State Congress president
-
మాకో చాన్స్ ప్లీజ్ !
రాష్ట్ర కాంగ్రెస్‌లో సమర్థులైన మహిళా నాయకురాళ్లు ఉన్నారని, వారిలో ఎవరో ఒకర్ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా ఏఐసీసీ మహిళా విభాగం కార్యదర్శి, ఆ విభాగం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నగ్మా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి, చెన్నై: రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈవీకేఎస్. ఇలంగోవన్ రాజీనామా చేసి వంద రోజులు అవుతోంది. అయితే, ఇంత వరకు అధ్యక్ష నియామకం జరగలేదు. ఇందుకు కారణం, ఇక్కడి నాయకుల్లో సాగుతున్న గ్రూపు వివాదాలే. ఈ పరిస్థితుల్లో పురుషులకు దీటుగా తామూ ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నామని చాటే విధంగా మహిళల తరఫున నగ్మా గళం విప్పే పనిలో పడడం విశేషం. అది కూడా అధ్యక్ష పదవికి మహిళలు అర్హులే అంటూ, వారిలోనూ సమర్థులు ఉన్నారని, వాళ్లలో ఎవర్నో ఒకర్ని అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయమే. నగ్మా వ్యాఖ్యలు మహిళా నాయకుల్లో జోష్‌ను నింపాయి. మహిళకు చాన్స్ ప్లీజ్: బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గం భేటీ చెన్నైలో జరగనుంది. ఇందు కోసం ఢిల్లీ నుంచి నగ్మా చెన్నైకు వచ్చారు. ఆమెకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాన్సీరాణి, నిర్వాహకులు మనోహరి, సరస్వతి, మైథిల్ దేవి సత్యమూర్తి భవన్లో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం ముఖ్య నాయకులతో నగ్మా సమాలోచన నిర్వహించారు. తదుపరి మీడియాతో మాట్లాడారు. ధరల పెరుగుదల ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల కట్టడికి కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావేరి జల వివాదం గురించి తనకు పూర్తిగా తెలియదంటూ, ఈ విషయంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతి హత్య మొదలు తూత్తుకుడిలో చర్చ్‌లో ప్రార్థనల్లో ఉన్న యువతి హత్య వరకు చూస్తుంటే, ఇక్కడ మహిళలకు ఉన్న భ ద్రత ఏ పాటిదో స్పష్టం అవుతోందన్నారు. మహిళ నాయకులకు కూడా భద్రత లేని పరిస్థితిని ఇక్కడ తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించాలని, మహిళలకు రక్షణగా నిలబడే విధంగా చర్యల్ని వేగవం తం చేయాలన్నారు. పార్టీ అన్నాక సమస్యలు సర్వసాధరణమేనని, త్వర లో అధ్యక్షుడ్ని నియమించేందుకు తగ్గ కార్యచరణతో అధిష్టానం పెద్దలు ముందుకు సాగుతున్నారన్నారు. సమర్థులైన మహిళలు ఇక్కడ ఉన్నారని, వారిలో ఒకరికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష అవకాశం కల్పించాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. అయితే, తాను ఇక్కడి నాయకుల్ని(పురుషులు) కించ పరచడం లేదని, పార్టీకి స్త్రీ, పురుషులు అన్న బేధం లేదని, అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా పదవులు దక్కుతాయని, త్వరలో అధ్యక్షుడు ఎవరో అన్నది తేలుతుందని ముగించారు. ముందుగా, విల్లుపురం జిల్లా పార్టీ నాయకురాలు రీటా అంటోని ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డను నగ్మాకు చూపించి, ఆమె చేత పేరు పెట్టించుకున్నారు. ఈ బిడ్డకు నల్లతంబి రబి ఆంటోని అని నగ్మా నామకరణం చేశారు. -
ఈవీకేఎస్కే చాన్స్?
సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక వివాదానికి పరిష్కారం లభించక తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు రూటు మార్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈవీకేఎస్కే మళ్లీ చాన్స్ అప్పగించే విధంగా, అధ్యక్ష పదవిలో కొనసాగింపునకు కసరత్తుల్లో పడ్డట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈవీకేఎస్ ఇళంగోవన్ రాజీనామా చేసి నెలన్నర రోజులకు పైగా అవుతున్నది. ఇంత వరకు కొత్త అధ్యక్షుడి నియామకం జరగలేదు. ఇందుకు కార ణం కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలేతమ కంటే, తమకు అధ్యక్ష పదవి కేటాయించాలంటూ, పలువురు ఢిల్లీకి ఉరకలు తీశారు. ఓ రోజు ఒకరి పేరు, మరోరోజు మరొకరి పేరు అన్నట్టుగా అధ్యక్ష పదవి కుర్చీలాట సాగింది. ఈ గ్రూపు రాజకీయాల పుణ్యమా కాంగ్రెస్ చరిత్రలతో ప్రప్రథమంగా తమిళనాడు అధ్యక్షుడ్ని నియమించలేని పరిస్థితి ఢిల్లీ పెద్దలకు ఏర్పడింది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రంగంలోకి దిగినా, కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయలేని పరిస్థితి. పలానా వ్యక్తిని ఎంపిక చేద్దామనుకుంటే, మరుసటి రోజే హెచ్చరికలు, ఫిర్యాదుల హోరు సాగుతుండడంతో అధ్యక్ష ఎంపిక ఢిల్లీ వర్గాలకు శిరోభారంగా మారింది. అధ్యక్ష ఎంపికలో ఇన్నాళ్లు తలలు పట్టుకుంటూ వచ్చిన ఢిల్లీ పెద్దలు ఇక, రూటు మార్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎంపికను తాత్కాలికంగా పక్కన పెట్టి, ఈవీకేఎస్ను కొనసాగించేందుకు తగ్గట్టుగా మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈవీకేఎస్‌కు చాన్స్: స్థానిక సమరం కసరత్తుల్లో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు మునిగి ఉన్నాయి. అందరికన్నా ముందుగా క్లీన్ స్వీప్ లక్ష్యంగా అన్నాడీఎంకే ఉరకలు తీస్తుంటే, సత్తా చాటేందుకు డీఎంకే ప్రయత్నాల్లో ఉన్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది సభ్యుల్ని కలిగి డీఎంకే తదుపరి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌లో స్థానిక పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇందుకు కారణం అధ్యక్షుడు లేకపోవడమే. కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని పదే పదే జిల్లాల అధ్యక్షులు విన్నవించుకున్నా, గ్రూపు తగాదాలతో బ్రేక్‌లు పడడంతో స్థానిక సమరం కసరత్తుల్లో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. దీంతో కేడర్‌లో ఆందోళన బయలు దేరినట్టు అయింది. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం కొత్త అధ్యక్షుడ్ని ఈ పరిస్థితుల్లో ఎంపిక చేయడం కష్టతరంగా భావించింది. అందుకే కాబోలు ఈవీకేఎస్ను కొనసాగించే విధంగా కొత్త మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు ఈవీకేఎస్ అంగీకరించేనా అన్న ప్రశ్న బయలు దేరినా, అధిష్టానం ఒత్తిడికి తలొగ్గే అవకాశాలు ఎక్కువే. అందుకే కాబోలు ఈవీకేఎస్‌కు ఢిల్లీ నుంచి ఆహ్వానం వచ్చినట్టుగా సమాచారాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చినా, బయలు దేరడానికి ఈవీకేఎస్ యోచిస్తున్నట్టు సమాచారం. అధిష్టానం ఒత్తిడితో అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఈవీకేఎస్ అంగీకరించిన పక్షంలో గ్రూపు రాజకీయాల వివాదాలు కాంగ్రెస్‌లో మరింత తారా స్థాయికి చేరేనా.. లేదా తన రాజకీయంతో అణగదొక్కేనా అన్నది వేచి చూడాల్సిందే.