మాకో చాన్స్ ప్లీజ్ !
రాష్ట్ర కాంగ్రెస్‌లో సమర్థులైన మహిళా నాయకురాళ్లు ఉన్నారని, వారిలో ఎవరో ఒకర్ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా ఏఐసీసీ మహిళా విభాగం కార్యదర్శి, ఆ విభాగం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ నగ్మా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సాక్షి, చెన్నై: రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈవీకేఎస్. ఇలంగోవన్ రాజీనామా చేసి వంద రోజులు అవుతోంది. అయితే, ఇంత వరకు అధ్యక్ష నియామకం జరగలేదు. ఇందుకు కారణం, ఇక్కడి నాయకుల్లో సాగుతున్న గ్రూపు వివాదాలే. ఈ పరిస్థితుల్లో పురుషులకు దీటుగా తామూ ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నామని చాటే విధంగా మహిళల తరఫున నగ్మా గళం విప్పే పనిలో పడడం విశేషం. అది కూడా అధ్యక్ష పదవికి మహిళలు అర్హులే అంటూ, వారిలోనూ సమర్థులు ఉన్నారని, వాళ్లలో ఎవర్నో ఒకర్ని అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయమే.
నగ్మా వ్యాఖ్యలు మహిళా నాయకుల్లో జోష్‌ను నింపాయి. మహిళకు చాన్స్ ప్లీజ్: బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గం భేటీ చెన్నైలో జరగనుంది. ఇందు కోసం ఢిల్లీ నుంచి నగ్మా చెన్నైకు వచ్చారు. ఆమెకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జాన్సీరాణి, నిర్వాహకులు మనోహరి, సరస్వతి, మైథిల్ దేవి సత్యమూర్తి భవన్‌లో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం ముఖ్య నాయకులతో నగ్మా సమాలోచన నిర్వహించారు. తదుపరి మీడియాతో మాట్లాడారు. ధరల పెరుగుదల ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల కట్టడికి కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కావేరి జల వివాదం గురించి తనకు పూర్తిగా తెలియదంటూ, ఈ విషయంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతి హత్య మొదలు తూత్తుకుడిలో చర్చ్‌లో ప్రార్థనల్లో ఉన్న యువతి హత్య వరకు చూస్తుంటే, ఇక్కడ మహిళలకు ఉన్న భ ద్రత ఏ పాటిదో స్పష్టం అవుతోందన్నారు. మహిళ నాయకులకు కూడా భద్రత లేని పరిస్థితిని ఇక్కడ తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించాలని, మహిళలకు రక్షణగా నిలబడే విధంగా చర్యల్ని వేగవం తం చేయాలన్నారు. పార్టీ అన్నాక సమస్యలు సర్వసాధరణమేనని, త్వర లో అధ్యక్షుడ్ని నియమించేందుకు తగ్గ కార్యచరణతో అధిష్టానం పెద్దలు ముందుకు సాగుతున్నారన్నారు.
సమర్థులైన మహిళలు ఇక్కడ ఉన్నారని, వారిలో ఒకరికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష అవకాశం కల్పించాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. అయితే, తాను ఇక్కడి నాయకుల్ని(పురుషులు) కించ పరచడం లేదని, పార్టీకి స్త్రీ, పురుషులు అన్న బేధం లేదని, అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా పదవులు దక్కుతాయని, త్వరలో అధ్యక్షుడు ఎవరో అన్నది తేలుతుందని ముగించారు. ముందుగా, విల్లుపురం జిల్లా పార్టీ నాయకురాలు రీటా అంటోని ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డను నగ్మాకు చూపించి, ఆమె చేత పేరు పెట్టించుకున్నారు. ఈ బిడ్డకు నల్లతంబి రబి ఆంటోని అని నగ్మా నామకరణం చేశారు.