
దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్ చాలాకాలంగా బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల హవానే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే సమీప కాలంలో ఆ ట్రెండ్ మారుతోంది. తమిళనాడుకు చెందిన అమ్మాయిలు కథానాయికగా నటించటానికి ముందుకు వస్తున్నారు. అలా తాజాగా సువితా రాజేంద్రన్ అనే తమిళ అమ్మాయి తామీ అనే చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అంటూ జాలీగా సాగే కథా చిత్రం ఇది. ప్రవీణ్ దశరథం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇందులో మరో కథానాయకి నటి చాందిని తమిళరసన్ నటించారు. కాగా తన సినీ రంగ ప్రవేశం గురించి నటి సువితా రాజేంద్రన్ తెలుపుతూ చిన్న తనం నుంచి నటుడు కమలహాసన్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అలా నటనపై ఆసక్తి పెరిగిందన్నారు. దీంతో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తానని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు సంకోచించడంతో పాటు భయపడ్డారన్నారు. కారణం తనకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడమేనన్నారు. అయితే ఉద్యోగం పేరుతో చైన్నెకి వచ్చిన తాను ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానన్నారు.
అదేవిధంగా ఒక కూత్తుపట్టరై కళాకారుడి వద్ద తాను నటనలో శిక్షణ పొందానని చెప్పారు. ఆ తర్వాత సినిమా రంగంపై దృష్టి సాధించానన్నారు. అలా వచ్చిన అవకాశమే తామి చిత్రం అని చెప్పారు. ఇందులో దర్శకుడు సూచనల మేరకు బాగా నటించానని భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. ఇందులో తాను జర్నలిస్టు పాత్రను పోషించినట్లు చెప్పారు.