కుష్భూతో ఎప్పుడూ సమస్యలే...
చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మహిళా ద్వేషి అని ఆ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి ధ్వజమెత్తారు. డీఎంకే కుటుంబంలో సమస్యలు సృష్టించి వచ్చిన కుష్బూ, ఇప్పుడు కాంగ్రెస్‌లో సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన అనంతరం తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి విజయధరణికి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఝాన్సీరాణి నియమితులయ్యారు.
అయితే విజయధరణి ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఆమె అన్నాడీఎంకేలోకి చేరేందుకు సన్నద్ధం అవుతున్నారంటూ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందని ఆదివారం విజయధరణి స్పష్టం చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్, అధికార ప్రతినిధి కుష్భుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ మహిళా విభాగాన్ని అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనకు మహిళలు అంటే పడదు అని, తనతో మాత్రమే కాదని, అందరితోనూ ఆయన వ్యవహార శైలి ఇలాగే ఉంటుందని శివాలెత్తారు. చెప్పాలంటే ఆయన మహిళా ద్వేషి అని, అందుకే సీఎం జయలలిత, బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌లపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించి ఉన్నారని గుర్తు చేశారు. ఇలాంటి నాయకుడి వల్ల కాంగ్రెస్‌లోని మహిళలు తీవ్ర ఇబ్బందులు, ఆవేదనకు గురి అవుతున్నారని ఆరోపించారు. ఇక, అధికార ప్రతినిధి కుష్భు గురించి చెప్పాలంటే, డీఎంకే కుటుంబంలో పెద్ద చిచ్చును పెట్టి, ఇక్కడికి వచ్చారని , ఇక్కడ కూడా సమస్యల్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తనకు పదవి దూరం కావడం వెనుక కుష్భు పాత్ర కూడా ఉన్నట్టు తనకు సమాచారం ఉందన్నారు.
తనకు సీఎం జయలలిత అంటే ఎంతో ఇష్టం, గౌరవం అని ఆమె వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీలో ఏదేని సమస్యను ప్రస్తావించినప్పుడల్లా, ఆమె అభినందించే విధంగా స్పందిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లినప్పుడల్లా అభినందించే వారని, ఆ విధంగానే నియోజకవర్గ సమస్యలు, వ్యక్తిగత సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకెళ్లడానికి అపాయింట్ మెంట్ కోరినట్టు పేర్కొన్నారు. త్వరలో ఆమెను కలుస్తానని పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, తనకు ప్రజా కూటమి వర్గాలు, బీజేపీ వర్గాలు మద్దతును ఇచ్చే విధంగా ఆహ్వానించి ఉన్నాయన్నారు. అయితే తాను కాంగ్రెస్‌లోనే ఉన్న దృష్ట్యా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడానికి అపాయింట్‌మెంట్ కోరానని, ఆయనతో జరిగే భేటీ అనంతరం తన భవిష్యత్ నిర్ణయం ఉంటుందన్నారు. తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం మహిళా విభాగం బలోపేతమైందన్న సత్యం రాహుల్ గాంధీకి కూడా తెలుసు అని వ్యాఖ్యానించారు. ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో, అందుకు తగ్గట్టుగా తన అడుగులు వేయక తప్పదని ముగించారు.