గవర్నర్ పరవునష్టం దావాపై ఈవీకేఎస్ వ్యాఖ్య
కోవై, నీలగిరుల్లో ప్రచారం
సాక్షి, చెన్నై: రాష్ర్ట గవర్నర్ రోశయ్య తనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పరువు నష్టం దావాను చట్టపరంగా ఎదుర్కొంటానని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పష్టం చేశారు. మదుపుటేనుగును గుంకీ ద్వారా అణచి వేయాలే గానీ, తోడేలు, ముల్ల పంది, నక్క ద్వారా కా దంటూ పరోక్షంగా డీఎండీకే - ప్రజాసంక్షేమ కూటమిపై విరుచుకుపడ్డారు. ఈ కూటమి అన్నాడీఎంకేకు మద్దతుగా ఆవిర్భవించిందేనని ధ్వజమెత్తారు. గురువారం కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో ఎన్నికల బరిలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సుడిగాలి ప్రచారం సాగించారు. తన మీద గవర్నర్ ద్వారా పరువు నష్టం దావా వేయించారని, దీనిని ఎలా ఎదుర్కొనాలో తనకు తెలుసునని, చట్టపరంగా ఎదుర్కొంటా అని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న సమరంగా పేర్కొన్నారు. ధర్మం నిల బడాలంటే, డీఎంకే , కాంగ్రెస్ కూటమిని ఆదరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మదపుటేనుగును గుంకీ ద్వారా అణగదొక్కాలేగానీ, తోడేలు, ముళ్లపంది, నక్క ద్వారా కాదని పరోక్షంగా ప్రజా సంక్షేమ కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందులో గుంకీ ఎనుగు డీఎంకే, కాంగ్రెస్ కూటమి అని, మదపుటేనుగు, తోడేలు, ముళ్ల పంది, నక్క ఎవ్వరో ఈ పాటికి ఓటర్లకు అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమ కూటమి అన్నాడీఎంకేకు అనుకూలంగా పుట్టుకొచ్చిందని ఆరోపించారు.
ప్రజా సంక్షేమ కూటమి లక్ష్యం మళ్లీ జయలలితను సీఎం చేయడమేనని పేర్కొన్నారు. వారి కుట్రల్ని భగ్నం చేద్దామని, డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కరుణానిధి చేతికి అధికార పగ్గాలు అప్పగిద్దామని పిలుపునిచ్చారు. ఏదో మాయాజాలం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, వారి పాచికలు ఇక్కడ పారబోవని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్నే అమలు చేయని కేంద్రంలోని పాలకులు, ఇక్కడ అంతా ఇచ్చేస్తారంటా..? అని ఎద్దేవా చేశారు. జౌళి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న కోయంబత్తూరు జిల్లా ఇప్పుడు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ అన్నాడీఎంకేకు అవకాశాలు ఇస్తూ రావడంతోనే, ఓటర్లు ఆ పార్టీకి చులకన అయ్యారని సూచించారు. ఏనుగుల మీద చూపించే ప్రేమను కూడా ఇక్కడి ఓటర్ల మీద ఆ పార్టీ అధినేత్రి చూపించడం లేదని మండి పడ్డారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా మొదటి స్థానంలో ఉండేదని, ఇప్పుడు చివరి స్థానానికి చేరిందని వ్యాఖ్యానించారు. ఇతర రంగాల్లో వెనుకబడుతూ వస్తున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కు నెట్టడం, వీధివీధికి ఓ టాస్మాక్ తెరిచి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం వంటివే ఐదేళ్ల అన్నాడీఎంకే అధినేత్రి పాలన ఘనత అని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలని డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఆదరించాలని విన్నవించారు.
ఎదుర్కొంటా!
Published Fri, May 13 2016 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement