ఈవీకేఎస్‌కే చాన్స్?
సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక వివాదానికి పరిష్కారం లభించక తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు రూటు మార్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈవీకేఎస్‌కే మళ్లీ చాన్స్ అప్పగించే విధంగా, అధ్యక్ష పదవిలో కొనసాగింపునకు కసరత్తుల్లో పడ్డట్టు సమాచారం.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈవీకేఎస్ ఇళంగోవన్ రాజీనామా చేసి నెలన్నర రోజులకు పైగా అవుతున్నది. ఇంత వరకు కొత్త అధ్యక్షుడి నియామకం జరగలేదు. ఇందుకు కార ణం కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలేతమ కంటే, తమకు అధ్యక్ష పదవి కేటాయించాలంటూ, పలువురు ఢిల్లీకి ఉరకలు తీశారు. ఓ రోజు ఒకరి పేరు, మరోరోజు మరొకరి పేరు అన్నట్టుగా అధ్యక్ష పదవి కుర్చీలాట సాగింది.
ఈ గ్రూపు రాజకీయాల పుణ్యమా కాంగ్రెస్ చరిత్రలతో ప్రప్రథమంగా తమిళనాడు అధ్యక్షుడ్ని నియమించలేని పరిస్థితి ఢిల్లీ పెద్దలకు ఏర్పడింది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రంగంలోకి దిగినా, కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయలేని పరిస్థితి. పలానా వ్యక్తిని ఎంపిక చేద్దామనుకుంటే, మరుసటి రోజే హెచ్చరికలు, ఫిర్యాదుల హోరు సాగుతుండడంతో అధ్యక్ష ఎంపిక ఢిల్లీ వర్గాలకు శిరోభారంగా మారింది. అధ్యక్ష ఎంపికలో ఇన్నాళ్లు తలలు పట్టుకుంటూ వచ్చిన ఢిల్లీ పెద్దలు ఇక, రూటు మార్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికను తాత్కాలికంగా పక్కన పెట్టి, ఈవీకేఎస్‌ను కొనసాగించేందుకు తగ్గట్టుగా మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.
ఈవీకేఎస్‌కు చాన్స్: స్థానిక సమరం కసరత్తుల్లో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు మునిగి ఉన్నాయి. అందరికన్నా ముందుగా క్లీన్ స్వీప్ లక్ష్యంగా అన్నాడీఎంకే ఉరకలు తీస్తుంటే, సత్తా చాటేందుకు డీఎంకే ప్రయత్నాల్లో ఉన్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది సభ్యుల్ని కలిగి డీఎంకే తదుపరి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌లో స్థానిక పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇందుకు కారణం అధ్యక్షుడు లేకపోవడమే. కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని పదే పదే జిల్లాల అధ్యక్షులు విన్నవించుకున్నా, గ్రూపు తగాదాలతో బ్రేక్‌లు పడడంతో స్థానిక సమరం కసరత్తుల్లో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. దీంతో కేడర్‌లో ఆందోళన బయలు దేరినట్టు అయింది. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం కొత్త అధ్యక్షుడ్ని ఈ పరిస్థితుల్లో ఎంపిక చేయడం కష్టతరంగా భావించింది.
అందుకే కాబోలు ఈవీకేఎస్‌ను కొనసాగించే విధంగా కొత్త మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు ఈవీకేఎస్ అంగీకరించేనా అన్న ప్రశ్న బయలు దేరినా, అధిష్టానం ఒత్తిడికి తలొగ్గే అవకాశాలు ఎక్కువే. అందుకే కాబోలు ఈవీకేఎస్‌కు ఢిల్లీ నుంచి ఆహ్వానం వచ్చినట్టుగా సమాచారాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చినా, బయలు దేరడానికి ఈవీకేఎస్ యోచిస్తున్నట్టు సమాచారం. అధిష్టానం ఒత్తిడితో అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఈవీకేఎస్ అంగీకరించిన పక్షంలో గ్రూపు రాజకీయాల వివాదాలు కాంగ్రెస్‌లో మరింత తారా స్థాయికి చేరేనా.. లేదా తన రాజకీయంతో అణగదొక్కేనా అన్నది వేచి చూడాల్సిందే.