వరదల తాకిడిలో కొట్టుకెళ్లిందనుకున్న కాంగ్రెస్ గ్రూపు వివాదం, మళ్లీ వెడెక్కింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వర్గానికి చెందిన మహిళా నేతలకు ఉద్వాసన పలుకుతూ ఆ విభాగం అధ్యక్షురాలు విజయధరణి వ్యవహరించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈవీకేఎస్ ఆమె చర్యలపై ఢిల్లీ పెద్దలకు లేఖాస్త్రం సంధించారు.
సాక్షి, చెన్నై:
కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాల గురించి తెలిసిందే. ఈ వివాదాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల కొత్త మలుపుతో మరో వివాదం రాజుకుంది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, మహిళా విభాగం అధ్యక్షురాలు విజయధరణి మధ్య రాజుకున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తొలుత పోలీసు స్టేషన్‌కు తదుపరి ఢిల్లీకి సైతం చేరింది. ఇద్దరు నేతలూ ఢిల్లీ పెద్దల్ని కలిసి మరీ తమతమ వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో చెన్నైలో వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ వివాదం ఆ వరదల్లో కొట్టుకెళ్లినట్టేనని కాంగ్రెస్ వర్గాలు భావించాయి.
అయితే వరదలు తగ్గుముఖం పట్టిన తదుపరి మళ్లీ తెర మీదకు వచ్చింది. చెన్నైకు వచ్చిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవనీయకుండా పార్టీ పెద్దలు అడ్డుకోవడాన్ని విజయధరణి తీవ్రంగా పరిగణించడమే కాకుండా, ఈవీకేఎస్ మద్దతు దారుల్ని పార్టీ నుంచి తొలగిస్తూ చర్యలు చేపట్టి కయ్యానికి మళ్లీ కాలు దువ్వడం గమనార్హం.మళ్లీ ఢిల్లీకి: వరదల్లో కొట్టుకెళ్లి ఈ ఇద్దరు అధ్యక్షుల వివాదం మళ్లీ ఢిల్లీకి చేరింది. రెండు రోజుల క్రితం వరద బాధితుల పరామర్శకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైకు వచ్చారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు మీనంబాక్కం విమానాశ్రయానికి వెళ్లిన విజయధరణికి అనుమతి లభించలేదు.
రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల సూచన మేరకే ఆమెను భద్రతా సిబ్బందిలోనికి అనుమతించ లేదని సమాచారం. రాహుల్‌ను కలవనీయకుండా తనను అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విజయధరణి మళ్లీ కయ్యానికి కాలు దువ్వారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ మద్దతుదారులుగా ఉన్న మహిళా నాయకులను తన విభాగం నుంచి తొలగించారు. దీంతో వివాదం మళ్లీ రాజుకుంది. పార్టీకి వ్యతిరేకంగా వాళ్లు వ్యవహరించినందుకే తొలగించినట్టు విజయధరణి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన తనను విమానాశ్రయంలోకి అనుమతించకుండా అడ్డుకున్న భద్రతా సిబ్బంది మీద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, తమ వాళ్లను తొలగించడాన్ని ఈవీకేఎస్ తీవ్రంగానే పరిగణించారు. విజయధరణి చర్యల్ని ఖండిస్తూ, ఆమె కారణంగా పార్టీలో నెలకొంటున్న గందరగోళాన్ని వివరిస్తూ ఢిల్లీ పెద్దలకు గురువారం లే ఖాస్త్రం సంధించినట్టు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్ వర్గాల సమాచారం. దీంతో వ్యవహారం మళ్లీ ఢిల్లీకి చేరినట్టు అయింది.
తనకు వ్యతిరేకంగా ఈవీకేఎస్ లేఖాస్త్రం సంధించి ఉండడంతో తాడో పేడో తేల్చుకునేందుకు విజయధరణి కూడా సిద్ధమైనట్టుగా ఆమె మద్దతు వర్గం పేర్కొంటోంది. ఆదివారం అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకుని, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా కొన్ని వర్గాలతో కలసి ఎదురు దాడికి సిద్ధం అవుతోండడంతో మళ్లీ కాంగ్రెస్ రాజకీయాలు కొన్ని ఎపిసోడ్‌లు గడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఢిల్లీకి మళ్లీ పంచాయితీ
Published Fri, Dec 11 2015 3:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
Advertisement