'ఆ ఇద్దరే పార్టీలో మిగులుతారు'
చెన్నై: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే విజయధరణికి ఉద్వాసన పలకాలని ఆ పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అధిష్టానానికి ఫిర్యాదులు పంపించే పనిలో పడ్డాయి. ఇక, అందర్నీ బయటకు పంపించి ఈవీకేఎస్, కుష్భులు మాత్రమే కాంగ్రెస్‌లో మిగులుతారని విజయధరణి మండి పడ్డారు.
మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంతో భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యే విజయధరణి ఆలోచనలో పడ్డారు. అన్నాడీఎంకే తలుపులు తెరచుకోక పోవడంతో బీజేపీ వైపు మొగ్గే దిశగా పావులు కదుపుతున్నారు.
అదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, అధికార ప్రతినిధి కుష్భుపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. దీంతో విజయధరణిపై కాంగ్రెస్ వర్గాలు మండి పడుతున్నాయి. ఆమెను పార్టీ నుంచి తొలగించాలని పట్టుబట్టే పనిలో పడ్డాయి.
ఆమెకు ఎలాంటి అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీకి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, ఈవీకేఎస్ మద్దతు దారులు అయితే, ఆమెను పార్టీ నుంచి తొలగించాల్సిందే అన్న నినాదంతో అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదుల్ని పంపించే పనిలో పడ్డారు.
తాజా పరిణామాలపై విజయధరణి స్పందిస్తూ అందర్నీ కాంగ్రెస్ నుంచి బయటకు పంపించడం లక్ష్యంగా ఈవీకేఎస్ కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్పార్టీరాష్ట్రంలో సర్వనాశనం అవుతోందని, ఇందుకు ప్రధాన కారకుడు ఆయనే అని ఆరోపించారు. అందర్నీ బయటకు పంపించి చివరకు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఈవీకేఎస్, కుష్భులు మాత్రం మిగలుతారని ఎద్దేవా చేశారు.