
న్యూఢిల్లీ: సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం, పరస్పర మర్యాదపూర్వక ప్రవర్తన అత్యంత అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్వేషపూరిత ప్రసంగాల్ని ఎవరూ అంగీకరించరని పేర్కొంది. హరియాణాలో ఆరుగురు ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసుల విచారణకు రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.
హరియాణా సహా వివిధ రాష్ట్రాల్లో ఒక మతం వారిని చంపేయాలంటూ చేసిన విద్వేష పూరిత ప్రసంగాల వల్ల హింస చెలరేగుతోందన్న ఆరోపణలతో దాఖలైన పిటి:షన్లను శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆగస్టు 18లోగా కమిటీ ఏర్పాటుపై కోర్టుకు సమాచారం ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్‌ను ఆదేశించింది. సమాజంలో వివిధ వర్గాల మధ్య సమరస్యపూర్వక వాతావరణం ఉండాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.