తమిళ సినిమా: నటుడు విజయ్‌తో కలిసి వారీసు చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు శ్యామ్ పేర్కొన్నారు. 12బి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. అలాగే పలు చిత్రాలకు కూడా ఆయన నిర్మాత వ్యవహిరించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారసుడు(తమిళంలో వారీసు) చిత్రంలో ఆయనకు సోదరుడిగా ముఖ్య పాత్రలో శ్యామ్ నటించారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా నేడు(బుధవారం) 11వ తేదీన భారీ అంచనాల మధ్య వారిసు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన మంచి ఎంటర్‌టైనర్ కథాచిత్రంగా వారీసు ఉంటుందన్నారు. తాను ఆరంభ దశలో విజయ్‌తో ఖుషి చిత్రంలో చిన్న పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 12బి చిత్రంలో కథానాయకుడిగా నటించినప్పుడు విజయ్ తనను అభినందించారని చెప్పారు.
అలాంటిది ఇప్పుడు మళ్లీ వారీసు చిత్రంలో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా మాట్లాడతారని,ఎక్కువగా కసరత్తులు చేస్తారన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ ఎవరన్న ఆంశంపై పెద్ద చర్చే జరుగుతోందని, అయితే ఈ విషయంలో రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదని పేర్కొన్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల స్థాయి వేరని, అయితే విజయ్‌కు అజిత్‌కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు.
ఇద్దరికీ అత్యధిక సంఖ్యలోనే అభిమానులు ఉన్నారన్నారు. పొంగల్‌కు విడుదల అవుతున్న వారిసు, తుణివు చిత్రాలు రెండు విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాను నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని, గోలీ సోడా 3 చిత్రంలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, మరికొన్ని చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తెలుగు, కన్నడంలోనూ నటిస్తున్నానని, అదే విధంగా త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు శ్యామ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment