కన్నె ర్ర !
రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా గవర్నర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది పరువునష్టం దావాను బుధవారం కోర్టులో దాఖలు చేశారు. గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కల్గించే విధంగా వ్యాఖ్యలు చేసిన టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై కన్నెర్ర చేశారు.
సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు ఎవ్వరైనా గుప్పిస్తే చాలు పరువునష్టం దావాల మోత మోగుతుంది. ఇప్పటికే డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు తదితర నాయకులు ఈ దావాల్ని ఎదుర్కొంటున్నారు. ఈ దావాల పర్వం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు విచారణలకు అడ్డుకట్ట వేయాలంటూ ఉన్నత న్యాయస్థానం ద్వారా స్టేలు తెంచుకున్న నాయకులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా ప్రభుత్వం తరఫున గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన వారిపై కన్నెర్ర చేస్తూ చెన్నై సెషన్స్‌కోర్టులో పరువు నష్టం కేసు నమోదుకు పిటిషన్ దాఖలైంది.
పరువు నష్టం దావా:
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరువు నష్టం దావాల్ని కోర్టుల్లో కార్పొరేషన్ న్యాయవాది ఎంఎల్ జగన్ దాఖలు చేస్తూ రావడం తెలిసిందే. ఉదయం చెన్నై సెషన్స్ కోర్టులో ఆయన ఓ దావా దాఖలు చేశారు. అందులో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ గత నెల చివర్లో ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కలిగే విధంగా ఆధార రహిత ఆరోపణలు చేశారని వివరించారు. వీసీల నియామకంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయని, ఇందులో ఓ వాటా తనకు, మరో వాటా సీఎం జయలలితకు రోశయ్య ఇచ్చి ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు.
బాధ్యత గల పదవిలో, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఉన్న రోశయ్యపై ఆయన చేసిన ఆరోపణలు ఆధార రహితంగా పేర్కొన్నారు. రాజకీయ ఉద్దేశంతో ఈవీకేఎస్ ఈ వ్యాఖ్యలు చేసి ఉన్నారని పేర్కొంటూ, సీఎం జయలలితను సైతం కించ పరిచే విధంగా ఆధార రహితంగా వ్యాఖ్యలు చేసి ఉన్నారని కోర్టుకు వివరించారు. రాష్ర్ట గవర్నర్ పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై క్రిమినల్ కేసుగా పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నామని వివరించారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి రాజమాణిక్యం ముందు ఒకటి రెండు రోజుల్లో విచారణకు రానున్నది.