేఎస్ ఇళంగోవన్ బుధవారం ఉదయం తొలుత రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ గులాం నబి ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్‌లతో సమావేశమయ్యారు. డీఎంకే దళపతి స్టాలిన్ నేతృత్వంలోని సీట్ల పందేరం కమిటి తమ ముందు ఉంచిన సూచనలు, నియోజకవర్గాల వివరాలను వారి దృష్టికి ఈవీకేఎస్ తీసుకెళ్లారు. తదుపరి ఈ ముగ్గురు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమాలోచనలో పడ్డారు. ఇక తుది నిర్ణయంగా అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం సీట్ల పందేరాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారాలతో 30 నుంచి 33 సీట్లను ఇవ్వడానికి డీఎంకే నిర్ణయించినట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి మరో నాలుగైదు సీట్లు కలిపి ఇవ్వాలని పట్టుబట్టి, తదుపరి మెట్టు దిగి, డీఎంకే ఇచ్చిన దాంతో సర్దుకునేందుకు తగ్గ కార్యాచరణతో ఆజాద్, వాస్నిక్, ఈవీకేఎస్ గురువారం చెన్నైకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. తమకు మద్దతు ఇచ్చే వాళ్లందరికి ఒకటి రెండు, ఐదు సీట్ల వరకు సర్దుబాటు చేసి తక్షణం ఒప్పంద పత్రాలను అందిస్తున్న డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్ కాంగ్రెస్ విషయంలో మాత్రం నాన్చుడు ధోరణి అనుసరిస్తుండడం గమనార్హం. అయితే, ఈ నాన్చుడు తమ వైపు లేదని, కాంగ్రెస్ వైపు ఉందంటూ డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీ పెద్దలతో సంప్రదించాల్సి ఉన్న దృష్ట్యా, జాప్యం తప్పదని పేర్కొన్నారు. -
కూటమి కుదిరింది.. పంపకాలకు తెరలేచింది!
చెన్నై, సాక్షి ప్రతినిధి: కూటమి ఖరారు కావడంతో కాంగ్రెస్, డీఎంకేలు సీట్ల పంపకాలకు సిద్ధమయ్యాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనేదానిపై డీఎంకే సమాలోచనలు సాగిస్తుండగా, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఢిల్లీ విమానం ఎక్కారు. డీఎండీకే కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన డీఎండీకే, కాంగ్రెస్‌లను విజయకాంత్ ఖంగుతినిపించడంతో రెండు పార్టీల్లోనూ ఎన్నికల పనులు వేగం పుంజుకున్నాయి. డీఎండీకేను డీఎంకే కూటమిలోకి తెచ్చే బాధ్యత మీదేనంటూ కాంగ్రెస్‌పై కరుణానిధి భారం మోపారు. డీఎండీకే కోసం తమ సీట్లు త్యాగం చేసేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. డీఎండీకే తమతో కలవడం ఖాయమని కాంగ్రెస్, డీఎంకేలు గట్టిగా నమ్మాయి. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా సీట్ల సర్దుబాట్లను వాయిదావేసుకుంటూ వచ్చాయి. డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్‌లకు తలా ఇన్ని సీట్లు అంటూ నిర్ణయాలు జరిగినట్లు పుకార్లు షికారు చేశాయి. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని నష్టపోయిన విజయకాంత్‌కు డీఎంకేనే ప్రత్యామ్నాయమని ధీమాతో కొనసాగాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయకాంత్ ఒంటరిబాట పట్టారు. చేసేదిలేక కాంగ్రెస్, డీఎంకేలు సీట్ల పంపకాల పనిలోకి నిమగ్నమయ్యాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీ కావడంతో సీట్ల సర్దుబాట్లు సులభంగా సాగుతుందని ఆశిస్తున్నారు. బృందం రెడీ గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల నుంచి పోటీకి దిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నుంచి కాంగ్రెస్ 50 సీట్లను ఆశిస్తోంది. పంపకాల్లో కనీసం 45 సీట్లయినా దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. సీట్ల పంపకాలపై ఒక బృందాన్ని సిద్ధం చేసుకుంది. ఆశిస్తున్న సీట్ల సంఖ్యపై అధిష్ఠానం ఆమోద ముద్ర కోసం ఈవీకేఎస్ ఇళంగోవన్ అకస్మాత్తుగా శుక్రవారం ఢిల్లీకి పయనమయ్యారు. అయితే ఈసారి కాంగ్రెస్ కోరినన్ని సీట్లు దక్కక పోవచ్చని తెలుస్తోంది. అలాగే ఇళంగోవన్ ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రత్యేకవాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. -
ఆమెను ఎన్నికల్లో పోటీ చేయిస్తారా?
