Vijayadharani
-
అయ్యో.. విజయధరణి
సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గడంతో బీజేపీలో చేరిన విలవన్ కోడ్ మాజీ ఎమ్మెల్యే విజయధరణి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ కోసం ఉన్న ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసిన తనకు ఇంత వరకు ఎలాంటి పదవి దక్కక పోవడంతో తీవ్ర మనో వేదనలో ఉన్నారు. తన ఆవేదనను బీజేపీ సమావేశంలో ఆమె వెల్లగక్కడం చర్చకు దారి తీసింది. కన్యాకుమారి జిల్లా విలవన్ కోడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011, 2016, 2021లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయధరణి గెలిచారు. మూడు సార్లు ఆమె అసెంబ్లీకి ఎన్నికైనా కాంగ్రెస్‌లో సరైన గుర్తింపు అన్నది దక్కలేదు.పార్టీ పరంగా పదవులు ఆమెను దరిచేరనివ్వకుండా సీనియర్లు అడ్డుకుంటున్నట్టుగా పలుమార్లు ఆమె తన మద్దతు దారుల వద్ద అసంతృప్తితో స్పందించి ఉన్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ సమయంలో తనకు కన్యాకుమారి లోక్ సభ సీటు ఇవ్వాలని ఆమె కోరారు. లేదా తన సిట్టింగ్ సీటు విలవన్ కోడ్ మళ్లీ అప్పగించాలని కోరారు. బీజేపీ పెద్దల హామీతో తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. అదే సమయంలో విలవన్ కోడ్ అసెంబ్లీకి ఉప ఎన్నికనగారా మోగింది. అయితే విజయధరణి కాకుండా మరో అభ్యరి్థని బీజేపీ ప్రకటించింది. దీంతో విజయధరణికి మిగిలింది కన్నీళ్లే. ఆమె ఆశించిన కన్యాకుమారి లోక్‌సభ సీటును బీజేపీ కేటాయించ లేదు. వరుసగా బీజేపీ వర్గాలు షాక్ ఇచ్చినా, చివరకు సర్దుకుంటూ వచ్చిన ఆమె చెన్నై వేదికగా సోమవారం జరిగిన కార్యక్రమంలో తన మదిలోని ఆవేదనను వెల్లగక్కేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని. బీజేపీ కోసం పదవిని త్యాగం చేశానని, అయితే ఇంత వరకు తనకు ఎలాంటి పదవీ అన్నది పారీ్టలో దక్కలేదని ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఎదురు చూపులు, ఆశతో బీజేపీలోకి వచ్చానని, శ్రమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న ఆకాంక్షతో ఉరకలు తీశానని, అయితే ప్రస్తుతం తనకు మిగిలింది ఆవేదన అని ఆయన బహిరంగంగానే తన మదిలో మాటాలను బయట పెట్టడం చర్చకు దారి తీసింది. బీజేపీ నేతల గురించి ఈసందర్భంగా ప్రస్తావిస్తూ, ఒక అన్న, ఒక తమ్ముడుగా అందరూ తనకు ఉన్నారని, అయితే పదవీ మాత్రం దక్కలేదని పేర్కొనడం గమనార్హం. -
స్పీకర్ నాపై ‘లైంగిక’ వ్యాఖ్యలు చేశారు: మహిళా ఎమ్మెల్యే
చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ విజయధరణి రాష్ట్ర స్పీకర్ పీ ధన్‌పాల్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనను ఉద్దేశించి సభలో స్పీకర్ లైంగికపరమైన వ్యాఖ్యలు చేశారని, దీంతో తాను కన్నీటిపర్యంతమయ్యానని ఆమె మంగళవారం మీడియాకు తెలిపారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి తన నియోజకవర్గం సమస్యలను లేవనెత్తేందుకు ప్రయత్నించారు. కన్యాకుమారి జిల్లాలో ఇటీవల ముగ్గురు విద్యుత్ షాక్‌తో మరణించారని, అందులో ఒకరు తన నియోజకవర్గానికి చెందిన వారని, మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆమె సభలో అభ్యర్థించారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోయినా ఆమె మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారు. స్పీకర్‌కు దమ్ముంటే తనపై చర్య తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఆమెను మార్షల్స్ బలవంతంగా సభ బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి.. సభలో తన అభ్యర్థనను స్పీకర్ వినిపించుకోలేదని, అంతేకాకుండా ఆ విషయంలో మంత్రితో ‘పర్సనల్ డీల్’ (వ్యక్తిగత ఒప్పందం) చేసుకోవాలంటూ తనను ఉద్దేశించి లైంగికపరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె తెలిపారు. ‘మీరు, మంత్రి కలిసి వ్యక్తిగత ఒప్పందం చేసుకోండి. ఇందులోకి సభను లాగవద్దు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలతో తాను ఆవేదన చెంది కన్నీటిపర్యంతమయ్యాయనని ఆమె తెలిపారు. అంతకుముందు సభలో విజయధరణి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఆమె ఇలా అనుచితంగా వ్యవహరించడం తొలిసారి కాదని, పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సభలోని సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు తరలించారు. అనంతరం కాంగ్రెస్ సభాపక్ష నేత కేఆర్ రామస్వామి ఈ విషయం సభలో లేవనెత్తేందుకు ప్రయత్నించినా.. స్పీకర్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసనగా వాకౌట్ చేశారు. -
