కాంగ్రెస్‌లో రచ్చరచ్చ
తమిళనాడు కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి రోడ్డెక్కాయి. వర్గ విభేదాలు నిప్పు లేకుండానే భగ్గుమన్నాయి. శనివారం ఉదయం ముట్టడి, బాహాబాహీలతో సత్యమూర్తి భవన్ ప్రాంగణం అట్టుడికింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:విడతలవారీగా రాష్ట్రస్థాయి సమావేశాలను నిర్వహించుకుంటూ వస్తున్న తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ముందు గా నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారం శనివారం బీసీ విభాగం సమావేశం జరపాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లివళవన్ మృతి చెందడంతో సమావేశం వాయిదా పడింది. ఉదయం 11 గంటల సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి సత్యమూర్తి భవన్‌కు చేరుకున్న ఇళంగోవన్ కిల్లివళవన్ మృతికి సంతాప సూచకంగా కొద్ది సేపు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘిటించారు. అనంతరం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి బైటకు వచ్చారు. అదే సమయంలో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వర్గీయులు బిగ్గరగా వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇళంగోవన్‌ను ముట్టడించారు.
సత్యమూర్తి భవన్‌లో జరిగే సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని, బహిష్కరించినట్లు వ్యవహరిస్తున్నారని, శుక్రవారం నిర్వహించిన ఎస్సీ విభాగం సమావేశానికి సైతం పిలుపు లేదని నిలదీశారు. ‘ఈనాటి సమావేశం వాయిదాపడింది, మిగతా విషయాలు మళ్లీ మాట్లాడుకుందాం’అని ముక్తసరిగా బదులిచ్చిన ఇళంగోవన్ చుట్టుముట్టిన కార్యకర్తలను తోసుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆ తరువాత టీఎన్‌సీసీ అధ్యక్షుడి వర్గంతో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వర్గం వాదం పెట్టుకున్నారు. మాటామాట పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. ఒక దశలో పరస్పరం తలపడి బాహాబాహీకి దిగారు. రెండు వర్గాల కేకలు, అరుపులు, జిందాబాద్, మురా్దాబాద్ నినాదాలతో సత్యమూర్తి భవన్ ప్రాంగణం దద్దరిల్లింది. వారిని అదుపుచేసే సాహసం ఎవ్వరూ చేయలేక పోయారు. ఇంతలో అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారని గ్రహించి ఎవరికివారే జారుకున్నారు.
ఈ సందర్భంగా చిదంబరం వ ర్గానికి చెందిన బీసీ నేత సత్యశీలన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు కాంగ్రెస్‌లో తమ నేత వర్గీయులకు చోటే లేకుండా చేశారని, అంతా ఇళంగోవన్ వర్గంతో నింపివేశారని విమర్శించారు. పైగా పార్టీ సమావేశాలకు తమవారెవ్వరికీ ఆహ్వానాలు అందడం లేదని చెప్పారు. ఈ ఏకపక్ష ధోరణిపై ఇళంగోవన్‌ను తాము నిలదీయగా బదులివ్వకుండానే జారుకున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం పెద్ద ఎత్తున సాగింది. పార్టీపరమైన 24 జిల్లాల్లో కేవలం రెండు స్థానాలు చిదంబరం వర్గానికి కేటాయించి, మిగిలిన 22 స్థానాల్లో ఇళంగోవన్ తనవారికి ఇచ్చుకున్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధి అధ్యక్షుడిగా పి.టిక్కారాజు, వేలూరు తూర్పు అధ్యక్షుడిగా సి.పంచాక్షరంలను నియమించారు. మిగిలిన వారంతా టీఎన్‌సీసీ అనుచరులు కావడం పార్టీలో కల్లోలం సృష్టించింది.