ఈవీకేఎస్ ఆకర్షణ మంత్రం ఆశావహులకు కృతజ్ఞత లేఖలు పార్టీ వర్గాలకు గెలుపు సందేశం అవకాశం ఇస్తే పోటీకి రెడీ అంటున్న కుష్భు సాక్షి, చెన్నై: పార్టీలో తనపై ఉన్న వ్యతిరేకతను చెరిపేసేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కసరత్తుల్లో పడ్డారు. ఆకర్షణ మంత్రంతో అందరి మన్ననలు అందుకునేందుకు సిద్ధం అయ్యారు. సీట్లను ఆశిస్తున్న ఆశావహులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖాస్త్రాలు సంధించే పనిలో పడ్డారు. గ్రూపులకు అతీతంగా పార్టీ వర్గాలకు గెలుపు సందేశాన్ని ఇస్తూ, అధిష్టానం పాదాల వద్ద సమర్పణ పిలుపులో పడ్డారు. తనకు అవకాశం ఇస్తే పోటీకి రెడీ అని అధికార ప్రతినిధి కుష్భు ఎన్నికల కదన రంగంలోకి దిగాలన్న ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రాజకీయాలే పార్టీకి గడ్డు పరిస్థితుల్ని సృష్టించాయి. రానున్న ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. తమను డీఎంకే అక్కున చేర్చుకోవడంతో కాంగ్రెస్ ఆనందానికి అవధులు లేవు. అయితే, గ్రూపు రాజకీయ సెగ మాత్రం తగ్గినట్టు లేదు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌కు వ్యతిరేకంగా అన్ని శక్తులు వ్యవహరిస్తుండడం, ఇది కాస్త కాంగ్రెస్ పార్టీ బలం మీద దెబ్బకు పరిణామాల్ని సృష్టిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ను ఎందుకు అక్కున చేర్చుకున్నామా? అన్న డైలమాలో పడాల్సిన పరిస్థితి డీఎంకేకు ఏర్పడింది. ఇందుకు కారణం కాంగ్రెస్‌లోని గ్రూపులు రోజుకో హెచ్చరికలు చేస్తూ రావడమే. అందర్నీ కలుపుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితి ఈవీకేఎస్‌కు ఏర్పడి ఉన్నది. దీంతో ఆకర్షణ మంత్రంతో పార్టీ వర్గాల్ని కలుపుకుని ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఈవీకేఎస్ కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. ఆకర్షణ మంత్రం ఎన్నికల్లో పోటీకి సీటు ఆశిస్తూ ఏడు వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అన్ని గ్రూపులకు చెందిన నాయకులు, వారి మద్దతుదారులు ఉన్నారు. వీరందర్నీ ఆకర్షించడమే కాకుండా, వీరిని కలుపుకుని ముందుకు సాగేందుకు లేఖాస్త్రాలు సంధించే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అయ్యారు. సీటు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదలయ్యే ఈ లేఖలో పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఐక్యతా రాగాల్ని వల్లించి ఉండడం విశేషం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు సైతం సందేశాల్ని పంపించే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అయ్యారు. రాష్ర్టంలో అన్నాడీఎంకే పతనం లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల సమరంలో ‘గెలుపు’ కోసం ఐక్యతతో ముందుకు సాగుదామని, ఆ విజయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పాదాల చెంత సమర్పిద్దామని పిలుపునిస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వాళ్లందరికీ న్యాయం జరుగుతుందని, గెలుపు కోసం శ్రమించే ప్రతి ఒక్కరిని పదవులు వరిస్తాయంటూ అందర్నీ కలుపుకునే ముందుకు సాగేందుకు విశ్వ ప్రయత్నంలో మునిగి ఉండడం గమనార్హం. ఇక, అందర్నీ కలుపుకునే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అవుతోంటే, తనకు సీటు ఇస్తే పోటీకి సై అంటూ సినీ నటి, పార్టీ అధికార ప్రతినిధి కుష్భు ముందుకు సాగుతున్నారు. సీటు ఇస్తే ఓకే డీఎంకే నుంచి బయటకు వచ్చిన కుష్భును కాంగ్రెస్‌లో అందలం ఎక్కించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశ ఆమెలో ఉన్నా, దానికి డీఎంకే వర్గాలు తొక్కేశాయి. కాంగ్రెస్‌లో ఆ ఛాన్స్ దక్కుతుందా..? అన్న ఎదురు చూపుల్లో కుష్భు ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ప్రత్యేక గ్లామర్‌గా ఉన్న కుష్భు సేవలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అవసరం. ఈ దృష్ట్యా, ఆమెను ఎన్నికల్లో పోటీకి చేయిస్తారా? లేదా, కేవలం ఎన్నికల ప్రచారానికి పరిమితం చేస్తారా? అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. దీంతో తన మదిలో ఉన్న కోరికను ముందే పార్టీ అధిష్టానం ముందు ఉంచే పనిలో కుష్భు ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే, పోటీకి సిద్ధమని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పలువురు దరఖాస్తులు చే సి ఉన్నారని గుర్తు చేశారు. అయితే, తాను పోటీ చేయాలా..? వద్దా..? అన్న తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని పేర్కొన్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ డీఎంకే కూటమిలోకి రావాలన్న ఆశ తనకు ఉందని, ఆయన వస్తారన్న నమ్మకం కూడా ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కార్తీ చిదంబరం వ్యవహారం కేవలం రాజకీయం ఎత్తుగడ మాత్రమేనని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి పన్నిన కుట్రగా కుష్భు వ్యాఖ్యానించారు. -
జైలుకెళ్లేందుకు సిద్ధమే!
►అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిమయం ► 25 శాఖల్లో అవినీతిపై పుస్తకం విడుదల చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి సామ్రాజ్యమనేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఈ విషయంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ సవాల్ విసిరారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో 25 శాఖలు అవినీతిమయమని పేర్కొంటూ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. చెన్నై రాయపేటలోని సత్యమూర్తి భవన్లో గురువారం జరిగిన పార్టీ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జయలలిత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి వివరాలతో గత ఏడాది మేలో రాష్ట్ర గవర్నర్ కే రోశయ్యకు ఒక వినతిపత్రం సమర్పించానని తెలిపారు. అయితే ఫిర్యాదు చేసి ఏడునెలలు దాటినా ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు. దీంతో మరో పట్టికను తయారుచేసి విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అవినీతి వివరాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళుతున్నామని చెప్పారు. పుస్తకాన్ని బాగా చదివితే అవినీతి ఆరోపణలపై ఆధారాలు లభిస్తాయని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ అవినీతి చర్యలను వెల్లడి చేయడం ఎంతమాత్రం తప్పుకాదని ఆయన అన్నారు. గవర్నర్ ఏదైనా చర్యలు తీసుకుంటారని ఆశించి భంగపడ్డామని వ్యాఖ్యానించారు. వ్యవసాయాధికారి ముత్తుకుమారస్వామి ఆత్మహత్య కేసులో ఆశాఖ మంత్రిని మాత్రమే తొలగించారు, సీబీఐ విచారణకు ఆదేశించలేదేమని ప్రశ్నించారు. అవినీతి వ్యవహారాలపై ప్రజాకోర్టులోనే చర్చించి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమెనామని తెలిపారు. న్యాయస్థానాల కంటే ప్రజాస్థానాలనే తాను ఎక్కువగా నమ్ముతానని అన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం పరువునష్టం దావాలు, బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. మీడియా గొంతును సైతం నొక్కుతోందని అన్నారు. అయితే తాను ఎంతమాత్రం బెదిరేది లేదు అవసరమైతే కోర్టు, జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమని ఇళంగోవన్ సవాల్ చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన అవినీతి పుస్తకంలో సీఎం జయ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిత్వ శాఖలతో కలుపుకుని మొత్తం 25 శాఖల పేర్లను ప్రస్తావించారు. -
ఢిల్లీకి మళ్లీ పంచాయితీ
వరదల తాకిడిలో కొట్టుకెళ్లిందనుకున్న కాంగ్రెస్ గ్రూపు వివాదం, మళ్లీ వెడెక్కింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వర్గానికి చెందిన మహిళా నేతలకు ఉద్వాసన పలుకుతూ ఆ విభాగం అధ్యక్షురాలు విజయధరణి వ్యవహరించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈవీకేఎస్ ఆమె చర్యలపై ఢిల్లీ పెద్దలకు లేఖాస్త్రం సంధించారు. సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాల గురించి తెలిసిందే. ఈ వివాదాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల కొత్త మలుపుతో మరో వివాదం రాజుకుంది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, మహిళా విభాగం అధ్యక్షురాలు విజయధరణి మధ్య రాజుకున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తొలుత పోలీసు స్టేషన్‌కు తదుపరి ఢిల్లీకి సైతం చేరింది. ఇద్దరు నేతలూ ఢిల్లీ పెద్దల్ని కలిసి మరీ తమతమ వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో చెన్నైలో వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ వివాదం ఆ వరదల్లో కొట్టుకెళ్లినట్టేనని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. అయితే వరదలు తగ్గుముఖం పట్టిన తదుపరి మళ్లీ తెర మీదకు వచ్చింది. చెన్నైకు వచ్చిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవనీయకుండా పార్టీ పెద్దలు అడ్డుకోవడాన్ని విజయధరణి తీవ్రంగా పరిగణించడమే కాకుండా, ఈవీకేఎస్ మద్దతు దారుల్ని పార్టీ నుంచి తొలగిస్తూ చర్యలు చేపట్టి కయ్యానికి మళ్లీ కాలు దువ్వడం గమనార్హం.మళ్లీ ఢిల్లీకి: వరదల్లో కొట్టుకెళ్లి ఈ ఇద్దరు అధ్యక్షుల వివాదం మళ్లీ ఢిల్లీకి చేరింది. రెండు రోజుల క్రితం వరద బాధితుల పరామర్శకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైకు వచ్చారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు మీనంబాక్కం విమానాశ్రయానికి వెళ్లిన విజయధరణికి అనుమతి లభించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల సూచన మేరకే ఆమెను భద్రతా సిబ్బందిలోనికి అనుమతించ లేదని సమాచారం. రాహుల్‌ను కలవనీయకుండా తనను అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విజయధరణి మళ్లీ కయ్యానికి కాలు దువ్వారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ మద్దతుదారులుగా ఉన్న మహిళా నాయకులను తన విభాగం నుంచి తొలగించారు. దీంతో వివాదం మళ్లీ రాజుకుంది. పార్టీకి వ్యతిరేకంగా వాళ్లు వ్యవహరించినందుకే తొలగించినట్టు విజయధరణి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన తనను విమానాశ్రయంలోకి అనుమతించకుండా అడ్డుకున్న భద్రతా సిబ్బంది మీద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, తమ వాళ్లను తొలగించడాన్ని ఈవీకేఎస్ తీవ్రంగానే పరిగణించారు. విజయధరణి చర్యల్ని ఖండిస్తూ, ఆమె కారణంగా పార్టీలో నెలకొంటున్న గందరగోళాన్ని వివరిస్తూ ఢిల్లీ పెద్దలకు గురువారం లే ఖాస్త్రం సంధించినట్టు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్ వర్గాల సమాచారం. దీంతో వ్యవహారం మళ్లీ ఢిల్లీకి చేరినట్టు అయింది. తనకు వ్యతిరేకంగా ఈవీకేఎస్ లేఖాస్త్రం సంధించి ఉండడంతో తాడో పేడో తేల్చుకునేందుకు విజయధరణి కూడా సిద్ధమైనట్టుగా ఆమె మద్దతు వర్గం పేర్కొంటోంది. ఆదివారం అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకుని, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా కొన్ని వర్గాలతో కలసి ఎదురు దాడికి సిద్ధం అవుతోండడంతో మళ్లీ కాంగ్రెస్ రాజకీయాలు కొన్ని ఎపిసోడ్లు గడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
మళ్లీ గ్రూప్ వార్
రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూప్ వార్ మొదలైంది. రాష్ట్రంలోని నేతల తీరుపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తీవ్రంగానే స్పందించారు. అంబులెన్స్ అవినీతి మరక నుంచి కార్తీ చిదంబరం తప్పించుకోలేడని ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం చిదంబరం వర్గం మండి పడుతోంది. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఇదే ఆ పార్టీకి గడ్డు పరిస్థితుల్ని సృష్టించాయి. ఇది వరకు అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానదేశిక న్ నేతల్ని ఏకం చేసి ఐక్యతను చాటుకునేలా కొంత మేరకు సఫలీకృతులయ్యారు. కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపుగా ఉన్న జీకే వాసన్‌తో కలిసి జ్ఞానదేశికన్ బయటకు వెళ్లడంతో కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఆదిలోనే హంసపాదు తప్పలేదు. ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గ్రూపు నేతలతో తంటాలు ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఓ వైపు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గంతో, ఇంకో వైపు టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు వర్గంతో ఢీకొడుతూనే వస్తున్నారు. వీరి రూపంలో తన మీద ఫిర్యాదులు అధిష్టానానికి చేరు తూ వస్తుండడం, వాటికి వివరణ ఇచ్చుకోలేక సతమ తం కావాల్సినపరిస్థితి ఈవీకేఎస్‌కు.చాప కిందనీరులా సాగుతున్న ఈ వ్యవహారాలతో విసిగి వేసారిన ఈవీకేఎస్ ఇక, గ్రూపు నేతలతో తాడో పేడుకు రెడీ అయ్యారు. అధిష్టానం అండతో ఇక పార్టీ బలోపేతం మీదే దృష్టి పెట్టి, గ్రూపు నేతల భరతం పట్టేందుకు వ్యాఖ్యాల దాడికి దిగుతుండటంతో మరో మారు గ్రూప్ వార్‌కు కాంగ్రెస్ కేంద్ర బిందువుగా మారుతున్నది. కాంగ్రెస్ నేతల మధ్య బహిరంగ వార్ బయలు దేరిన పక్షంలో ఇక, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం సత్యమూర్తి భవన్ వద్ద రోజూ ఉత్కంఠే. వ్యాఖ్యల దాడి : గత నెల తంగబాలు మద్దతు వర్గానికి చెందిన పార్టీ జిల్లాల అధ్యక్షుల్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్వాసన పలికిన ఈవీకేఎస్, తాజాగా, చిదంబరం వర్గాన్ని టార్గెట్ చేస్తూ స్వరాన్ని పెంచేందుకు సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలు చిదంబరం వర్గీయుల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. అంబులెన్స్‌ల వ్యవహారంలో తమ నేతకు సంబంధం లేని చిదంబరం వర్గీయులు వాదిస్తున్న సమయంలో ఈవీకేఎస్ అందుకు భిన్నంగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం గ్రూపుల మధ్య మరింత రచ్చ చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాను నిర్ధోషినంటూ కార్తీ చిదంబరం స్పష్టం చేస్తున్నా, ఈ కేసులో ఆయన తప్పించుకోలేడంటూ ఈవీకేఎస్ వ్యాఖ్యానించడాన్ని చిదంబరం మద్దతు దారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తప్పించుకోలేడు : కామరాజర్ ట్రస్టు వ్యవహారం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మదురై తల్లాకులం పోలీసు స్టేషన్లో సంతకం చేయడానికి ఆదివారం ఈవీకేఎస్ ఇళంగోవన్వచ్చారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మక్కల్ ఆయువగం సర్వేలో కాంగ్రెస్ ప్రస్తావన తీసుకురాలేదని, దీన్ని బట్టి చూస్తే, ఎవరో పనిగట్టుకుని ప్రజల్ని దారి మళ్లించేందుకు ఈ సర్వే చేయించినట్టు స్పష్టం అవుతున్నదన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని పార్టీలో గ్రూపు నేతలు సాగిస్తున్న వ్యవహారాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన మీద పడ్డ ఆరోపణల నుంచి బయట పడేందుకే ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా ప్రచారం సాగిస్తున్నారని మండి పడ్డారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఫోన్లో మాట్లాడేంతగా చనువు తనకు ఉందని, అలాంటప్పుడు ఢిల్లీకి తాను పరుగులు తీయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండని హితవు పలికారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికకుట్రలు, కుతంత్రాలైనా చేసుకోండి, వాటిని పట్టించుకోను, అవసరం అయితే, తిప్పికొట్టేందుకు రెడీ అని వ్యాఖ్యానించారు. ఇక, అంబులెన్స్ అవినీతి ఉచ్చు నుంచి కార్తీ చిదంబరం తప్పించుకోలేడని, ఆ కేసును ఎదుర్కొవాల్సిందేనని ఈవీకేఎస్ వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. కాగా, అదే సమయంలో చిదంబరంకు వ్యతిరేక శక్తిగా శివగంగైలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఎంపి సుదర్శన నాచ్చియప్పన్ తల్లాకులంలో ఈవీకేఎస్ను కలుసుసుకోవడం గమనార్హం. -
ఇక చాలు ఆపండి
సాక్షి, చెన్నై :‘ ఆపండి..ఇక చాలు’ అంటూ పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఆదేశాలు ఇచ్చారు. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు వద్దని సూచించారు. ఆ వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలి పెడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జయలలిత భేటీ గురించి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేస్ ఇళంగోవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో పది రోజులకు పైగా రాష్ట్రంలో నిరసనలు సాగుతూ వస్తున్నాయి. అన్నాడీఎంకే వర్గాల ఆగ్రహానికి ఈవీకేఎస్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు సైతం పెరిగాయి. ఈ పరిస్థితుల్లో జయలలిత సేనల నిరసనలు అన్నాడీఎంకే మీద కొత్త విమర్శలకు దారి తీసే పరిస్థితి ఏర్పడింది. అధికార పక్షం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించడంపై కొన్ని పార్టీలు పెదవి విప్పే పనిలో పడ్డాయి. మరికొన్ని పార్టీలు మౌనం పాటించగా, ఇంకొన్ని పార్టీలు ఈవీకేఎస్‌కు మద్దతుగా నిలిచే పనిలో పడ్డాయి. ఈవీకేఎస్ చేసిన వ్యాఖ్యలు ఖండించ దగ్గదైనప్పటికీ , ఆయనకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే వర్గాలు వ్యవహరిస్తున్న తీరు, నోరు జారుతుండడంపై సర్వత్రా విమర్శించే పనిలో పడ్డారు. ఇంత తంతు సాగుతున్నా, సీఎం జయలలిత వారించడం లేదెందుకు అన్న ప్రశ్న సైతం బయలు దేరింది. దీంతో మేల్కొన్న సీఎం జయలలిత ఇక చాలు, ఆపండి అంటూ నిరసనలకు కల్లెం వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆపండి : ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం అవుతుండడంతో పార్టీ వర్గాల్ని వారిస్తూ సీఎం జయలలిత ఆదివారం ప్రత్యేక ప్రకటన చేశారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన తన భేటీ గురించి ఈవీకేఎస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ భేటీని అవహేళన చేస్తూ, కించ పరుస్తూ, దిగజారుడు తనంతో అనాగరికంగా వ్యవహరించారని మండి పడ్డారు. పని గట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో లేదా సంయమనం కోల్పోయే చేశారో ఏమోగానీ ఆ వ్యాఖ్యలు ఖండించ తగినదిగా పేర్కొన్నారు. తమిళ జాలర్ల విషయంగా ప్రధానికి పదే పదే తాను రాస్తూ వచ్చిన లేఖలను ఎద్దేవా చేస్తూ శ్రీలంక సర్కారు వారి వెబ్ సైట్లో కించ పరిచే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్‌తో పాటుగా అన్ని పార్టీలు ఖండించాయని, తప్పను సరిదిద్దుకుంటూ శ్రీలంక సర్కారు క్షమాపణ చెప్పుకున్న విషయాన్ని వివరించారు. ఈవీకేఎస్ చేసిన వ్యాఖ్యలను కొందరు వ్యతిరేకిస్తూ, ఖండించగా, మరికొందరు వెనకేసుకొస్తున్నారని, ఇంకొందరు మౌనం పాటిస్తూ రాజకీయ లబ్ధి పొందే యత్నం చేస్తున్నారని ప్రతి పక్షాలపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాను చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఈవీకేఎస్ స్పష్టం చేసి ఉన్నారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే, పరోక్షంగా చేసిన తప్పును ఈవీకేఎస్ సరిదిద్దుకున్నట్టేనని వివరించారు. చేసిన తప్పును సరిద్దుకుంటూ ఈవీకేఎస్ స్పందించిన దృష్ట్యా, ఇక, నిరసనలు కొనసాగించడం మంచి పద్ధతి కాదని పార్టీ వర్గాలకు హితవు పలికారు. ఇక, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నిరసనలు వద్దు అని, ఇక అన్నీ ఆపండి అంటూ ముగించారు. హర్షం : పార్టీ వర్గాలకు నిరసనలకు కల్లెం వేస్తూ సీఎం జయలలిత స్పందించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆహ్వానించారు. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి తిరునావుక్కరసు కృతజ్ఞతలు తెలియజేశారు. వీసీకే నేత తిరుమావళవన్ , సీపీఐ నేత ముత్తరసన్ ఆలస్యంగా స్పందించినా, ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఉదయాన్నే మీడియాతో మాట్లాడిన ఈవీకేఎస్ ఇళంగోవన్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టం చేస్తూ, కేసులకు భయ పడే ప్రసక్తే లేదన్నారు. ఇక, కామరాజర్ ట్రస్ట్ సిబ్బంది వలర్మతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ ఈవీకేఎస్‌కు నోటీసులు జారీ చేసింది. ఐదురోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో తమ అధ్యక్షుడిపై తప్పుడు ఫిర్యాదు చేసిన వలర్మతి భరతం పట్టేందుకు మాజీ ఎమ్మెల్యే యశోధ సిద్ధం అయ్యారు. ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి నిర్ణయించారు. -
సంకటంలో ఇళంగోవన్
ఏఐసీసీకి ఫిర్యాదుల వెల్లువ ఉద్వాసనకు డిమాండ్ ఢిల్లీకి పరుగు అరెస్టుకు రంగం సిద్ధం సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు సంకట పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. సీఎం జయలలితపై ఆయన చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేకంగా సాగుతున్న రచ్చ ఏఐసీసీ దృష్టికి చేరింది. తనపై ఫిర్యాదులు వెల్లువెత్తిన సమాచారంతో వివరణ ఇచ్చుకునేందుకు దేశ రాజధానికి రాష్ట్ర అధ్యక్షుడు పరుగులు తీశారు. కాగా, అధ్యక్షులు వారు హద్దులు దాటారంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు, ఏఐసీసీ సభ్యుడు కార్తీ చిదంబరం వ్యాఖ్యానించడం ఈవీకేఎస్ మద్దతు దారుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ - సీఎం జయలలితలను ఉద్దేశించి టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నోరు జారడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే వర్గాలు నిరసనలు కొనసాగిస్తూ వస్తున్నాయి. ఓ వైపు నిరసనలో మరో వైపు కోర్టులో కేసుల నమోదుకు పిటిషన్ల మోత మోగుతున్నాయి. ఈవీకేఎస్‌కు అండగా ఉన్నారన్న ఒక్క కారణంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి కుష్భుకు వ్యతిరేకంగా సైతం నిరసనలు, పిటిషన్ల మోత మోగుతూ వస్తున్నాయి. శనివారం కూడా రాష్ర్టంలో పలు చోట్ల నిరసనలు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో కామరాజర్ ట్రస్ట్‌లో అవినీతి జరిగిందంటూ వలర్మతి అనే మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఈవీకేఎస్ వ్యతిరేకులకు ఆయుధంగా మారినట్టుంది. రాష్ర్టంలో ఈవీకేఎస్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆయనకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు, ట్రస్టులో అవినీతి బండారాన్ని కొందరు నాయకులు ఢిల్లీకి చేరవేసినట్టుంది. ఫిర్యాదుల వెల్లువ : రాష్ర్టంలో కాంగ్రెస్ నేతలు పేరుకే ఐక్యత అన్న నినాదాన్ని వాడుతున్నా, లోలోపల గ్రూపు రాజకీయాల్ని సాగిస్తూనే ఉన్నారు. ఈవీకేఎస్ నియామకం నాటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో పాటుగా పలువురు మాజీ అధ్యక్షులు గ్రూపులు వ్యవహరిస్తూనే వస్తున్నాయి. తాజాగా, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా అధిష్టానంకు ఫిర్యాదులు చేయడానికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డట్టున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరువును బజారుకీడ్చే రీతిలో ఈవీకేఎస్ వ్యవహరించి ఉన్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగిన పక్షంలో మరింత సంకట పరిస్థితులు పార్టీకి తప్పదన్న సంకేతాన్ని ఆయన వ్యతిరేకులు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నోటి దురుసు కారణంగా పార్టీకి చెడ్డ పేరు తలెత్తి ఉన్న దన్న సమాచారంతో ఏఐసీసీ తదుపరి కార్యచరణకు సిద్ధమైనట్టుంది. ప్రధానంగా ఈవీకేఎస్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఆయన వ్యతిరేకులు అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఢిల్లీకి పరుగు : అవకాశం దొరికింది కదా..? అని తన వ్యతిరేకులు ఏకమై పదవీ ఎసురు పెట్టే పనిలో పడటంతో ఈవీకేఎస్ మేల్కొన్నారు. రాత్రికి రాత్రే ఢిల్లీకి చెక్కేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కలుసుకుని తన వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. ఆయన ఇచ్చే వివరణకు ఏ మేరకు అధిష్టానం ఏకీభవిస్తుందోనన్న ఎదురు చూపుల్లో ఈవీకేఎస్ మద్దతు దారులు ఉన్నారు. ఆదివారం కూడా తమ నేత ఢిల్లీలోనే ఉంటారని ఈవీకేఎస్ మద్దతు దారులు ఒకరు పేర్కొనడం గమనార్హం. సెక్షన్ల గుబులు : ఓ వైపు తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి వెళ్లినా, పోలీసుల అరెస్టు నుంచి ఈవీకేఎస్ తప్పించుకుంటారా..? అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారానికి వాయిదా వేయడంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకే ఆదివారం కూడా ఢిల్లీలో తిష్ట వేయడానికి ఈవీకేఎస్ నిర్ణయించిన ఉన్నారని ఆయన వ్యతిరేకులు వ్యాఖ్యానిస్తున్నారు. వలర్మతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈవీకేఎస్‌పై ఏడు రకాల సెక్షన్లతో కేసుల్ని చెన్నై పోలీసులు నమోదు చేసి ఉన్నారు. 323,506(1), 354,509,406,420 తదితర సెక్షన్ల నమోదైన దృష్ట్యా, అరెస్టైన పక్షంలో బెయిల్ లభించడం కష్టమేనని పేర్కొంటున్నారు. ఇక, ఈవీకేఎస్ను సోమవారం లోపు అరెస్టు చేయడానికి చెన్నై పోలీసులు ఉవ్విళ్లూరుతో ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపినట్టు సమాచారం. తాజా పరిస్థితులన్నీ ఈవీకేఎస్‌కు సంకటంగా మారుతున్నాయి. ఈ సమయంలో చిదంబరం తనయుడు, కార్తీ చిదంబరం ఈవీకేఎస్ హద్దులు దాటారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలు, ఆరోపణలకు ఒక హద్దు అంటూ ఉంటుందని, అయితే, సీఎం జయలలితపై చేసిన వ్యాఖ్యల్లో ఈవీకేఎస్ హద్దులు దాటి నోరు జారారంటూ మీడియాతో కార్తీ పేర్కొనడం ఈవీకేఎస్ మద్దతు దారుల్ని జీర్ణించుకోలేకుండా చేస్తున్నది. ఈ పరిణామాలు మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనన్నది వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్‌లో రచ్చరచ్చ
తమిళనాడు కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి రోడ్డెక్కాయి. వర్గ విభేదాలు నిప్పు లేకుండానే భగ్గుమన్నాయి. శనివారం ఉదయం ముట్టడి, బాహాబాహీలతో సత్యమూర్తి భవన్ ప్రాంగణం అట్టుడికింది. చెన్నై, సాక్షి ప్రతినిధి:విడతలవారీగా రాష్ట్రస్థాయి సమావేశాలను నిర్వహించుకుంటూ వస్తున్న తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ముందు గా నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారం శనివారం బీసీ విభాగం సమావేశం జరపాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లివళవన్ మృతి చెందడంతో సమావేశం వాయిదా పడింది. ఉదయం 11 గంటల సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి సత్యమూర్తి భవన్‌కు చేరుకున్న ఇళంగోవన్ కిల్లివళవన్ మృతికి సంతాప సూచకంగా కొద్ది సేపు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘిటించారు. అనంతరం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి బైటకు వచ్చారు. అదే సమయంలో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వర్గీయులు బిగ్గరగా వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇళంగోవన్‌ను ముట్టడించారు. సత్యమూర్తి భవన్లో జరిగే సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని, బహిష్కరించినట్లు వ్యవహరిస్తున్నారని, శుక్రవారం నిర్వహించిన ఎస్సీ విభాగం సమావేశానికి సైతం పిలుపు లేదని నిలదీశారు. ‘ఈనాటి సమావేశం వాయిదాపడింది, మిగతా విషయాలు మళ్లీ మాట్లాడుకుందాం’అని ముక్తసరిగా బదులిచ్చిన ఇళంగోవన్ చుట్టుముట్టిన కార్యకర్తలను తోసుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆ తరువాత టీఎన్‌సీసీ అధ్యక్షుడి వర్గంతో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వర్గం వాదం పెట్టుకున్నారు. మాటామాట పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. ఒక దశలో పరస్పరం తలపడి బాహాబాహీకి దిగారు. రెండు వర్గాల కేకలు, అరుపులు, జిందాబాద్, మురా్దాబాద్ నినాదాలతో సత్యమూర్తి భవన్ ప్రాంగణం దద్దరిల్లింది. వారిని అదుపుచేసే సాహసం ఎవ్వరూ చేయలేక పోయారు. ఇంతలో అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారని గ్రహించి ఎవరికివారే జారుకున్నారు. ఈ సందర్భంగా చిదంబరం వ ర్గానికి చెందిన బీసీ నేత సత్యశీలన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు కాంగ్రెస్‌లో తమ నేత వర్గీయులకు చోటే లేకుండా చేశారని, అంతా ఇళంగోవన్ వర్గంతో నింపివేశారని విమర్శించారు. పైగా పార్టీ సమావేశాలకు తమవారెవ్వరికీ ఆహ్వానాలు అందడం లేదని చెప్పారు. ఈ ఏకపక్ష ధోరణిపై ఇళంగోవన్‌ను తాము నిలదీయగా బదులివ్వకుండానే జారుకున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం పెద్ద ఎత్తున సాగింది. పార్టీపరమైన 24 జిల్లాల్లో కేవలం రెండు స్థానాలు చిదంబరం వర్గానికి కేటాయించి, మిగిలిన 22 స్థానాల్లో ఇళంగోవన్ తనవారికి ఇచ్చుకున్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధి అధ్యక్షుడిగా పి.టిక్కారాజు, వేలూరు తూర్పు అధ్యక్షుడిగా సి.పంచాక్షరంలను నియమించారు. మిగిలిన వారంతా టీఎన్‌సీసీ అనుచరులు కావడం పార్టీలో కల్లోలం సృష్టించింది. -
'ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తా'
చెన్నై: పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జవాబిచ్చేందుకు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నిరాకరించారు. తనను వివరణ అడిగే అధికారం ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఏఐసీసీకి మాత్రమే ఉందన్నారు. ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ను, పార్టీ వ్యవహారాలను విమర్శించినందుకు ఆయనకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఈనెల 23న సంజాయిషీ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసుకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఇళంగోవన్ స్పష్టం చేశారు. -
'కమల్, రజనీ రాజకీయాల్లోకి రావొద్దు'
ఎరోడ్: రాజకీయాల్లోకి రావొద్దని అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లను తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కోరారు. రాజకీయ కార్యకలాపాల్లో బందీ కావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 'రాజకీయాల్లోకి రావొద్దని సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్ లను కోరుతున్నా' అని ఇళంగోవన్ పేర్కొన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలంటే తనకు భయం లేదని రజనీకాంత్ ప్రకటించిన మరుసటి రోజే ఇళంగోవన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ 'లింగా' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ ప్రకటించారు. కాగా, రజనీకాంత్‌ను చేర్చుకునేందుకు బీజేపీతోపాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి తప్పుకున్న జీకే వాసన్ కూడా ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను ఆయన వదులుకున్నట్టు ప్రచారం జరిగింది. -
అంతా ఒకే గ్రూపు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని ఈవీకేఎస్ ఇళంగోవన్ చేపట్టారు. టీఎన్‌సీసీలో గ్రూపులు లేవని, అంతా ఒకే గ్రూపు అని ప్రకటించారు. ఖద్దరు చొక్కా తొడిగిన వాడు రాష్ట్రాన్ని ఏలే పాలకుడు కావాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. పూర్వ వైభవం లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. సాక్షి, చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి నుంచి జ్ఞానదేశికన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను ఏఐసీసీ రంగంలోకి దించింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, జీకే వాసన్ వర్గాల ఆధిపత్య సమరానికి చెక్ పెట్టడం లక్ష్యంగానే ఏఐసీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు టీఎన్‌సీసీలో చర్చ మొదలైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను రంగంలోకి దించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చతికిలబడ్డ పార్టీని మళ్లీ పైకి తీసుకువచ్చే బాధ్యతల్ని తన భుజాన వేయడంతో అందుకు తగ్గ కార్యాచరణకు ఈవీకేఎస్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం రాష్ట్ర పార్టీ పగ్గాల్ని తన గుప్పెట్లోకి తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణ: ఆదివారం ఉదయం పదిన్నర గం ట లకు ఈవీకేఎస్ ఇళంగోవన్ సత్యమూర్తి భవన్లో అడుగు పెట్టారు. ఆయనకు మాజీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ ఆహ్వానం పలికారు. ఈ ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనందరం తన చాంబర్‌కు ఈవీకేఎస్ను తీసుకెళ్లిన జ్ఞాన దేశికన్ తన బాధ్యతల్ని అప్పగించారు. తాను తప్పుకుంటున్నట్టు సంతకం చేశారు. దీంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు స్వీకరిస్తూ ఈవీకేఎస్ సంతకం చేసి, అందరి ఆభినందనల్ని అందుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, నేతలు తిరునావుక్కరసర్, రాయపురం మనో, సెల్వకుమార్, జయకుమార్, ఎమ్మెల్యే విజయ ధరణి, గోపినాథ్, మాజీ ఎంపీ కృష్ణ స్వామి, స్థానిక నాయకుడు, రాయపురం మనో, మాజీ ఎమ్మెల్యే వసంతకుమార్ తదితరులు తరలి వచ్చి కొత్త అధ్యక్షుడిని శుభాకాంక్షలతో ముంచెత్తారు. మూడు గంటల సమయంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం , ఆయన తనయుడు కార్తీ చిదంబరం తదితరులు సత్యమూర్తి భవన్ చేరుకున్నారు. అక్కడ ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను అభినందనలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రూపు రాజకీయూల్లేవు: బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో ఈవీకేఎస్ మాట్లాడారు. తనకు గ్రూపు రాజకీయాలు పడవు అని, అసలు గ్రూపు రాజకీయాల్నే తాను నమ్మనని స్పష్టంచేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇక గ్రూపులు లేవని, అంతా ఒకే గ్రూపుగా ప్రకటించారు. అమావాస్య ముగిసి పౌర్ణమిలోకి అడుగు పెట్టినట్టుగా ఈ రోజును తాను భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. ఖద్దరు చొక్కా తొడిగినోడు రాష్ట్రాన్ని ఏలాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఆ రోజుల కోసం ఎదురు చూస్తున్నట్టు పరోక్షంగా, డీఎంకే , అన్నాడీఎంకేలపై విమర్శలు గుప్పించారు. తనకు బాధ్యతల్ని అప్పగించిన సోనియా, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కామరాజర్ లేకుంటే కాంగ్రెస్ లేదు అని, అలాగే, కాంగ్రెస్ లేకుంటే కామరాజర్ లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. కామరాజర్, మూపనార్ ఫొటోల్ని సభ్యత్వ పుస్తకం నుంచి తొలగించాలని అధిష్టానం ఆదేశించలేదని, ఇవన్నీ విషమ ప్రచారంగా ఆరోపించారు. చెప్పాలంటే, ఆ వ్యవహారం చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. వాసన్ పార్టీ పెట్టరు: జీకే వాసన్ సొంతంగా పార్టీ పెట్టరన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగాలని తానే కాదు, ఢిల్లీ పెద్దలు సైతం ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఆయన ఇక్కడే ఉండాలని, ఆయన సేవలు కాంగ్రెస్‌కు అవసరమని పేర్కొన్నారు. తామాకా రూపంలో కాంగ్రెస్‌ను చీల్చడం కన్నా, ఒకే చోట ఉండి మరింత బలోపేతం లక్ష్యంగా అందరూ కలసి కట్టుగా శ్రమిస్తే బాగుంటుందని సూచించారు. ఇక, ఈ సమావేశంలో ప్రసంగించిన కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్, ఎమ్మెల్యే విజయ ధరణిలు సైతం వాసన్ కొత్త పార్టీ పెట్టరన్న నమ్మకం ఉందని, ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లో చీలిక?
తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)లో చీలిక మొదలైంది. టీఎన్‌సీసీ అధ్యక్ష పదవికి జ్ఞానదేశికన్ చేసిన రాజీనామా ఆమోదం పొందడం, కొత్త అధ్యక్షునిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ నియామకం జరిగిపోగా, మాజీలు మరో పార్టీ సన్నాహాల్లో పడిపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత సభ్యత్వం కార్యక్రమం జరుగుతుండగా, కార్యకర్తలకు జారీచేసే సభ్యత్వకార్డులో మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, సీనీయర్ నేత జీకే మూపనార్ ఫొటోలను తొలగించాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో పార్టీలో ముసలం బయలుదేరింది. ఫొటోల తొలగింపులో తనను మాటమాత్రమైనా అడగకుండా నిర్ణయం తీసుకోవడం జ్ఞానదేశికన్‌కు ఆగ్రహం తెప్పించింది. అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు చేస్తోంది అంటూ రెండు రోజుల క్రితం సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపగా వెంటనే ఆమోదించారు. 2016లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోగల వ్యక్తిని నియమించాలనే ఏకవాక్య అజెండాతో సోనియా ఢిల్లీలోని తన స్వగృహంలో శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ ముకుల్‌వాస్నిక్ పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరి పారు. ఈ సందర్భంగా ఇళంగోవన్, పీటర్ ఆల్బెన్స్, సుదర్శన్ నాచియప్పన్, తిరునావుక్కరసు, వసంతకుమార్ పేర్లను సమావేశం పరిశీలించింది. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న ఇళంగోవన్ పేరును ఏకగ్రీవంగా తీర్మానించగా, రాష్ట్ర ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ అధికారికంగా ప్రకటించారు. ప్రకటన వెలువడిన వెంటనే సత్యమూర్తి భవన్‌కు చేరుకున్న ఇళంగోవన్‌ను ఆయన అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. భవన్ ప్రాంగణంలో బాణాసంచా కాల్చి సంబరం చేశారు. ఇళంగోవన్ సత్యమూర్తి భవన్ నుంచి కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ ఇంటికి వెళ్లి అండగా నిలవాలని కోరారు. అనుభవం అనుకూలించేనా? ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయంలో జన్మించిన ఇళంగోవన్ 2000 నుంచి 2002 వరకు టీఎన్‌సీసీ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో గోపిచెట్టి పాళయం నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా తిప్పికొట్టగల నేర్పు న్న నాయకునిగా పేరుంది. పార్టీలోని అన్నివర్గాలను కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలు ఉన్న నేతగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో పార్టీ పూర్తిగా చతికిలబడి ఉన్న పరిస్థితిల్లో ఇళంగోవన్ అనుభవం అనుకూలిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.