
రజనీకాంత్, కమల్ హాసన్(ఫైల్)
రాజకీయాల్లోకి రావొద్దని అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లను తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కోరారు.
ఎరోడ్: రాజకీయాల్లోకి రావొద్దని అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లను తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కోరారు. రాజకీయ కార్యకలాపాల్లో బందీ కావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 'రాజకీయాల్లోకి రావొద్దని సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్హాసన్ లను కోరుతున్నా' అని ఇళంగోవన్ పేర్కొన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలంటే తనకు భయం లేదని రజనీకాంత్ ప్రకటించిన మరుసటి రోజే ఇళంగోవన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ 'లింగా' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ ప్రకటించారు. కాగా, రజనీకాంత్‌ను చేర్చుకునేందుకు బీజేపీతోపాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి తప్పుకున్న జీకే వాసన్ కూడా ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను ఆయన వదులుకున్నట్టు ప్రచారం జరిగింది.