'ఆ ఇద్దరే పార్టీలో మిగులుతారు'
చెన్నై: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే విజయధరణికి ఉద్వాసన పలకాలని ఆ పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అధిష్టానానికి ఫిర్యాదులు పంపించే పనిలో పడ్డాయి. ఇక, అందర్నీ బయటకు పంపించి ఈవీకేఎస్, కుష్భులు మాత్రమే కాంగ్రెస్‌లో మిగులుతారని విజయధరణి మండి పడ్డారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంతో భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యే విజయధరణి ఆలోచనలో పడ్డారు. అన్నాడీఎంకే తలుపులు తెరచుకోక పోవడంతో బీజేపీ వైపు మొగ్గే దిశగా పావులు కదుపుతున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, అధికార ప్రతినిధి కుష్భుపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. దీంతో విజయధరణిపై కాంగ్రెస్ వర్గాలు మండి పడుతున్నాయి. ఆమెను పార్టీ నుంచి తొలగించాలని పట్టుబట్టే పనిలో పడ్డాయి. ఆమెకు ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వొద్దని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీకి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, ఈవీకేఎస్ మద్దతు దారులు అయితే, ఆమెను పార్టీ నుంచి తొలగించాల్సిందే అన్న నినాదంతో అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదుల్ని పంపించే పనిలో పడ్డారు. తాజా పరిణామాలపై విజయధరణి స్పందిస్తూ అందర్నీ కాంగ్రెస్ నుంచి బయటకు పంపించడం లక్ష్యంగా ఈవీకేఎస్ కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్పార్టీరాష్ట్రంలో సర్వనాశనం అవుతోందని, ఇందుకు ప్రధాన కారకుడు ఆయనే అని ఆరోపించారు. అందర్నీ బయటకు పంపించి చివరకు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఈవీకేఎస్, కుష్భులు మాత్రం మిగలుతారని ఎద్దేవా చేశారు. -
కుష్భూతో ఎప్పుడూ సమస్యలే...
చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మహిళా ద్వేషి అని ఆ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి ధ్వజమెత్తారు. డీఎంకే కుటుంబంలో సమస్యలు సృష్టించి వచ్చిన కుష్బూ, ఇప్పుడు కాంగ్రెస్‌లో సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన అనంతరం తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి విజయధరణికి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఝాన్సీరాణి నియమితులయ్యారు. అయితే విజయధరణి ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఆమె అన్నాడీఎంకేలోకి చేరేందుకు సన్నద్ధం అవుతున్నారంటూ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందని ఆదివారం విజయధరణి స్పష్టం చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్, అధికార ప్రతినిధి కుష్భుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ మహిళా విభాగాన్ని అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మహిళలు అంటే పడదు అని, తనతో మాత్రమే కాదని, అందరితోనూ ఆయన వ్యవహార శైలి ఇలాగే ఉంటుందని శివాలెత్తారు. చెప్పాలంటే ఆయన మహిళా ద్వేషి అని, అందుకే సీఎం జయలలిత, బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్లపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించి ఉన్నారని గుర్తు చేశారు. ఇలాంటి నాయకుడి వల్ల కాంగ్రెస్‌లోని మహిళలు తీవ్ర ఇబ్బందులు, ఆవేదనకు గురి అవుతున్నారని ఆరోపించారు. ఇక, అధికార ప్రతినిధి కుష్భు గురించి చెప్పాలంటే, డీఎంకే కుటుంబంలో పెద్ద చిచ్చును పెట్టి, ఇక్కడికి వచ్చారని , ఇక్కడ కూడా సమస్యల్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తనకు పదవి దూరం కావడం వెనుక కుష్భు పాత్ర కూడా ఉన్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. తనకు సీఎం జయలలిత అంటే ఎంతో ఇష్టం, గౌరవం అని ఆమె వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీలో ఏదేని సమస్యను ప్రస్తావించినప్పుడల్లా, ఆమె అభినందించే విధంగా స్పందిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లినప్పుడల్లా అభినందించే వారని, ఆ విధంగానే నియోజకవర్గ సమస్యలు, వ్యక్తిగత సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకెళ్లడానికి అపాయింట్ మెంట్ కోరినట్టు పేర్కొన్నారు. త్వరలో ఆమెను కలుస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, తనకు ప్రజా కూటమి వర్గాలు, బీజేపీ వర్గాలు మద్దతును ఇచ్చే విధంగా ఆహ్వానించి ఉన్నాయన్నారు. అయితే తాను కాంగ్రెస్‌లోనే ఉన్న దృష్ట్యా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడానికి అపాయింట్మెంట్ కోరానని, ఆయనతో జరిగే భేటీ అనంతరం తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందన్నారు. తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం మహిళా విభాగం బలోపేతమైందన్న సత్యం రాహుల్ గాంధీకి కూడా తెలుసు అని వ్యాఖ్యానించారు. ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో, అందుకు తగ్గట్టుగా తన అడుగులు వేయక తప్పదని ముగించారు. -
ఢిల్లీకి మళ్లీ పంచాయితీ
వరదల తాకిడిలో కొట్టుకెళ్లిందనుకున్న కాంగ్రెస్ గ్రూపు వివాదం, మళ్లీ వెడెక్కింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వర్గానికి చెందిన మహిళా నేతలకు ఉద్వాసన పలుకుతూ ఆ విభాగం అధ్యక్షురాలు విజయధరణి వ్యవహరించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈవీకేఎస్ ఆమె చర్యలపై ఢిల్లీ పెద్దలకు లేఖాస్త్రం సంధించారు. సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాల గురించి తెలిసిందే. ఈ వివాదాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల కొత్త మలుపుతో మరో వివాదం రాజుకుంది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, మహిళా విభాగం అధ్యక్షురాలు విజయధరణి మధ్య రాజుకున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తొలుత పోలీసు స్టేషన్‌కు తదుపరి ఢిల్లీకి సైతం చేరింది. ఇద్దరు నేతలూ ఢిల్లీ పెద్దల్ని కలిసి మరీ తమతమ వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో చెన్నైలో వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ వివాదం ఆ వరదల్లో కొట్టుకెళ్లినట్టేనని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. అయితే వరదలు తగ్గుముఖం పట్టిన తదుపరి మళ్లీ తెర మీదకు వచ్చింది. చెన్నైకు వచ్చిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవనీయకుండా పార్టీ పెద్దలు అడ్డుకోవడాన్ని విజయధరణి తీవ్రంగా పరిగణించడమే కాకుండా, ఈవీకేఎస్ మద్దతు దారుల్ని పార్టీ నుంచి తొలగిస్తూ చర్యలు చేపట్టి కయ్యానికి మళ్లీ కాలు దువ్వడం గమనార్హం.మళ్లీ ఢిల్లీకి: వరదల్లో కొట్టుకెళ్లి ఈ ఇద్దరు అధ్యక్షుల వివాదం మళ్లీ ఢిల్లీకి చేరింది. రెండు రోజుల క్రితం వరద బాధితుల పరామర్శకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైకు వచ్చారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు మీనంబాక్కం విమానాశ్రయానికి వెళ్లిన విజయధరణికి అనుమతి లభించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల సూచన మేరకే ఆమెను భద్రతా సిబ్బందిలోనికి అనుమతించ లేదని సమాచారం. రాహుల్‌ను కలవనీయకుండా తనను అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విజయధరణి మళ్లీ కయ్యానికి కాలు దువ్వారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ మద్దతుదారులుగా ఉన్న మహిళా నాయకులను తన విభాగం నుంచి తొలగించారు. దీంతో వివాదం మళ్లీ రాజుకుంది. పార్టీకి వ్యతిరేకంగా వాళ్లు వ్యవహరించినందుకే తొలగించినట్టు విజయధరణి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన తనను విమానాశ్రయంలోకి అనుమతించకుండా అడ్డుకున్న భద్రతా సిబ్బంది మీద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, తమ వాళ్లను తొలగించడాన్ని ఈవీకేఎస్ తీవ్రంగానే పరిగణించారు. విజయధరణి చర్యల్ని ఖండిస్తూ, ఆమె కారణంగా పార్టీలో నెలకొంటున్న గందరగోళాన్ని వివరిస్తూ ఢిల్లీ పెద్దలకు గురువారం లే ఖాస్త్రం సంధించినట్టు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్ వర్గాల సమాచారం. దీంతో వ్యవహారం మళ్లీ ఢిల్లీకి చేరినట్టు అయింది. తనకు వ్యతిరేకంగా ఈవీకేఎస్ లేఖాస్త్రం సంధించి ఉండడంతో తాడో పేడో తేల్చుకునేందుకు విజయధరణి కూడా సిద్ధమైనట్టుగా ఆమె మద్దతు వర్గం పేర్కొంటోంది. ఆదివారం అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకుని, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా కొన్ని వర్గాలతో కలసి ఎదురు దాడికి సిద్ధం అవుతోండడంతో మళ్లీ కాంగ్రెస్ రాజకీయాలు కొన్ని ఎపిసోడ్లు గడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి.