
పదవి కోసం ఎదురు చూపులు
సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గడంతో బీజేపీలో చేరిన విలవన్ కోడ్ మాజీ ఎమ్మెల్యే విజయధరణి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ కోసం ఉన్న ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసిన తనకు ఇంత వరకు ఎలాంటి పదవి దక్కక పోవడంతో తీవ్ర మనో వేదనలో ఉన్నారు. తన ఆవేదనను బీజేపీ సమావేశంలో ఆమె వెల్లగక్కడం చర్చకు దారి తీసింది. కన్యాకుమారి జిల్లా విలవన్ కోడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011, 2016, 2021లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయధరణి గెలిచారు. మూడు సార్లు ఆమె అసెంబ్లీకి ఎన్నికైనా కాంగ్రెస్‌లో సరైన గుర్తింపు అన్నది దక్కలేదు.
పార్టీ పరంగా పదవులు ఆమెను దరిచేరనివ్వకుండా సీనియర్లు అడ్డుకుంటున్నట్టుగా పలుమార్లు ఆమె తన మద్దతు దారుల వద్ద అసంతృప్తితో స్పందించి ఉన్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ సమయంలో తనకు కన్యాకుమారి లోక్ సభ సీటు ఇవ్వాలని ఆమె కోరారు. లేదా తన సిట్టింగ్ సీటు విలవన్ కోడ్ మళ్లీ అప్పగించాలని కోరారు. బీజేపీ పెద్దల హామీతో తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. అదే సమయంలో విలవన్ కోడ్ అసెంబ్లీకి ఉప ఎన్నికనగారా మోగింది. అయితే విజయధరణి కాకుండా మరో అభ్యరి్థని బీజేపీ ప్రకటించింది.
దీంతో విజయధరణికి మిగిలింది కన్నీళ్లే. ఆమె ఆశించిన కన్యాకుమారి లోక్‌సభ సీటును బీజేపీ కేటాయించ లేదు. వరుసగా బీజేపీ వర్గాలు షాక్ ఇచ్చినా, చివరకు సర్దుకుంటూ వచ్చిన ఆమె చెన్నై వేదికగా సోమవారం జరిగిన కార్యక్రమంలో తన మదిలోని ఆవేదనను వెల్లగక్కేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని. బీజేపీ కోసం పదవిని త్యాగం చేశానని, అయితే ఇంత వరకు తనకు ఎలాంటి పదవీ అన్నది పారీ్టలో దక్కలేదని ఉద్వేగానికి లోనయ్యారు.
ఎన్నో ఎదురు చూపులు, ఆశతో బీజేపీలోకి వచ్చానని, శ్రమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న ఆకాంక్షతో ఉరకలు తీశానని, అయితే ప్రస్తుతం తనకు మిగిలింది ఆవేదన అని ఆయన బహిరంగంగానే తన మదిలో మాటాలను బయట పెట్టడం చర్చకు దారి తీసింది. బీజేపీ నేతల గురించి ఈసందర్భంగా ప్రస్తావిస్తూ, ఒక అన్న, ఒక తమ్ముడుగా అందరూ తనకు ఉన్నారని, అయితే పదవీ మాత్రం దక్కలేదని పేర్కొనడం గమనార్హం.