న్యూఢిల్లీ: దేశ రాజధాని సమీపంలోని హరియాణాలో మత ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని పోలీసులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హరియాణాలో మత ఘర్షణలకు నిరసనగా వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ఢిల్లీలో తలపెట్టిన ర్యాలీలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టీల సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా ఆదేశాలిచ్చింది.
నూహ్ జిల్లాలో జలై 31వ తేదీన వీహెచ్‌పీ ర్యాలీని అడ్డుకునేందుకు వేరే వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటిదాకా ఆరుగురు చనిపోయారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేష ప్రసంగాలు జరక్కుండా కట్టడిచేయాలని పాలనా యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది. సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, సంబంధిత సీసీటీవీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లను భద్రపరచాలని ఆదేశించింది. ‘ ఢిల్లీని ఆనుకుని ఉన్న హరియాణా, యూపీ ప్రాంతాల్లోనూ ర్యాలీలు జరగొచ్చు. అవసరమైతే అదనపు పోలీసు, పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపండి.
ఎలాంటి ఆస్తి నష్టం, హింస జరగకుండా చూడండి. ఏ మతానికి వ్యతిరేకంగానైనా విద్వేష ప్రసంగాలు జరక్కుండా అడ్డుకట్టవేయండి’ అని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు పాలనాయంత్రాగాలకు త్వరగా అందేలా చూడాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించింది. ‘విద్వేష ప్రసంగాలు చేసినపుడు ఫిర్యాదు కోసం వేచిచూడకుండా వెంటనే క్రిమినల్ కేసు నమోదుచేయాలని గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడూ యథాతథంగా అమలుచేయండి’ అని కోర్టు గుర్తుచేసింది. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం యంత్రాంగాలతో సంప్రదించాలని కేంద్రానికి సూచించింది.
పలుచోట్ల ర్యాలీలు
ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో 23 భారీ ర్యాలీలు చేపడతామన్న వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ పిలుపుమేరకు బుధవారం ఢిల్లీలో పలుచోట్ల ర్యాలీలు జరిగాయి. ట్రాఫిక్ స్తంభించింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద బజరంగ్‌దళ్ శ్రేణులు హనుమాన్ చాలీసా పఠించారు. వికాస్‌మార్గ్ ప్రాంతం ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు చెదరగొట్టారు.
116 అరెస్టులు: ఖట్టర్
రాష్ట్రంలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి 116 మందిని అరెస్ట్‌చేశామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణస్థితికి చేరుకుందన్నారు. లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హరియణా సర్కార్ ఏర్పాటుచేసేపనిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment